కాంగ్రెస్ లో.. వాళ్ల పెత్తనమేందీ?

  •     యాదాద్రి డీసీసీ ఎంపిక.. నల్లగొండ లీడర్లకు ఎందుకు..?  
  •     పీసీసీకి ఫిర్యాదు చేయడంపై ఆలోచన

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా కాంగ్రెస్​లో గ్రూపుల కుమ్ములాటలకు తోడు.. లోకల్, నాన్ లోకల్​ లొల్లి మొదలైంది. తమపై నాన్​లోకల్​ లీడర్లు పెత్తనం చెలాయించడానికి ప్లాన్ చేస్తున్నారని లీడర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్​ ఇంటర్నల్​ మీటింగ్​లో లీడర్లు ప్రస్తావిస్తున్నారని తెలుస్తోంది. యాదాద్రి జిల్లా ఏర్పడకముందు నుంచే కాంగ్రెస్​లో గ్రూపు రాజకీయాలు  ఉన్నాయి. ప్రత్యేక జిల్లాగా యాదాద్రి ఏర్పడిన అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా కుంభం అనిల్​కుమార్ రెడ్డి నియమితులైన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సత్సంబంధాలు పెద్దగా ఏర్పరుచుకోలేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన అనంతరం కుంభం  రేవంత్​ వర్గంలో చేరిపోయారు. దీంతో వీరిద్దరి మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ టైంలోనే లోకల్​, నాన్​లోకల్​ పంచాయితీ మొదలైంది. అయితే కుంభం పార్టీలోనే ఉండడం, కోమటిరెడ్డి భువనగరి ఎంపీగా ఉన్నందున పెద్దగా తెరపైకి రాలేదు. 

డీసీసీ మార్పుపై..

ఎంపీ కోమటిరెడ్డి పెడుతున్న ఇబ్బందులతోనే తాను కాంగ్రెస్​ను వీడుతున్నానంటూ అనిల్​కుమార్​రెడ్డి బీఆర్​ఎస్​లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే డీసీసీ అధ్యక్షుడిగాఎవరిని ఎంపిక చేయా లన్న అంశం తెరపైకి వచ్చింది.  డీసీసీ అధ్యక్ష పదవికి ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్​, అందెం సంజీవరెడ్డి, బోరెడ్డి అయోధ్యరెడ్డి, భువనగిరి 
నియోజకవర్గానికి చెందిన  జెడ్పీ  మాజీచైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి, పోత్నక్​ ప్రమోద్​ కుమార్​ సహా మరికొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో  నారాయణరెడ్డి, సంజీవరెడ్డి పేర్లను నల్ల గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి సూచించారన్న ప్రచారం జరుగుతోంది.దీంతో  జిల్లాకు చెందిన లీడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వాళ్లేనా..?

నల్గొండ నుంచి యాదాద్రి విడిపోయినా ఇంకా అక్కడి లీడర్లే  పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై పార్టీ ఇంటర్నల్​ మీటింగ్​ల్లో  జిల్లా లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై పెత్తనం చేసేందుకు ప్రయత్నించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఎవరు కావాలో నిర్ణయించుకునేదీ ఇక్కడి లోకల్​ లీడర్లనేనని వారు అంటున్నారు. అయితే జానారెడ్డి, కోమటిరెడ్డి సీనియర్లు అయినందున కలగజేసుకుంటున్నారని కొందరు లీడర్లు అంటుండగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరి జోక్యంతోనే గతంలో  భిక్షమయ్య గౌడ్​, తాజాగా అనిల్​ కుమార్​రెడ్డి పార్టీని వీడారని పేర్కొంటున్నారు. నాన్​ లోకల్​ లీడర్లు తమను  ఇంకా అదుపు చేసే ప్రయత్నాలపై టీపీసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నామని చెబుతున్నారు. 

నాకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్నాయి

యాదాద్రి కాంగ్రెస్​ లీడర్​ ఏండ్ల తరబడి నుంచి కాంగ్రెస్​లోనే ఉంటున్నా. నల్గొండలో ఉన్నప్పుడు పెద్ద లీడర్లుగా అక్కడి వాళ్లే కొనసాగారు. జిల్లా విడిపోయిన తర్వాత కూడా పెత్తనం చేస్తామంటే ఎలా..? నాకూ ఢిల్లీ స్థాయిలో పరిచయాలన్నాయి. పార్టీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. అంత మాత్రానా.. పెత్తనం చేస్తానంటే నడుస్తుందా..? నాకు డీసీసీ పదవి కావాలని ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. నాతో పాటు మరికొంతమందికి పదవులపై ఆశ ఉంది. మమ్ములను పరిగణలోకి తీసుకోకుండా పేర్లు సూచిస్తామంటే సరికాదు. నాన్​ లోకల్ లీడర్ల పెత్తనంపై ఇంటర్నల్​ చర్చ జరుగుతోంది.  పీసీసీకి ఫిర్యాదు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం.