- ఆగస్టు 2న రిటెయినింగ్ వాల్ కూలి నీట మునిగిన సర్జ్‌పూల్
- కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక
- నేటికీ ఏజెన్సీపై చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
- నామమాత్రంగా నలుగురు అధికారుల సస్పెన్షన్
- సాగర్ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్
- అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్
హైదరాబాద్, వెలుగు: సుంకిశాల ప్రాజెక్ట్ రిటెయినింగ్వాల్ కుప్పకూలి 3 నెలలు గడిచినా సదరు కాంట్రాక్ట్ సంస్థపై ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నామమాత్రంగా నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటువేసి చేతులు దులుపుకొన్నారు. సాగర్ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్ ఉండడంతో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడింది. ఆగస్టు 2న టన్నెల్గేట్ కొట్టుకుపోవడంతో సర్జ్‌పూల్‌లోకి నీళ్లు దూసుకొచ్చి రిటెయినింగ్వాల్ కుప్పకూలింది. ఈ ఘటనతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లగా.. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఓవైపు సాగర్‌లో నీటిమట్టం పెరుగుతున్నా.. లీకేజీలపై సైట్సిబ్బంది హెచ్చరించినా కాంట్రాక్ట్ సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మెట్రో వాటర్‌బోర్డు విచారణ కమిటీ తేల్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా.. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరినా హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద వాటర్ ఇన్‌టేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించింది. రూ.2,200 కోట్లకు పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ.. 2021 జూన్11న వాటర్బోర్డుతో ఒప్పందం చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2022 మే 14 న అప్పటి మంత్రి కేటీఆర్ ఇన్‌టేక్ వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేండ్లలోనే మొ త్తం పనులు కంప్లీట్ చేసి, హైదరాబాద్‌కు తాగునీటిని సప్లై చేయాలని భావించారు. ఘటన జరిగే నాటికి రూ.1500 కోట్లు ఖర్చు చేసి, 60 శాతం మేర ఇన్ టేక్ వెల్ పనులు, 70 శాతం మేర పంపింగ్‌మెయిన్ పనులు, 40 శాతం మేర ఎలక్ట్రో మెకానికల్ పనులు పూర్తిచేశారు. అయితే, ఘటన జరిగాక పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి జూలై నెలాఖరు నుంచే శ్రీశైలం ద్వారా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం మొదలైంది. సాగర్‌లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం టన్నెల్ గేట్ధ్వంసమై సర్జ్‌పూల్‌లోకి వరదనీరు దూసుకొచ్చి, రిటెయినింగ్వాల్ కూలిపోయింది. దీంతో ఈ ఘటనపై మెట్రోవాటర్‌బోర్డు .. నాటి బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యానారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌తో ఒక విచారణ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సర్జ్‌పూల్‌ను పలుమార్లు సందర్శించి, రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేసింది. ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, సైట్ ఇంజినీర్లతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వల్లేనని కమిటీ నివేదిక
ఆగస్టు 2న ప్రమాదం జరిగినప్పుడు సుంకిశాల ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్నాయి. ఓవైపు సాగర్‌లో నీటి ప్రవాహం పెరుగుతున్నా, సర్జ్‌పూల్‌లోకి వాటర్ లీక్ అవుతున్నట్టు అక్కడి సిబ్బంది సమాచారం ఇచ్చినా కాంట్రాక్ట్ సంస్థ పట్టించుకోలేదని విచారణ కమిటీ గుర్తించింది. సాగర్‌లో 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు వాటర్‌లెవల్ ఏ దశలో ఉన్నా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్‌లోకి నీటిని తరలించే విధంగా డిజైన్ చేశారు. కానీ 530 అడుగుల నీటి ధాటినే రిటైనింగ్ వాల్ తట్టుకోలేదని, ఇందుకు నిర్మాణంలోని లోపాలే కారణమని సర్కారుకు ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. వాస్తవానికి పంపుహౌస్‌లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేస్తారని, కానీ ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారని వెల్లడించింది. రిటైనింగ్ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడంతో సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చింది. ఆగస్టు 1న ఉదయం పని ముగించుకుని పంపుహౌస్ నుంచి వెళ్లిపోయిన సిబ్బంది.. భయంతో రెండో షిఫ్ట్‌లో పనిచేయడానికి రాలేదని, లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్ట్సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పిన విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించింది.
నామమాత్రపు చర్యలతో సరి
సుంకిశాల ప్రమాదానికి కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ఎంక్వైరీ కమిటీ తేల్చినా ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసర్లపై నామామత్రపు చర్యలతో సరిపెట్టారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌ను సస్పెండ్ చేసి, చేతులు దులుపుకొన్నారు. అప్పటికే సుంకిశాల ప్రాజెక్టు కోసం మొదట టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్మార్చడం, డీపీఆర్‌లో పేర్కొన్న స్థలంలో కాకుండా వేరే చోట నిర్మాణం చేపట్టడం, అంచనాలు పెంచడం లాంటి ఆరోపణలు గత ప్రభుత్వంపై వచ్చాయి. దీనికితోడు మెట్రోవాటర్‌బోర్డు నివేదిక ఆధారంగా నాటి సర్కారు పెద్దలతో పాటు కాంట్రాక్ట్ సంస్థపైనా చ ర్యలు తీసుకుంటారనే వార్తలు వెలువడ్డాయి. తీరా ఘటన జరిగి 3 నెలలు గడిచిపోయినా నేటికీ కాంట్రాక్ట్ సంస్థపై ఈగ వాలకపోగా, సదరు మేఘా ఇంజినీరింగ్కంపెనీకి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు దక్కుతుండడం గమనార్హం.