బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు లేవన్నట్టు, రైతుల కోసం తాము ఏదో ఉద్ధరించినట్టు స్వేద పత్రం విడుదల చేసింది బీఆర్ఎస్. వ్యవసాయంలో బీఆర్ఎస్ పాలకులు సృష్టించిన గందరగోళ పరిస్థితుల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా.. గత ఎనిమిది ఏండ్లలో ఎనిమిది వేల మంది రైతులు మరణించారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల్లో ఎనిమిది శాతం రైతులవే. ఇదేమీ రాజకీయ ప్రకటన కాదు. బీఆర్ఎస్ ను బద్నాం చేసే ప్రయత్నం అంతకన్నా కాదు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన వివరాలు ఇవి.2017 లో 846 మంది రైతులు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నారు.
2018 లో 900 మంది, 2019 లో 491 మంది, 2020 లో 466 మంది, 2021లో 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2017 నుంచి2021 వరకు 3,055 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పత్రికలో గత ఫిబ్రవరి నెలలో రాసుకున్నారు. అంతకు మించి సాక్ష్యం ఏమి కావాలో మన మాజీ మంత్రి కేటీఆర్ కు? 2022 –23 సంవత్సరాలలో రెండు వేలమందికి పైగా రైతులు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుండి 2016 వరకు సుమారు మూడు వేలమందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే, 2014 – 23 వరకు ఎనిమిది వేలమందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలు సహజ మరణాలా?
దీంట్లో కౌలు రైతులు కూడా ఉన్నారు. ఈ గణంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన విషయాలు. కౌలు రైతులను రైతులుగా గుర్తించేది లేదని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అప్పులు తెచ్చి.. వ్యవసాయం చేస్తే.. ప్రభుత్వసాయం కూడా అందక ప్రాణాలు తీసుకున్న కౌలు రైతులు అనేక మంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ కౌలు వ్యవసాయానికి పెట్టింది పేరు. బీఆర్ఎస్ తమ స్వేదపత్రంలో ఈ విషయాలు వెల్లడించకుండా, అవి ఆత్మహత్యలు కావు సహజ మరణాలు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు.
రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం
ఆ మద్య మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవు అని ప్రకటించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు తప్పుడు లెక్కలు చెబుతూ, అబద్దాలు ఆడుతూ కాలం గడిపారు . అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనను దించేశారు . అయినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. రైతుల మరణాలపై అసలు విషయాన్ని దాచి స్వేదపత్రం అని విడుదల చేశారు. అందులోనూ వాస్తవాలు దాచిన విషయాలను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. బీఆర్ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనం ఈ రైతు ఆత్మహత్యలు. ప్రజలు తగిన సమాధానం చెప్పిన తరువాత కూడా రైతులవి సహజ మరణాలని బీఆర్ఎస్ చెప్పటం రైతాంగాన్ని మోసగించటమే. దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేంద్ర రిపోర్టులు చెప్పాయి. దాన్నీ అబద్దమని బుకాయించడానికేనా స్వేద పత్రం?
- కపిలవాయి రవీందర్, ఐఎఫ్డబ్ల్యూజే, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు