మహిళలైతే విచారించొద్దా?.. ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కామెంట్స్​

  • మహిళలైతే విచారించొద్దా? 
  • ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కామెంట్స్​
  • దర్యాప్తు సంస్థలను ప్రశ్నించొద్దని మేం చెప్పలేమన్న ధర్మాసనం
  • విచారణ నవంబర్ 20కి వాయిదా 
  • అప్పటి వరకు కవితను విచారణకు పిలువబోమన్న ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు : మహిళలను విచారణకు పిలవొద్దంటే ఎట్ల? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు అడ్వకేట్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణకు పిలవొద్దనేది ఏమీ లేదని, సాక్షిగానైనా లేదా ఏ కారణంతోనైనా మహిళలను ప్రశ్నించొచ్చని స్పష్టం చేసింది. అయితే.. మహిళల విచారణలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. లిక్కర్ స్కామ్​ కేసులో ఢిల్లీలోని తమ ఆఫీసుకు రావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. 

సీఆర్పీసీ, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి  27న ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కేసుతో అటాచ్ చేసింది. మంగళవారం అభిషేక్​ బెనర్జీ తో పాటు కవిత పిటిషన్ సుప్రీంకోర్టుకు ముందుకు వచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్ష్ ధులియా ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. 

తొలుత కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. నళిని చిదంబరం కేసులో ఆమెను విచారణకు రావాలని ఈడీ పట్టుబట్టలేదని, అలాగే తన క్లయింట్  కవితకు రక్షణ కల్పించాలని గతవారం వినిపించిన అంశాలను మరోసారి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కస్టమ్స్ యాక్ట్, సీఆర్పీసీ సెక్షన్ 160, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) లు మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయని అన్నారు. బెయిల్ సెక్షన్, సెక్షన్ 45 కూడా మహిళలకు కొన్ని సడలింపులు ఇస్తున్నాయని తెలిపారు. అయితే ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. మహిళలను సాక్షులుగానైనా, ఇతర అంశాల్లోనైనా ప్రశ్నించొద్దని తాము చెప్పలేమని స్పష్టం చేసింది. అన్ని కేసులను ఒకే కోవలోకి తీసుకోలేమని, ఇందులో ఇతర అంశాలు కూడా ఉంటాయని చెప్పింది. పీఎంఎల్ఏ పై నమోదైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 11 నుంచి 18 వరకు విచారణ జరపనుందని, ప్రస్తుతం కవిత పిటిషన్ కూడా పీఎంఎల్​ఏతో ముడిపడి ఉన్నందున.. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పును అనుసరించి పిటిషన్​ విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

విచారణను నవంబర్ 20కి వాయిదా వేశారు.  అయితే... అప్పటి వరకు కవితను విచారణకు పిలవొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆమె తరఫు అడ్వకేట్​ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు ఆమెను విచారణకు పిలవద్దు’’ అని పేర్కొన్నారు. స్పందించిన ఈడీ తరపు అడ్వకేట్లు..  నవంబర్ 20 వరకు కవితను విచారణకు పిలవబోమని కోర్టుకు చెప్పారు.