ఎండ వల్ల ముఖం డల్ అవుతుంది. కాళ్లు, చేతులు నల్లబడతాయి. జుట్టు చిట్లిపోతుంది... వీటన్నింటితో పాటు ఎండ పొడ కండ్లకి కూడా హాని చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంటారా! నల్ల కళ్లద్దాలే.. ఎండల్లో కళ్లు చల్లగా ఉండాలంటే నల్ల కళ్లద్దాలు పెట్టాల్సిందే . ‘డాక్టర్ ష్రాఫ్స్ ఛారిటీ ఐ హాస్పిటల్స్’ ఓర్థాప్టిక్స్, బైనాక్యులర్ విజన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ సింగ్ కూడా ఇదే చెప్తున్నారు. అసలు నల్ల కళ్లద్దాలు ఎండల్లో కండ్లని ఎట్ల కాపాడతాయో కూడా చెప్పారాయన.
క్లాసీ అండ్ స్టైల్.. ఇలా కారణం ఏదైతేనేం నల్ల కళ్లద్దాలు చాలాకాలం కిందటే అందరికీ పరిచయం. అయినప్పటికీ సన్ ప్రొటెక్షన్ కోసం వీటిని రెగ్యులర్‌గా పెట్టుకునేవాళ్లు చాలా కొద్దిమందే. అసలు ఇవి ఏయే సమస్యల నుంచి బయటపడేస్తాయో తెలిస్తే మాత్రం వీటినెవరూ పక్కనపెట్టరు అంటున్నారు ప్రేమ్ కుమార్. అన్నింటికన్నా ముందు అసలు కండ్లకి ఎండ పొడ తగలడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి .. అలాగే ఎండల్లో ఏ సన్‌గ్లాసెస్ పెట్టుకుంటే మంచిదో కూడా చెప్పారాయన.
ఎండవల్ల కళ్లకి సమస్యలెన్నో..
ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లలో శుక్లాలు( కాటరాక్ట్) వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే కంటి లెన్స్‌ల మీద కొన్ని రకాల ప్రొటీన్లు గుంపులుగా చేరి గూడు కడతాయి. దాంతో లెన్స్ దెబ్బతిని కంటి చూపు పోతుంది. అలాగే ఎండ పొడ కళ్లకి ఎక్కువగా తగిలితే.. గ్లకోమా అనే కంటి సమస్య ఉన్నవాళ్లకి దాని లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. కళ్లు పొడిబారి.. రెటీనా దెబ్బతింటుంది. దానివల్ల కంటిచూపు మందగిస్తుంది. అదే ఎండలో బయటికి వెళ్లేటప్పుడు సన్‌గ్లాస్‌లు పెట్టుకుంటే ఈ సమస్యలేం దరిచేరవు.
ఎండ వల్ల రకరకాల స్కిన్ క్యాన్సర్లు వస్తాయన్న విషయం తెలిసిందే. వాటితో పాటు కళ్ల క్యాన్సర్‌కి కూడా కారణమవుతుంది ఎండ. అందుకే ఎండలోకి వెళ్లిన ప్రతిసారీ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. చదువు, ఆఫీసు, ఇంట్లోకి సరుకులు.. ఇలా కారణమేదైతేనేం అందరూ ఇంట్లోంచి బయటి కొస్తారు. దానివల్ల కళ్లలో దుమ్ము, ధూళి పడుతుంటుంది. అవి కళ్లలో ఇరిటేషన్‌కి దారితీస్తాయి. కళ్లు ఎర్రబడి, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటినుంచి తప్పించుకోవాలన్నా సన్‌గ్లాసెస్ బెస్ట్ ఆప్షన్. అయితే ఎలాంటి సన్‌గ్లాసెస్ ఎంచుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం.
ఏవి బెటరంటే?
సన్‌గ్లాసెస్ కళ్లని ఎండ నుంచి కాపాడతాయన్న మాట నిజమే. కానీ, అన్ని రకాల సన్‌గ్లాసెస్‌ని ఆ లిస్ట్‌లో చేర్చలేం. ఎండ నుంచి కళ్లకి రక్షణ ఇవ్వాలంటే పోలరైజ్డ్ లెన్స్ ఉన్న కళ్లద్దాల్నే ఎంచుకోవాలి. ఎందుకలా అంటే.. వీటిని ల్యామినేటర్ ఫిల్టర్స్‌తో తయారుచేస్తారు. ఇవి కళ్లలోకి చొచ్చుకుపోయే కొన్ని కిరణాలని బ్లాక్ చేస్తాయి. ఎండ, నీళ్లు, తేమ నుంచి వచ్చే మెరుపు కళ్లని తాకకుండా అడ్డుకుంటాయి. పైగా వీటిల్లో వందశాతం యూవీ ప్రొటక్షన్ ఉంటుంది.ఈ లెన్స్‌తో ఉన్న సన్‌గ్లాసెస్ పెట్టుకుంటే కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. విజువల్ క్లారిటీ బాగుంటుంది అని చెప్పారు కంటి డాక్టర్ ప్రేమ్.