సీబీఐ, ఈడీ దాడులు కేసీఆర్​పై ఎందుకు చేయట్లే : రాహుల్​గాంధీ

  • ఆయన అవినీతిపై మోదీ ఎందుకు విచారణ జరిపిస్తలే?: రాహుల్​గాంధీ
  • ప్రశ్నించే వాళ్లపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నరు
  • కేసీఆర్​, మోదీ ఇద్దరూ ఒక్కటే.. వారికి ఒవైసీ మద్దతు
  • ఇక్కడ కేసీఆర్​ను ఓడిస్తే.. ఢిల్లీలో మోదీని ఓడించుడు ఈజీ
  • కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లో తెలంగాణ బందీ
  • కాళేశ్వరం పేరుతో కోట్లకు కోట్లు దోచుకున్నరు
  • ధరణి వల్ల 20 లక్షల మంది గోసపడ్తున్నరు
  • ఇది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం 
  • కాంగ్రెస్​ వస్తే కేసీఆర్​ అవినీతి సొమ్ము కక్కిస్తమని హామీ
  • బోధన్​, ఆదిలాబాద్, వేములవాడలో సభలు

నిజామాబాద్ / ఆదిలాబాద్ / వేములవాడ, వెలుగు: అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్​పై సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​గాంధీ ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట కోట్లాది రూపాయలు కేసీఆర్​ కాజేశారని, ఆయనను ఎందుకు విచారించడం లేదని అన్నారు. ప్రశ్నించేవాళ్లపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని, అందుకే తమపై కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో కేసీఆర్​ను ఓడిస్తే.. ఢిల్లీలో మోదీని ఓడించడం ఈజీ అవుతుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని.. ఒక వైపు కేసీఆర్ కుటుంబం ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రజలు నిలబడ్డారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. కేసీఆర్​ అవినీతి సొమ్మును కక్కించి ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. -నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్లపై సీబీఐ, ఈడీ కేసులు నమోదవుతాయని, తన మీద కూడా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారణ జరిపారని ఆయన అన్నారు. ‘‘కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కేసీఆర్​ అవినీతిపరుడని పదేపదే చెప్తున్న మోదీ.. మరి కేసీఆర్​పై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు చేయించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్​ ఇద్దరూ ఒక్కటేనని, వారికి ఒవైసీ మద్దతుగా నిలుస్తుంటారని దుయ్యబట్టారు. 

అందుకే కేసీఆర్​ అవినీతిపై మోదీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్ కు​మధ్య దోస్తీ లోక్​సభ సాక్షిగా నేను అనేకసార్లు చూశాను. మోదీ చిన్న సైగతో బీఆర్​ఎస్​ మొత్తమంతా ఆయన వైపు నిలబడుతుంది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, రైతు బిల్లు వెనుక కేసీఆర్​ది కీలక పాత్ర. మోదీతో నేను కొట్లాడితే మోదీకి రక్షణగా నిలబడేది గులాబీ ఎంపీలే” అని దుయ్యబట్టారు. ప్రశ్నించాననే తనపై 24 కేసులు పెట్టి లోక్​సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, చివరికి ఇల్లు కూడా ఖాళీ చేయించారని ఆయన అన్నారు. దేశ ప్రజల గుండెల్లో ఉన్న తనకు ఇండ్ల అవసరంలేదని చెప్పి సంతోషంగా తాళాలు ఇచ్చేశానని తెలిపారు. తాను ఎవరికీ భయపడేది లేదని, మోదీతో తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

కేసీఆర్​ రిమోట్​ మోదీ చేతుల్లో..!

నాలుగు నెలలకు ముందు వరకు బీజేపీ వాళ్లు రాష్ట్రంలో ఛాతి ఉబ్బించుకొని తిరిగేవాళ్లని, వారికి తెలియకుండానే వారి గాలి తీసేశామని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్​ఎస్​ కారు టైర్లు మొత్తం కోసేశామని, కోసిన టైర్లలో గాలెక్కించేందుకు కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని, అందుకు బీజేపీ, ఎంఐఎం సహకారం తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. -బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ‘‘కేసీఆర్​ రిమోట్​ అంతా ప్రధాని మోదీ చేతిలో ఉంది. కేవలం కాంగ్రెస్​ ఓట్లను చీల్చి బీజేపీకి ఉపయోగపడేలా ఎంఐఎం పనిచేస్తున్నది” అని అన్నారు. 

కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో తెలంగాణ బందీ

ఎందరో అమరుల త్యాగాలు, సకల జనుల పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కబంధహస్తాల్లో బందీ అయిందని, బీఆర్ఎస్ సర్కార్ ప్రజల కలలను కల్లలు చేసిందని రాహుల్​ అన్నారు. తెలంగాణలో కేసీఆర్  గవర్నమెంట్ ఉండాలని మోదీ కోరుకుంటే.. ఢిల్లీలో మోదీ సర్కార్ ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని, ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. 

తెలంగాణలో కేసీఆర్​ను,  ఢిల్లీలో మోదీని గద్దెదింపడమే కాంగ్రెస్​ లక్ష్యమని.. ప్రజల మద్దతుతో ఈ టార్గెట్ ను ఛేదిస్తామని ఆయన అన్నారు. ‘‘ప్రధాని మోదీ మేలుకోరే  ప్రియమైన స్నేహితుడు ఎంఐఎం చీఫ్​ ఒవైసీ. బీజేపీతో కాంగ్రెస్​ ఎక్కడ కొట్లాడినా బీజేపీకి రక్షణ గోడగా ఒవైసీ ఉంటరు. అస్సాం, గుజ్​రాత్​, మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లలో ఈ విషయం  క్లియరైంది. కేవలం కాంగ్రెస్​ ఓట్లు చీల్చి బీజేపీ లాభపడేలా ఆయన పని చేస్తరు” అని మండిపడ్డారు. తెలంగాణలో దొరల పాలనను సాగనంపే యుద్ధం నడుస్తున్నదని, ప్రజల రాజ్యం తప్పక వస్తుందని అన్నారు. తలదాచుకోనేందుకు ఇండ్లు లేక గరీబులు మరింత గరీబ్​ అవుతున్నారని, రైతుల గోస పెరిగిందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్​ ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి కేసీఆర్ తన కుటుంబ భవిష్యత్తును చూసుకున్నారని ఆయన మండిపడ్డారు. 

కేసీఆర్​.. ఏమిచ్చినమంటవా?

‘‘కాంగ్రెస్​ ఏమిచ్చిందని కేసీఆర్​ అడుగుతున్నడు. ఆయన చదువుకున్న బడి, కాలేజీ కాంగ్రెస్​ కట్టించ్చిందే. కేసీఆర్​ లూటీ చేస్తున్న హైదరాబాద్​ను ప్రపంచ స్థాయిలో నిర్మిచింది మా పార్టీనే. కేసీఆర్​ గాలిమోటార్​లో ఎగరడానికి వచ్చే శంషాబాద్​ ఎయిర్​పోర్టు, ఔటర్​ రింగ్​ రోడ్డు, మెట్రోలైన్​ ఇవన్నీ కట్టింది కాంగ్రెస్సే. చివరకు ప్రజలతో కలిసి  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్సే’’  అని రాహుల్​ గాంధీ అన్నారు. 

‘‘దళితబంధు మంజూరుకు మీ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల కమీషన్ తీసుకుంటున్నరని నువ్వే మీ వాళ్లకు వార్నింగ్​ ఇచ్చినవ్​. మీ గవర్నమెంట్​ అవినీతి, పనితీరుకు ఇంతకు మించి ఏం సాక్ష్యం కావాలి. ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధులు రూ.15,550 కోట్లు, ఎస్టీ సబ్​ ప్లాన్​ ఫండ్​ రూ.5,500 కోట్లు దారి మళ్లించినవ్​” అని కేసీఆర్​పై మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తం

కాంగ్రెస్​ గవర్నమెంట్​లో రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి రానివ్వబోమని రాహుల్​గాంధీ చెప్పారు. ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి కేబినెట్​ మీటింగ్ లోనే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అన్నదాతపై అప్పుల భారంపోయేదాకా బలవంతుడు కాలేడని, రైతు భరోసాతో ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతుకు రూ.12 వేలు ఇస్తామని, మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500, రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్​, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని  చెప్పారు. 

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పేదల ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్తు అందిస్తామని,  ఇండ్లు నిర్మించుకునేవారికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని, గిరిజన, ఆదివాసీల హక్కులు కాపాడతామని, యువ వికాసానికి మండలానికో ఇంటర్నేషనల్​ స్కూల్​, ఉన్నత చదువులకు రూ.5 లక్షల విలువ గ్యారంటీ ఇస్తామని, వడ్ల కొనుగోలుపై మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్​ చెల్లిస్తామని రాహుల్​ చెప్పారు. 

తన నాయనమ్మ ఇందిరాగాంధీకి కష్టమొచ్చిన ప్రతి సందర్భంలో తెలంగాణ అండగా నిలబడిన సంగతి ఎప్పటికీ మరువనని, ఈ రాష్ట్రంతో తనకు ఆత్మీయబంధం ఉందని ఆయన తెలిపారు. సభల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​చవాన్​, కాంగ్రెస్​ పార్టీ  అభ్యర్థులు షబ్బీర్​అలీ, సుదర్శన్​రెడ్ది, డాక్టర్​ భూపతిరెడ్డి, వినయ్​రెడ్డి, సునీల్​రెడ్డి, ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధరణి బాధితులు 20 లక్షల మంది 

కేసీఆర్​ పాలనలో అవినీతికి అంతులేకుండా పోయిందని రాహుల్​ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లకు కోట్లు దోచుకున్నారని, తాను స్వయంగా వెళ్లి ఆ ప్రాజెక్టు చూస్తే పిల్లర్లు కుంగి బీటలు వారి కనిపించాయని తెలిపారు. అక్రమ సంపాదన కోసం ల్యాండ్​, లిక్కర్​, మైన్స్, సాండ్​ను​ గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. భూరికార్డుల కంప్యూటరై జేషన్​ అంటూ ప్రారంభించిన ధరణితో చీట్​ చేస్తున్నారని, పేదలకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన భూములను ధరణి పోర్టల్​ ద్వారా లాక్కొని ఇప్పటికీ 20 లక్షల మందిని కేసీఆర్​ సర్కార్​ గోసపెడ్తున్నదని ఫైర్​ అయ్యారు. మళ్లీ కేసీఆర్​ వస్తే బలహీనుల భూములు లాక్కుంటారని ఆయన హెచ్చరించారు.