ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆయన తీసుకున్న నిర్ణయాలతో ప్రభావితమయ్యాయి. ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ ఉపన్యాసంలో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో ముందుగానే అనేక విషయాలు ఉదహరిస్తూ మాట్లాడారు. ఆయన ధోరణి గమనిస్తే వాటి ప్రభావాలు, ప్రతిఫలాలు, అభివృద్ధి చెందిన, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎలా ఉండనుందో పరిశీలించాల్సి ఉన్నది.
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు, ప్రస్తుతం దేశ ప్రధానిగా ఆయన అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు పొంతన లేకుండా పోయింది. ఇప్పటికీ ట్రంప్ విధానాల మీద దేశ ప్రధాని మాట్లాడకపోవడం వలన భారతదేశంలో నుంచి అమెరికా వలసపోయిన విద్యార్థులు, మేధావులు వారి కుటుంబాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు.
డాలర్ కళకళ.. రూపాయి విలవిల:
1947లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ 3.30 ఉండగా , 1966లో రూ.7.50, 1975లో రూ. 8.39 ఉండేది. అనంతరం 1990వ సంవత్సరంలో రూ.17.01 ఉండగా 1995 నాటికి ఒక్కసారిగా రూ.32 .42కు క్షీణించి రూపాయి పతనమైనది. ఈ కాలంలోనే మన దేశంలో గుంభనంగా ఉన్న నూతన ఆర్థిక విధానాలు బహిరంగమయ్యాయి.
2014వ సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 59.44 కాగా, ప్రస్తుతం 2025 జనవరి 30 నాటికి రూ.86.59కు దిగజారింది. మన దేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత ఆయన ప్రసంగాలు, చర్యలు, సుంకాలు, బెదిరింపుల పర్యవసానాల మూలంగా.. అమెరికా డాలర్ విలువ కళకళలాడుతుంటే మన రూపాయి విలువ వెలవెలపోతోంది.
ఆర్థిక నిపుణుల అంచనాల మేరకు డాలరు విలువ మన కరెన్సీలో 90 రూపాయలకు చేరినా ఆశ్చర్యపడవలసింది లేదు. స్వేచ్ఛావాణిజ్యం, ప్రైవేటైజేషన్, సరళీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల భవిష్యత్తు ఊహించుకుంటేనే ఒక విధమైన జంకు కలుగుతున్నది.