న్యూయార్క్ లో ఎందుకిలా?
యూఎస్ మరణాల్లో సగం ఈ సిటీలోనే..
ఎక్కువ జనాభా, టూరిస్టులు పెరగడమే కారణం: గవర్నర్
ఆలస్యంగా లాక్ డౌన్
అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కడ పడింది అంటే అది బిగ్ యాపిల్ గా పిలిచే న్యూయార్క్ పైనే. బాగా ఎఫెక్ట్ అయిన ఇటలీ, స్పెయిన్లతో సమానంగా ఆ రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయి. మరణాల్లోనూ అదే పరిస్థితి. దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో ఆ రాష్ట్రంలోనే సగం ఉన్నాయి. దీనికి కారణం ఎక్కువ జనాభా, టూరిస్టులు పెరిగిపోవడమేనని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కువోమో అంటున్నారు. లాక్డౌన్ లేట్ గా అమలు చేయడమూ అందుకు ఆజ్యం పోసిందని చెబుతున్నారు.
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత డెవలప్డ్ కంట్రీ అయిన యూఎస్.. కరోనా పాజిటివ్ కేసుల్లోనూ టాప్ లో ఉంది. అందులోనూ న్యూయార్క్ సిటీ కరోనాకు కేపిటల్ గా మారింది. యూఎస్ అంతటా జరిగిన మరణాల్లో సగం వరకు ఒక్క న్యూయార్క్ సిటీలోనివే. కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఇటలీ, స్పెయిన్ దేశాల్లో అత్యంత ఎక్కువ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రం ఆ దేశాలను మించిపోయింది. అమెరికా ఫైనాన్షియల్ స్టేట్, బిగ్ యాపిల్ గా పిలిచే ఈ సిటీలో ఎందుకిన్ని మరణాలు నమోదయ్యాయన్న ప్రశ్నకు టూరిస్టుల తాకిడి, విపరీతంగా జనాభా ఉండటమే కారణమని చెప్తున్నారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో. అయితే ఇక్కడ లాక్ డౌన్ ప్రకటించడం ఆలస్యం కావడంతోనే వైరస్ ఎక్కువగా విస్తరించిందని హాప్కిన్స్ వర్సిటీ హెల్త్ ఆఫీసర్ అంటున్నారు.
లాక్డౌన్ లేట్ చేశారు కాబట్టే..
అమెరికాలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియా. ఇక్కడ శుక్రవారం నాటికి 20,200 కరోనా కేసులు నమోదవగా 550 మంది చనిపోయారు. ఇక్కడ మార్చి 16 నుంచే ఆంక్షలు విధించారు కాబట్టే కాలిఫోర్నియాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఫైల్ కాలేదని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ హెల్త్ ఆఫీసర్ మేఘన్ తెలిపారు. న్యూయార్క్ లో మార్చి 16న రెస్టారెంట్లు, హోటల్స్, స్కూల్స్ మాత్రమే బ్యాన్ చేసి, ఆపై వారం తర్వాత లాక్ డౌన్ అమలు చేశారని చెప్పారు. ఈ గ్యాప్ లోనే వైరస్ విస్తరించి ఉంటుందన్నారు. లాక్ డౌన్‌లో జాప్యం వల్లే వైరస్ ఎక్కువ వ్యాపించినట్లు చెప్తున్నారు. ఇక యూరప్ నుంచి వచ్చిన టూరిస్టుల నుంచే న్యూయార్క్ లో కరోనా వ్యాపించిందని అమెరికన్ జన్యు సైంటిస్టుల అంచనా.
8 వేల మంది బలి
అమెరికాలో రోజూ 2 వేల మంది చనిపోతున్నారు. అందులో సగం మంది న్యూయార్క్ లోనే మృతి చెందుతున్నారు. మొత్తంగా ఒక్క న్యూయార్క్ లోనే 8,627 మంది మరణించారు. ఒక్కరోజే 783 మంది బలయ్యారు. అక్కడ ఇప్పటిదాకా 1,80,458 మందికి వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యింది.
టూరిస్టుల తాకిడితోనే వైరస్
ఇక్కడ ఉన్న అత్యధిక జనాభా, టూరిస్టుల తాకిడి వల్లే న్యూయార్క్ ని ఇలా తయారయిందని గవర్నర్ ఆండ్రూ చెప్తున్నారు. సిటీలో దాదాపు 90 లక్షలకు పైగా జనాభా ఉందని, చాలా ఊర్లలో 10 వేల మందికిపైగా నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు.
For More News..