MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్​

MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్​

ధోని.. ధోని.. అంతా ఆ మహేంద్రుడి మాయ. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా, ప్రత్యర్థి జట్టు ఏదైనా స్టేడియానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ధోని నామస్మరణతో స్టేడియం ప్రతిధ్వనిస్తోంది. అతని ఫ్యాన్స్ చేసే శబ్దాలకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు చెవులు మూసుకోవాల్సి పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్టేడియానికి వస్తున్న ప్రేక్షకుల్లో అతన్ని చూడాలన్న కోరిక తప్ప.. మ్యాచ్ చూడాలన్న ఆశ ఇసుమంతైనా కనపడటం లేదు. ఆ అభిమానాన్ని అర్థం చేసుకున్న ధోని.. ఓవైపు గాయం వేధిస్తున్నా మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.  కానీ, ఇవేవి విమర్శకులకు పట్టడం లేదు. ధోని ఎందుకు ముందుగా బ్యాటింగ్ చేయడానికి రావట్లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆ జట్టు హెడ్​ కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​ తాజాగా వివరణ ఇచ్చారు.

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్​ అనంతరం మీడియాతో మాట్లాడిన ఫ్లెమింగ్​.. ధోని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి గాయం యొక్క పరిణామాలే కారణమని వెల్లడించారు. 42 ఏళ్ల వయస్సులోనూ అతను మైదానంలో చూపిస్తోన్న ప్రదర్శనలను, అతని శక్తి సామర్థ్యాలను ప్రశంసించారు. 

ధోనీ ఒక ఇన్స్​పిరేషన్​..

"అతను అందరికీ ఇన్స్​పిరేషన్​.. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రీ-క్యాంప్‌లో అతను తక్కువ సేపు ప్రాక్టీస్ చేసేవాడు. అయినప్పటికీ.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి ధోనీ బ్యాటింగ్​మా టీమ్​కి ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే, ప్రీ-క్యాంప్‌లో అతను చూపించిన స్కిల్​ని చూస్తే.. ఎలా ఆడతాడే మాకు ముందే అర్థమయ్యింది. ఇక ధోనీని బ్యాటింగ్​ ఆర్డర్‌లో ఎందుకు ముందు పంపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధోనీ మోకాలు గాయంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు. దాని నుంచి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందువల్లే లిమిటెడ్​ బాల్స్​ ఆడాల్సి వస్తోంది"

"ధోని చివరి ఓవర్లలో వచ్చిన అద్భుతంగా రాణిస్తున్నాడు. మిగిలిన బాధ్యత బ్యాటింగ్​యూనిట్​దే. వారు మంచిగా ఆడితే.. చివర్లో ధోనీ వచ్చి, స్కోర్​ మరింత పెంచుతాడు. అతని బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అతను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటోంది. ధోనీ మా టీమ్​లో ఉండటం చాలా గర్వంగా ఉంది. చెన్నై జట్టు గుండెచప్పుడు.. ధోనీ" అని ఫ్లెమింగ్ వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఈ సీజన్ చివరలో ధోని రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:ముంబై జట్టులో మరో వివాదం.. పాండ్యా కెప్టెన్సీపై విదేశీ క్రికెటర్ అసంతృప్తి

గత సీజన్‌లోనే ధోని మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ నొప్పి నుంచి బయటపడేందుకు క్యాప్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టేవాడు. సీజన్ ముగిశాక మోకాలి గాయానికి సర్జరీ చేసినప్పటికీ.. అది పూర్తిగా నయం కాలేదు. ఎక్కువ సేపు నిబడినా, వేగంగా పరుగెత్తినా నొప్పి జాడలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ, ధోని అవేవీ బయటకు కనిపించనివ్వడం లేదు. అభిమానులు నిరాశ చెందకుండా చివరి ఓవర్లలో వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు. తన కేమియోలతో ఫ్యాన్స్​ని అలరిస్తున్నాడు.