ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు.. హిట్లర్ బాట పట్టినట్లు కనిపిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యూదులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఇప్పుడు పాలస్తీనా శరణార్థులను గుంపులు, గుంపులుగా తరలిస్తున్నారు. పాలస్తీనీయులకు సహాయం అందజేస్తున్న యూఎన్ఆర్డబ్ల్యూఎను అక్కడినుంచి తొలగించాలని, సహాయం అందకుండా చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లుంది. అల్ జజిరా, బీబీసీ లాంటి వార్త సంస్థలను న్యూస్ కవర్ చేయొద్దని చూస్తున్నది. ఈమేరకు ఇజ్రాయెల్ బిల్లు తెచ్చే పనిలో ఉంది. కాన్సెంట్రేషన్ క్యాంపుల్లోకి గాజా, లెబనాన్ జర్నలిస్ట్‌లు రాకుండా చూస్తున్నారు. డ్రోన్ దాడులు, నేలమీద దాడులతో మొత్తం గాజాను ధ్వంసం చేసేశారు. యూసుఫ్ అనే ఒకరైతు పాలస్తీనీయులకు అన్నం పెడుతున్నాడని అతడిని ఇజ్రాయెల్ సైనికులు చంపేశారు. లెబనాన్‌లో ఇప్పటి వరకు 2000 మందిని చంపేశారు. మీడియా మేనేజ్మెంట్ కోసం కార్పొరేట్లకు డబ్బులిచ్చి ఇజ్రాయెల్ భీకర దాడులను, వారి దమనకాండ బయటకు రాకుండా చూస్తున్నదని సమాచారం ఉన్నది.
బీరుట్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది చనిపోయారు. యుద్ధం ఆపితే ఇప్పుడు నెతన్యాహు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అతను చేసిన తప్పులు, చివరికి ఐక్య రాజ్యసమితి మాటను కూడా ఖాతరు చేయకపోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే యుద్ధంను ఏకపక్షంగా నెతన్యాహు కొనసాగిస్తున్నాడు. హమాస్ చీఫ్ సిన్వర్ ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ బాంబింగ్‌లో హతం అయ్యాడు! అప్పుడే యుద్ధం ఆపాల్సింది. కానీ, ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసింది.
హమాస్ చీఫ్ సిన్వర్ హతమైనా కొనసాగుతున్న యుద్ధం
ఇజ్రాయెల్ మీద గత 2023 అక్టోబర్ 7న దాడి చేసి 1200 మందిని చంపడం, బందీలుగా పలువురిని తమ వద్ద ఉంచుకోవడం వల్లే హమాస్ చీఫ్ సిన్వర్‌ను హత్య చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతున్నది. సిన్వర్ తమదాడిలో చనిపోయాడని విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. హమాస్ కూడా సిన్వర్ మరణించినట్లు పేర్కొన్నది. బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను వదిలేస్తే యుద్ధం ఆపేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ ఆయుధాలు పడేయాలని, లొంగిపోవాలని కూడా నెతన్యాహు పేర్కొన్నాడు. అటు అమెరికా తమ ఇంటెలిజెన్స్ వల్లే సిన్వర్ చంపబడ్డాడని క్లైయిమ్ చేస్తున్నది. బిన్ లాడెన్ మృతిపట్ల కూడా అమెరికా ఇలాగే ప్రకటన చేసింది. నిజానికి సిన్వర్ కోసం అమెరికా, ఇజ్రాయెల్‌లు వెంటాడాయి. ఏడాదికాలంగా ఇజ్రాయెల్ గాజాలో హమాస్ ను మట్టుపెట్టే పేరిట లక్షమంది సామాన్య ప్రజల ఊపిరి తీసింది. ఇటీవలనే హమాస్ నేత ఇస్మాయిల్ హన్య మృతి చెందాడు. మరో దాడిలో అటు హిజ్బుల్లా నేత హసన్ నస్రుల్లా మృతి చెందాడు. దీంతో ఇజ్రాయిల్ యుద్ధం ఆపే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ, నెతన్యాహు యుద్ధ విరమణ మాటలు నమ్మశక్యంగా లేవు.
23 ఏండ్లు జైల్లో ఉన్న సిన్వర్!
హమాస్ చీఫ్ 23 ఏండ్లు ఇజ్రాయెల్ జైల్లో ఉండి విడుదల అయ్యాడు. హమాస్ అనేది మన భారతదేశంలో నిషేధిత సంస్థల జాబితాలో లేదు. ప్రపంచంలోని దాదాపు 44 తీవ్రవాద గ్రూప్ ల నిషేధం ఆ జాబితాలో ఉన్నప్పటికీ, అందులో హమాస్ లేకపోవడం విశేషమే! వందేండ్ల క్రితం 7 లక్షల మంది యూదులను చంపారు. 70, 80 ఏండ్ల గాజా ఆందోళనల మధ్యనే ఉన్నది. న్యాయంకోసం వారి పోరు కొనసాగుతూనే ఉన్నది. నిజానికి ఒక గ్రౌండ్ రిపోర్టును ఒక జర్నలిస్ట్ 11,000 పేజీలతో తయారు చేశాడు. వంద సంవత్సరాల సంఘర్షణ ఇది. 2011లో ఇజ్రాయెల్ జైలు నుంచి 1200 మందిని విడుదల చేశారు. అందులో సిన్వర్ కూడా ఉన్నాడు. 2021లో ఒకసారి అతని కోసం గాజాలో దాడి జరిగింది, అప్పుడు కూడా సిన్వర్ ను పట్టుకునే ప్రయత్నం విఫలం అయ్యింది. హమాస్ నేత సిన్వర్ మృతి చెందాడు కాబట్టి యుద్ధం విరమించాలి అని అటు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా కోరాయి. ఇటు గాజా అటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. అమెరికా మద్దతు ఇజ్రాయెల్‌కు లభిస్తూనే ఉన్నది.-
ఇజ్రాయెల్ యుద్ధం విరమించాలి
గాజాలో మానవ సహాయంను బంద్ చేసే కుట్రకు ఇజ్రాయెల్ మరోసారి తెర లేపింది. స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, కార్యాలయాలు, ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలను నేల మట్టం చేశారు. లక్షల మందికి తిండి, తాగునీరు లభించని పరిస్థితి ఏర్పడింది. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి కడుదీనంగా మారిన పరిస్థితి. గాజా మీద ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం మొత్తం ప్రపంచ చరిత్రలో ఏడాది కాలంగా జరుగుతున్న రాక్షస కృత్యంగా పేర్కొనవచ్చు. ఇది ఒక అమానవీయ చర్యగా పేర్కొనక తప్పదు. బాధితులకు, పీడితులకు మానవ సహాయం కూడా అందకుండా అడ్డుకోవడం ఇజ్రాయెల్ దాష్టీకం అని పేర్కొనక తప్పదు. గాజాలో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా, అక్కడ సామాన్య పరిస్థితి ఏర్పడడానికి రెండు, మూడు ఏండ్లు పడుతుంది. గాజా ప్రజల జీవించే హక్కును హరించిన ఇజ్రాయెల్ ఇకనైనా యుద్ధం విరమించాలి. నెతన్యాహు మీద ఐక్యరాజ్యసమితిలో చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ కోర్టులో శిక్షించాలి. విచ్చలవిడిగా యుద్ధ నిబంధనలను ఉల్లంఘించిన ఇజ్రాయెల్ పై తగిన చర్యలు ఉండాలి. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు పెను సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ యుద్ధం ఆపాలి.
- ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్