డోలో ట్యాబ్లెట్లా.. చాక్లెట్లా? ..ఐదేండ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు

డోలో ట్యాబ్లెట్లా.. చాక్లెట్లా? ..ఐదేండ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు
  • కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన ‘డోలో 650’ వాడకం
  • నెత్తినొచ్చినా.. జరమొచ్చినా ఇష్టమున్నట్లు మింగేస్తున్న జనం
  • అతిగా వాడితే  లివర్​, కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు
  • ‘క్యాడ్బరీ జెమ్స్​ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు’ 
  • అంటూ సోషల్​ మీడియాలో ఓ డాక్టర్​ పోస్ట్.. క్షణాల్లోనే వైరల్ 

న్యూఢిల్లీ: జ్వరమొచ్చినా, తలనొచ్చినా.. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు గతంలోకంటే రెట్టింపు అయినట్లు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. అయితే, సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతి వాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. శరీరంలో ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం, పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు. డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగునపడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  కొన్ని అనారోగ్యాలను ఎంత తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు. ఉదాహరణకు క్యాన్సర్ మహమ్మారి.. ప్రారంభ దశలో గుర్తిస్తే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించి నయం చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. 

డోలో అమ్మకాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పలనియప్పన్ మణికం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టులో డాక్టర్ పలనియప్పన్ సెటైరిక్ గా ‘భారతీయులు డోలో-650ని క్యాడ్‌‌‌‌బరీ జెమ్స్‌‌‌‌లా తీసుకుంటున్నారు’ అని అన్నారు. కాగా, కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపించిన విషయం అందరికే తెలిసిందే. ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా డోలో వాడాలని బాధితులకు సూచించారు. అప్పట్లో డోలో వాడకం బాగా పెరిగింది. ఆ తర్వాత కూడా ఇంటింటా డోలో ట్యాబ్లెట్ వాడకం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. కరోనాకు ముందు డోలో 650 ట్యాబ్లెట్లు ఏటా 7.5 కోట్ల స్ట్రిప్స్ విక్రయించగా.. ఆ తర్వాతి కాలంలో అమ్మకాలు రెట్టింపు అయ్యాయని కంపెనీ తెలిపింది. 

నిపుణులు ఏమంటున్నారంటే.. 

డాక్టర్ పలనియప్పన్ సహా అనేక మంది వైద్య నిపుణులు, డోలో-650ని వైద్య సలహా లేకుండా తీసుకోవడం వల్ల లక్షణాలు మరుగున పడి, తీవ్రమైన వ్యాధుల నిర్ధారణ ఆలస్యం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, జ్వరం అనేది ఒక సాధారణ లక్షణం, కానీ అది మరింత తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. డోలో-650 అధిక వినియోగం కాలేయానికి హాని కలిగించవచ్చు. రోజుకు 2600 మి.గ్రా. కంటే ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల కాలేయ వైఫల్యం సహా పలు తీవ్రమైన సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. కొంతమందిలో వికారం, కడుపు నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్‌‌‌‌లు కనిపించవచ్చు. అరుదైన సందర్భాల్లో తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్స్, ఊపిరితిత్తుల సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకున్నాకే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. డోలో-650ని రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు (వార్ఫారిన్), యాంటీ-నాసియా ఏజెంట్లు (డొమ్‌‌‌‌పెరిడోన్), లేదా ఇతర నొప్పి నివారిణులతో కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. 

2020 నుంచి 350 కోట్లకు పైగా అమ్మకాలు..

డోలో 650లో 650 మి.గ్రా. పారాసెటమాల్ (అసెటమినోఫెన్) ఔషధం ఉంటుంది. ఇది నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ కేటగిరిలోకి వస్తుంది. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఈ ట్యాబ్లెట్​ను తయారు చేస్తుంది. ఈ టాబ్లెట్లు 2020 నుంచి 350 కోట్లకుపైగా అమ్ముడయ్యాయి. కంపెనీకి  దాదాపు రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది.

డోలో 650లో పరిమితికి మించి డోసేజ్.. 

సాధారణంగా 60 నుంచి 70 కిలోల బరువున్న వ్యక్తికి ప్రతి ఆరుగంటలకోసారి 500 మిల్లీగ్రాముల పారాసిటమాల్ చొప్పున రోజుకు 2 గ్రాముల వరకు ఇవ్వొచ్చని రెకమండేషన్స్ ఉన్నాయి. కానీ డోలో 650 ఎంజీలో మాత్రం పరిమితికి మించి డోసేజ్ ఉంటుంది. రోజుకు 2.7 గ్రాములు తీసుకోవాల్సి రావడం వల్ల లివర్‌‌‌‌పై ప్రభావం పడుతుంది. మరో విషయం ఏంటంటే జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా, ఒళ్లు నొప్పులు ఉన్నా... అందరికీ డోలోనే గుర్తొస్తది. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులకు వెళ్లి చాక్లెట్లలా కొంటున్నారు. పిల్లలకు 250 ఎంజీకి మించి వాడరాదు. కానీ చాలామంది పెద్దలకు వేసినట్లే 650 ఎంజీ ఇస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఏయే సమస్యకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో, ఏ ఏజ్ వారికి ఏంత డోసేజ్ వేసుకోవాలో తెలుసుకొని వాడాలి. 
- డాక్టర్ రాజేశ్ వుక్కల, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్  

ఎక్కువ వాడితే కిడ్నీలపై ఎఫెక్ట్.. ​

జనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ ట్యాబెట్లను ఇష్టారీతిన వాడుతున్నారు. స్థానికంగా ఉండే నకిలీ డాక్టర్లు జ్వరమా? కాదా? అని నిర్ధారించుకోకుండానే డోలో 650 ఇచ్చేస్తుంటారు. డోలో, పారాసిటమాల్ ఇవన్నీ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమాటరీ డ్రగ్స్(ఎన్ఎస్ఏఐడీ) పరిధిలోకి వస్తాయి. ఈ పెయిన్ కిల్లర్‌‌‌‌కు సంబంధించిన ఏ ట్లాబ్లెట్స్ ఎక్కువగా వాడినా దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు, డయాలసిస్ బాధితులు పెరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు.    
- డాక్టర్ రాజీవ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్