వ్యవసాయ కూలీలను పట్టించుకోకుంటే ఎట్ల? : దొంతి నర్సింహారెడ్డి

దేశంలో 28 కోట్ల వ్యవసాయ కూలీలు అనేక ప్రయాసల మధ్య తమ వృత్తి కొనసాగిస్తున్నారు. వారి జీవనోపాధి రోజు రోజుకు నరకంగా మారుతున్నది. ప్రతి రోజూ కూలి కోసం ఎదురుచూపులు, తక్కువ పని దినాలు, కూలీ ధరతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నచోట రోజూ పని దొరక్కపోతే దూరం వెళ్లాల్సి రావడం అదనపు భారం వారికి. దూర ప్రాంతంలో పని చేయడానికి రవాణా సౌకర్యాలు ఉండవు, ఉన్నా ప్రయాణ ఖర్చులు. ఇలా పరిమితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న వాహనంలో కిక్కిరిసి ప్రయాణం చేస్తుంటారు. అలా వెళ్తున్న పలుసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలు, ట్రాక్టర్లపై వెళ్తూ ప్రమాదాలకు గురై అనేక చోట్ల పేద కుటుంబాలకు చెందిన వారు చనిపోతున్నారు. లేదంటే మంచం పడుతున్నారు. వాతావరణంలో తీవ్ర మార్పుల వల్ల విపరీతమైన ఎండ, వాన, వడగండ్లు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయ కూలీల పాలిట శాపంగానే మారుతున్నాయి. విపరీతమైన ఎండలకు వడదెబ్బకు గురి కావడం, వర్షాలు బాగా పడి వాగులు దాటుతూ గల్లంతవడం, పిడుగుపాటు లాంటి ప్రమాదాలు ఎన్నో వారిని కాచుకొని ఉంటున్నాయి. ఈ ఏడాది ఏపీలో రెండు వేర్వేరు జిల్లాల్లో విద్యుత్ వైర్లు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం మీద పడగా, 15 మంది వరకు చనిపోయారు. విష రసాయనాలు పొలంలో పిచికారీ చేసి అనారోగ్యానికి గురై, వ్యాధి బారిన పడి చనిపోతున్న వారు కూడా ఉన్నారు. 

మహిళల పరిస్థితి మరీ దారుణం

మహిళల పరిస్థితి మరీ ఘోరం. పని చేసే ప్రదేశంలో కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి వాళ్లది. రోజంతా కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి పని ప్రదేశంలో ఉండటం లేదు. పైగా లైంగిక వేధింపులు కూడా ఎదురవుతాయి. చంటి పిల్లలు ఉన్న మహిళలు పిల్లలను ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వెంట తీసుకుని పోవాల్సి వస్తున్నది.  ఖమ్మంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్​లో ప్రయాణిస్తున్న దాదాపు11 మంది మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది కాళ్లు, చేతులు తెగిపోయాయి. వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించలేదు. వాహనాలకు ఉండే ఇన్స్యూరెన్స్ కూడా అనేక కారణాల వల్ల రాలేదు. ఆ బాధ తట్టుకోలేక ఆ రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్చర్యంగా, ఏదన్నా రోడ్డు, రైలు ప్రమాదం సంభవిస్తే లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటిస్తాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. అదే, వ్యవసాయ కూలీలు ప్రమాదానికి గురైతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక్క పైసా ప్రకటించడం ఇప్పటి వరకు చూడలేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, నాయకులు, ప్రజా ప్రతినిధులు కానీ ప్రమాదాల బారిన పడుతున్న వ్యవసాయ గ్రామీణ కూలీ కుటుంబాలను ఆదుకోవడం లేదు. 

ఇవీ ఘటనలు..

తెలంగాణలో 2018 జులై 24న వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో15 మంది చనిపోయారు. ఏపీలో 2022 మార్చి 9న కూలీలతో ఆళ్లగడ్డకు వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్రగాయాలయ్యాయి.  ఈ ఏడాది జనవరి 28న ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు చనిపోగా, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిరుడు మార్చి 19న హైదరాబాద్‌ – భూపాలపట్నం రహదారి 163 హైవేపై వరంగల్ జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్‌ వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. కార్మిక భద్రతకు చట్టపరంగా ప్రాధాన్యత ఉంది. కానీ వ్యవసాయ రంగంలో ఈ విషయం మీద దృష్టి కొరవడింది.

ప్రమాదం జరిగితే అంతే..

రిస్క్ ల విషయానికి వస్తే వ్యవసాయ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటున్నది. ఏదైనా ప్రమాదం బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే, అక్కడ సరైన వైద్యం అందడం లేదు. మందులు, చికిత్స ఆశించిన స్థాయిలో, అవసరం అయిన మేరకు దొరకట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అనవసర ఖర్చులతో జేబు గుల్లా. అప్పులు చేయాల్సి రావడం, వాటిని తీర్చడానికి మళ్లీ ఎట్టి కష్టమే వాళ్లకు దిక్కవుతున్నది. ప్రమాదాల బారిన పడినవారికి, విష ప్రభావానికి లోనైనవారికి ఉంటున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వ్యవసాయ కూలీల కుటుంబానికి భారంగా మారుతున్నాయి. బీమా సౌకర్యం అందుబాటులో లేదు. వృత్తిపర ప్రమాదాల వల్ల దినసరి వేతన జీవుల కుటుంబాలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి. రోజువారీ కూలికి వెళ్లిన మహిళ లేదా పురుషుడు ఏదైనా ప్రమాదంలో అవయవాలను కోల్పోతే.. వారి కుటుంబం, జీవితం దుర్బరంగా మారుతున్నది. ఏటా 2 నుంచి 5 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వ్యవసాయ రసాయనాల విష ప్రభావానికి గురవుతున్నారు. విష రసాయనాల వల్ల 40 వేల మంది మరణిస్తున్నారు. వ్యవసాయ కూలీలు ప్రమాదాల బారిన పడితే రోజు కూలీ రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చెల్లింపులు ఆలస్యం అవుతాయి. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత మీద ప్రభావం ఉంటుంది. ఉత్పాదకత నష్టాలు సంభవిస్తాయి. యాంత్రీకరణ, రసాయనాల వల్ల, స్థానికంగా పని దొరక్కపోవటం వలస వెళ్లాల్సి వస్తున్నది. ఇవన్ని కూడా వ్యవసాయ కూలి కుటుంబాలు ఎదుర్కొనే రిస్క్ లో భాగమే. వారి కుటుంబాలు నిర్వాసితులు అవుతారు కూడా. ఎక్కువ పని గంటలు శ్రమ చేసే వారు ఆయా కారణాల వల్ల చేయలేని పరిస్థితికి  చేరుకుంటే ఆదుకునే నాధుడు లేదు.

తక్షణ చర్యలు అవసరం

వ్యవసాయ కూలి కుటుంబాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల మీద సరైన సమాచార సేకరణ లేదు. సరైన డేటా ఉంటే వారి పరిస్థితి పూర్తి స్థాయిలో అర్థం అవుతుంది. వారి సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు వీరికి లేదు. వ్యవసాయ కూలి కుటుంబాలకు బీమా సౌకర్యం లేదు. వారి పరిస్థితిని ప్రతిబింబించే బీమా పథకాలు కావాలి. నష్ట పరిహారం అయితే పూర్తిగా శూన్యం. తూతూమంత్రంగా సహాయక చర్యలు ఉంటున్నాయి. గత పదేండ్లలో ప్రమాదాల బారిన పడిన వ్యవసాయ కూలి కుటుంబాలకు సంపూర్ణ నష్ట పరిహారం అందించాలి. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న వివిధ వృత్తిపరమైన ప్రమాదాలను చర్చించాలి. ప్రమాదాల బారిన పడిన వారికి సాంత్వన అందించే ప్రభుత్వ చర్యల మీద దృష్టి పెట్టాలి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొని, అవి పునరావృతం కాకుండా నిరోధించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన, రాజకీయ, సామాజిక చర్యలు అత్యంత అవసరం.

19 వేల మంది ఆత్మహత్య

శరీరం సహకరించక, పని దొరక్క, ఆదాయం రాక, అప్పుల పాలై వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు చేసుకుంటే ఎక్కడో కొంత సానుభూతి లేదా స్పందన ఉన్నా, వ్యవసాయ కూలీ ఆత్మహత్యల పట్ల అంతటా పూర్తి నిర్లక్ష్యం, నిర్లిప్తతే ఉన్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021లో 5,563 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యల సంఖ్య 2020 నుంచి చూస్తే 9% , 2019 నుంచి చూస్తే 29% పెరిగింది. ఇందులో పురుషుల సంఖ్య 5,121, మహిళల సంఖ్య 442. అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్ర(1,424), కర్నాటక(999), ఆంధ్ర ప్రదేశ్(584)లో నమోదయ్యాయి. తెలంగాణలో గత ఆరేండ్ల(2016-2021)లో 19 వేల మంది దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క 2021లోనే 4 వేలకు పైగా ప్రాణం తీసుకున్నారు. సగటు వ్యవసాయ కుటుంబం పొలం మీద ఆదాయం కంటే కూలీలపై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో చిన్న, సన్నకారు రైతులు కూలీలుగా మారుతున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

-దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్