అంతర్గత సమస్యల కారణంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అతలా కుతలం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక ప్రసిద్ధ సామెత ఉంది. ‘నరకానికి మార్గం మంచి ఉద్దేశాలతో సుగమం అయింది’ అని. ఓ మనిషి మంచి ఉద్దేశాలతో నిండి ఉంటాడు. కానీ, వాస్తవానికి, అతను తన గుడ్ ఇంటెన్షన్స్ను అమలు చేయడు. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. కానీ, మీరు మీ మంచి ఉద్దేశాలను అమలు చేయరు. ప్రామిస్ లేదా ప్లాన్లను వెంటనే ఆచరణలో పెట్టాలి. లేకపోతే అవి నిరుపయోగంగా మారతాయనేది సామెత పరమార్థం. రాజకీయాల విషయంలోనూ తరచుగా అదే జరుగుతున్నది. ఇండియా కూటమి 2023 జులైలో గొప్ప ఉద్దేశాలు, ఆశయాలతో ప్రారంభమైంది.
కాంగ్రెస్ సారథ్యంలోని పాత యూపీఏ కూటమికి భిన్నంగా ఇండియా కూటమి ఉంటుందని, నాయకులందరితో హంబుల్‌గా పనిచేస్తామని, త్యాగాలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి క్లెయిమ్ చేయబోమని కూడా కాంగ్రెస్ చెప్పింది. కొత్త వివాహం మాదిరిగా ఏర్పడిన సరికొత్త కూటమిలో నెల రోజుల వరకూ నాయకులు అందరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత అసలు ముఖాలు బయటపడి సమస్యలు పేరుకుపోవడంతో వాటిని పరిష్కరించే నాథుడు కాంగ్రెస్‌లో లేడు.
కీలక ఆటగాళ్లు
బిహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఇండియా కూటమికి పునాది వేశారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులను కలుపుకొని కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అధికార బీజేపీయేతర ప్రతిపక్షాల కూటమికి నితీశ్ కుమార్ బాధ్యత వహించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేపథ్యం పరిశీలిస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, ఉద్ధవ్ థాక్రే, రాహుల్ గాంధీ వంటి వంశపారంపార్య రాజకీయ నేత కాదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని మమతా బెనర్జీ అన్నారు. అంటే పశ్చిమ బెంగాల్‌లో మమత ఆధిపత్యం, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ, పంజాబ్‌లలో అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి అధినేతలుగా వ్యవహరిస్తారనేది ఆమె ఉద్దేశ్యం.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక రాజకీయ నాయకుడు. కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా అధికారం సాధించి ఆ రెండు రాష్ట్రాలను పాలిస్తున్నది. మరోవైపు కేజ్రీవాల్‌పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరంతరం దాడి చేస్తోంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రధాన ప్రతిపక్ష నేత. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓట్లు లేవని, 2019లో 80 ఎంపీ స్థానాల్లో కేవలం ఒక ఎంపీ స్థానాన్ని మాత్రమే హస్తం పార్టీ గెలుచుకుందని ఆయనకు పూర్తిగా తెలుసు. ఈక్రమంలో యూపీలో కాంగ్రెస్ చాలా చిన్న పాత్ర పోషించాలని అఖిలేశ్ యాదవ్ కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ సృష్టించిన సమస్యలు
నితీశ్ కుమార్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చైర్మన్‌గా చేసి ఉండాల్సింది. అప్పుడు నితీశ్ ఇండియా అలయన్స్‌తోనే ఉండేవారు. అయితే నితీశ్ కుమార్ ప్రధాని అవుతారని కాంగ్రెస్‌కు అనుమానం. రాహుల్ గాంధీని అడ్డుకోవాలని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ మల్లికార్జున ఖర్గే పేరును ప్రధానమంత్రిగా ప్రతిపాదించగా కాంగ్రెస్ షాక్‌కు గురైంది. రాహుల్ గాంధీ మరోసారి తన యాత్రను భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ప్రారంభించారు. అయినప్పటికీ, ఇండియా కూటమి భాగస్వాములను కాంగ్రెస్ యాత్రలో చేర్చుకోలేదు. పశ్చిమ బెంగాల్, అస్సాం, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో తమ అండతో రాహుల్ గాంధీ ఎదగాలనుకుంటున్నారనే కూటమిలోని నాయకుల అనుమానాలకు ఇది దారితీసింది. తనను కాంగ్రెస్ తెలివిగా పక్కన పెట్టిందని నితీశ్ కుమార్ గ్రహించారు. ఇక తాను ఇండియా కూటమిలో ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన భావించి ఉంటారు.
ఇండియా కూటమి పతనానికి కారణమెవరు?
అన్ని రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ రాజకీయ చరిత్ర, చాణక్యత ఉంది. కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని దక్షిణాదిలోని కొందరు నేతలు నడిపిస్తున్నారు. కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల వెలుపల కాంగ్రెస్‌కు ఆధిపత్య స్వరం లేదు. మరోవైపు ఉత్తర భారత నాయకులు రామ మందిర కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు చేరినప్పటి నుంచి ఇండియా కూటమి ఒక మ్యాజికల్ కూటమిగా మారింది. అయినప్పటికీ, ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలదా? నితీశ్ కుమార్ వెళ్లిపోతే, ఇండియా కూటమికి భారీ నష్టమే.
ఇండియా కూటమి భవిష్యత్తు
ఇండియా కూటమిలో విభేదాలు, వైరుధ్యం నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని అవుతారని సందేశం పంపుతుంది. 60 సంవత్సరాల క్రితం బ్రిటీష్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ చెప్పిన నాకు ఇష్టమైన కొటేషన్... "రాజకీయాల్లో ఒక వారం చాలా ఎక్కువ కాలం". ఇప్పుడు రాజకీయాల్లో ఒక రోజు కూడా దీర్ఘకాలంగా ఉంది. రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.
రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 2014, 19లో అధికార బీజేపీని ఎదుర్కొని అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయినా రాహుల్ తన రాజకీయ ఆశయాలను వదులుకోలేదు. భారత్ జోడో యాత్రను ఆయన ప్రారంభించారు. మెరుగైన స్పందన వచ్చినా అధికారంలోకి వచ్చేంతగా ఫలితాలు లేవు. బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత ఉండాలని రాహుల్ గాంధీకి తెలుసు. కాబట్టి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి ప్రాక్సీగా మారాడు. అయితే, దేశంలో ఒక జాతీయపార్టీగా కూటమిలోని సీట్ల పంపకంలో మిత్రపక్షాలైన ప్రాంతీయపార్టీలతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నది. 2019లో బెంగాల్‌లో కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. ఇపుడు కాంగ్రెస్‌కు ఆ రెండు సీట్లు మాత్రమే పొత్తులో భాగంగా వదులుతామని మమత బెనర్జీ అంటున్నది. ఇలాంటి పరిస్థితి దాదాపు కూటమిలోని ప్రతి ప్రాంతీయ పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నది. త్యాగం చేయడమంటే ఇదేనా అని కాంగ్రెస్‌పార్టీ అంతర్మథనంలో పడిందనే చెప్పాలి. బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యం కోసం ఏ త్యాగానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుందా, లేదా అనేది తేలే సమయం రోజురోజుకు దగ్గర పడుతున్నది.