ప్రయాగ్ రాజ్ మహాకుంభ్
ఉత్తర ప్రదేశ్ లోని త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగ్ రాజ్ లో ఈ సారి కుంభ మేళా జరగనుంది. మాఘమాసంలో బృహస్పతి మేషరాశిలో.. సూర్యుడు, చంద్రులు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా మొదలవుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట జరిగే ఈ వేడుకకు 40 కోట్ల మంది హాజరవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, అఘోరాలు, నాగసాధులు, సాధువులు, పీఠాధిపతులు ఇక్కడ పుణ్యస్నానాల కోసం తరలివస్తారు. ఈ సందర్భంగా జలమంతా జనంతో నిండిపోతుంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేస్తున్నాయి. అధునాతన టెక్నాలజినీ వినియోగించుకుంటున్నాయి.
ప్రయాగ్ రాజ్ లో త్రివేణి సంగమం వెంబడి ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా గుర్తించి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అఘోరాలు, నాగసాధులకు ఉపదేశం చేసి వారికి యోగా విద్యలు నేర్పేందుకు ఉద్దేశించిన అఖాడాలు ప్రయాగరాజ్ కు తరలివస్తాయి. ఈ సారి 13 అఖాడాలు ప్రత్యేకంగా ఇక్కడ బస చేయనున్నాయి.
12 ఏండ్లకు ఒక సారే ఏందుకు?
కుంభమేళాను ప్రతి 12 ఏళ్లకే జరుపుకుంటారు. అయితే 12 ఏళ్లకే ఎందుకు చేస్తారనే సందేహం సహజం. ఇందుకు ఓ పురాణగాథ ఉందని భక్తుల నమ్మకం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి అమృతం బయటకు వచ్చింది. అమృతం తమకే దక్కాలని దేవతలు, రాక్షసులు 12 రోజులపాటు యుద్ధం చేసుకున్నారట. ఆ 12 రోజులే భూలోకంలో 12 సంవత్సరాలని నమ్మకం.
Also Read :- మహా కుంభ మేళా..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు
అలాగే యుద్ధం సమయంలో అమృతం ఉన్న పాత్ర నుంచి 12 చుక్కలు కిందకి పడ్డాయని.. అందులో 4 చుక్కలు పలు ప్రదేశాల్లో భూమిమీదకు చేరాయని నమ్ముతారు. అందుకే ఆ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇక గురు గ్రహం 12 ఏళ్లు 12 రాశుల్లో ఉంటాడు కనుక 12 ఏళ్లకు ఓసారి కుంభమేళా చేస్తారని మరో కథ ప్రచారంలో ఉంది.
సాగర మథనం స్ఫూర్తిగా లోగో
రాబోయే మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని యూపీ యోగి ఆదిత్యానాథ్ ప్రయాగ్ రాజ్ లో లోగోను విడుదల చేశారు. సాగర మథనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని లోగోలో ఉంచారు. అలాగే పవిత్ర ప్రయాగ్ రాజ్ సంగమ ప్రదేశాన్ని, హనుమంతుని చిత్రం, ఆలయం, అక్షయవత్ వృక్షం, ప్రకృతికి, మానవులకు మధ్య సంబంధం తెలిపే సనాతన ధర్మానికి సంబంధించిన చిత్రాలను ఇందులో చూడొచ్చు. ప్రజా సంక్షేమం, స్వయం అవగాహన వంటి అంశాలకు మహాకుంభ్ మేళా 2025 లోగో చిహ్నంగా నిలుస్తోంది.
కుంభమేళా ఓ కొత్త జిల్లా
ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరిగే ప్రదేశాన్ని అంతా కలుపుతూ ఓ జిల్లాను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఆ జిల్లాకు 'మహా కుంభమేళా' అని అధికారికంగా పేరును ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 76కి చేరింది. మతపరంగా జరుగుతున్న ఈ వేడుకలో యాత్రికులకు తగిన ఏర్పాట్లు, భద్రతను కల్పించేందుకుగాను ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అందువల్ల వారికి మెరుగైన సౌకర్యాలు అందుతాయని వెల్లడించారు.