అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. . ఈ ముహుర్తాన్నే ఎందుకు నిర్ణయించారు.. ఈ ముహూర్తానికి ఉన్న బలమైన కారణం ఏమిటి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22నాడు అయోధ్యలోని మందిరంలో సీతారామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు పండితులు. ఆ రోజు మృగశిర నక్షత్రం ఉంది. రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైంది. జనవరి22 నాడు శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టకు ముందు.. గంట పాటు అగ్నియాగం, హవన, నాలుగు వేదాల పారాయణం, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు.
ప్రాణ ప్రతిష్ఠాపనకు ఇది సమయం
జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. 84 సెకన్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకన్లు చాలా ప్రత్యేకం. ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమోగుతుందని.. ఇది అగ్ని, అకాల మరణం, దొంగతనం, వ్యాధి, మృత్యువు నుంచి రక్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మానవ జన్మను ఉద్దరించడానికి విష్ణు భగవానుడు.. రాముడి అవతారంలో భూమ్మీదకు వచ్చారన్నది అందరికీ తెలిసిందే. ఈ మృగశిర నక్షత్రానికి.. సోమ దేవతతో కూడా అనుబంధం ఉంది. సోమ దేవతను అమరత్వం గల దేవుడని అంటారు. ఈ రోజు మంచి పని చేస్తే.. అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు. మృగశిర నక్షత్రంలో సవర్త సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఉన్నాయి. అందుకే జనవరి 22 నాడు పవిత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు.
అభిజిత్ ముహూర్తం
జ్యోతిషశాస్త్రం ప్రకారం..శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు. అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చెబుతుంటారు. హిందువులకు ఇది శుభ సమయం. అందుకే హిందూ పురాణాల ప్రకారం, ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024, జనవరి 22న, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:59కి ముగుస్తుంది.
హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగాల సంగమ సమయంలో జగదబి రాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024, జనవరి 22న సమలేఖనం అవుతున్నాయి. ఈ కాలం రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు అనువుగా ఉంటుందని భావించారు.
మృగశిర నక్షత్రం
ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మృగశిర 27 నక్షత్రాల్లో ఐదవది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశిర అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. తెలివైనవారు, శ్రీరాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. రాక్షసులు అమరత్వం కోసం మృగశిర నక్షత్రాన్ని పాలించే గ్రహం అయిన సోమను అపహరించి కమలంలో దాచిపెట్టారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశిరను సంప్రదించారు. అతను చివరికి సోమను విడిపించాడు. 2024, జనవరి 22న, మృశిర నక్షత్రం ఉదయం 3:52 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం అవుతుంది.
జ్యోతిష్యుల ప్రకారం, 2024 జనవరి 22 కర్మ ద్వాదశి. ఈ ద్వాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం పుష్యమాసం శుద్ద ద్వాదశి రోజున, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి సముద్ర మథనంలో సహాయం చేశాడు. ఆరోజునే రాముడు ..విష్ణువు అవతారం దాల్చాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజు( జనవరి 22) రామ మందిర ప్రారంభోత్సవానికి చాలా పవిత్రమైనదిగా భావించి ఎంపిక చేశారు.
జనవరి 22న శుభ యోగం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, జనవరి 22న అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఆ రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగంతో సహా మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఏదైనా పవిత్రమైన పని చేయడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో ఏదైనా పని చేయడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల పనిలో విజయం సాధిస్తాడు
అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం..
జ్యోతిష్య శాస్త్రంలో.. నక్షత్రం, వారం రోజుల కలయిక ఒక శుభ కాలం ఏర్పడటానికి దారితీస్తుంది. మృగశిర, సోమవారం (జనవరి 22) కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభ కాలాలను ఏర్పరుస్తుంది. ఇది సోమవారం(జనవరి 22) ఉదయం 07:13కి ప్రారంభమవుతుంది, మంగళవారం(జనవరి23) ఉదయం 04:58 వరకు కొనసాగుతుంది.
గంటపాటు యాగం..
రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ముందు గంటపాటు యాగం, హవనం, నాలుగు వేదాల పారాయణం, ఇతర కర్మలు నిర్వహిస్తారు. ఈ ముహూర్తంలోని 16 గణాలలో పది మంచివని పండితులు చెబుతున్నారు.