Mahasivaratri 2025: అందరి దేవుళ్ల విగ్రహాలకు పూజలు.. ఒక్క శివుడికి మాత్రమే లింగరూపంలోనే పూజలు ఎందుకో తెలుసా..!

Mahasivaratri 2025: అందరి దేవుళ్ల విగ్రహాలకు పూజలు.. ఒక్క శివుడికి మాత్రమే లింగరూపంలోనే పూజలు ఎందుకో తెలుసా..!

 ప్రపంచంలో ఎన్నో శివ మందిరాలు ఉన్నాయి. అన్ని శివ మందిరంలోనే శివుడిని విగ్రహరూపంలో కాకుండా లింగరూపంలోనే పూజిస్తారు. శివుని ముల్లోకాలకు ఆ దేవునిగా భావిస్తారు. సింధు నాగరికత కాలంలోనే శివుని లింగ రూపంలో పూజించేవారు. లింగ పురాణం ప్రకారం శివుడిని లింగ రూపంలో ఎందుకు పూజిస్తారో  తెలుసుకుందాం..

లింగ పురాణం ప్రకారం ..  శివుడిని లింగ రూపం లోనే ఆరాధించాలి, బ్రహ్మ, విష్ణు మహేంద్రాది దేవతలు, మహర్షులు అందరు శివుడిని లింగ రూపం లో పూజించి, వేద జ్ఞానం పొందారని, ప్రణవ స్వరూపి యైన పరమాత్మను లింగ రూపంలో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ శాంతులతో బాటు ముక్తి లభిస్తుందని లింగ పురాణం ద్వారా తెలుస్తుంది.  ఇందులో కొన్నిచోట్ల శివ లింగాన్ని ఎలా పూజించాలో, ఎలాంటి కర్మాచరణ అవసరమో శివుడే స్వయంగా చెబుతాడు. ఈ పురాణం ఐదు భాగాలుగ ఉన్నది. ఆ ఐదు భాగాలలో ఏముందో చూద్దాం.

1. సృష్టి ప్రారంభం కాకముందు:  ప్రళయకాల జలధిలో గతం గుర్తులేని బ్రహ్మ...  విష్ణువు.. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకోవటం మొదలు పెడతారు. ఆ సమయం లో ఒక బ్రహ్మాండమైన, ఆద్యంతాలు లేనట్టి జ్వాలా లింగం వారి ముందు ప్రత్యక్ష మయిందట. అందులో ఓంకారం గోచరించింది. ఆ ప్రణవ నాదం లోంచి వేదాలు ఆవిర్భవిస్తాయి. వాటిని గ్రహించిన బ్రహ్మ ..విష్ణువులకు జ్ఞానోదయమయిందట. ఆ జ్వాలా లింగం మధ్యలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై చతుర్విధ పురుషార్ధాల బోధిస్తాడు. ఈ భాగంలో ఇంకా శివకళ్యాణం, సూర్య చంద్రుల కథలు, విష్ణువు యొక్క వరాహ, నృసింహ అవతార కథలు ఉన్నాయి.

2. సృష్టి ప్రారంభం తరువాత:  విష్ణువు ప్రాధాన్యత గురించీ బ్రహ్మ దేవుడు రోదసిని, గ్రహ నక్షత్రాలనుసృష్టి చేయటం గురించి,ఇంకా శివుడు ఏ యుగంలో ఎలా అవతరించాడు కథలు, దధీచి మహర్షి కథ, శిలాదమహర్షి తపస్సు కథ వంటివి ఉన్నాయి..

3.నందీశ్వర ఆవిర్భావ కథ:  కలియుగ ప్రారంభం, సప్త ద్వీపాల వర్ణన, అనేక పర్వత రాజముల గురించి, బ్రహ్మ దేవుడు సూర్యుడు మొదలైన దేవతలకు లోకాలను పాలించే బాధ్యతలు ఇవ్వటం గురించి కథలు ఉన్నాయి..

4.సూర్య చంద్ర వంశాల చరిత్రలు:  మహా భక్తుడు ధృవుని చరిత్ర.,శివుడు తొలుత అంధకుని గణ నాయకుని గా నియమించుట. జలంధరుదు మొదలైన రాక్షసులను సంహరించి భూదేవిని రక్షించుట.. తదుపరి గణేశ జననం శివుడు అతనిని గణాధిపతిగా నియమించుట.

5. ఉపమన్యుని చరిత్ర: ద్వాదశాక్షరీ మంత్ర మహిమ , షడక్షరీ మంత్ర మహిమ, శివలింగము స్థాపించు విధానం: శివశక్తి సూర్యుని రూపములో వ్యక్తమగుట, (చిన్నమస్తా) వజ్రేశ్వరీ విద్య .. వివిధ యోగ మార్గాల వివరణ అంశాలు ఇందులో ఉన్నాయి.

సందర్భానుసారంగా లింగపురాణం లో కాశీ క్షేత్ర మాహాత్మ్యం, యముని గర్వభంగం, దధీచి,దూర్వాసుని వంటి శివ భక్తుల కథలు, అనేక శివ స్తోత్రాలు, శివ సహస్ర నామావళి, ఆదిత్య హృదయం, శివరాత్రి మాహాత్మ్యం,శివ పూజా మహిమ, కిరాతార్జునీయం, వ్యాసుడు కాశి నుండి బహిష్కరింప బడటం వంటివి అనేక కధలు చెప్పబడ్డాయి.

 లింగం అంటే ఒక సంకేతం (గుర్తు) లింగా కారాన్ని పూజించడమంటే నిర్గుణ బ్రహ్మను ఆరాధించడమవుతుంది. అంటే నిర్వికార నిర్గుణ పరబ్రహ్మమును ఆరాధించుటే లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడిని పూజించడమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.