హిందూత్వను తిడితేఫేమస్​ అయితరా?

హిందూత్వను తిడితేఫేమస్​ అయితరా?

ఇటీవల ఇద్దరి వ్యాఖ్యలు చర్చనీయాంశాలయ్యాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారుడు మురారి బాపు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రామ కథ(రామాయణ ప్రవచనం) చెప్పాడు. అందులో ముఖ్యఅతిథిగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పాల్గొన్నాడు. తన టేబుల్​పై‘బంగారు గణేశుడు’ బొమ్మ ఉంటుందని, తాను నిఖార్సయిన హిందువునని, తనకు రాముడంటే ఇష్టం అని, తనను అనేక సంక్షోభాల నుంచి రామాయణం రక్షిస్తోందని పేర్కొన్నాడు. అంతేకాకుండా సభికులందరితో ‘జై శ్రీరాం’ అనిపించాడు.

అలాగే కాశ్మీర్ పూర్వ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ వరిష్ఠ నేత గులాంనబీ ఆజాద్ ఈ నెల 9వ తేదీన ఒక సభలో మాట్లాడుతూ ‘ఈ దేశంలోని ముస్లింలంతా పూర్వం హిందువులే. మొఘల్ శాసకులలో కొందరు పదుల సంఖ్యలో వచ్చి ఉండొచ్చు కానీ దాదాపు ఇక్కడి మిగతా ముస్లింలందరూ హిందూ సంతానమే’ అన్నాడు. గులాంనబీ ఆజాద్ ఊరికే అనలేదు. క్రీ.శ.1414-–1470 మధ్యలో బెంగాల్​ను పాలించిన జలాలుద్దీన్ మహ్మద్ తండ్రి రాజా గణేశ్.

అలాగే కాశ్మీర్​ను పాలించిన షా-మీర్జా(14వ శతాబ్దం) పూర్వీకులు హిందువులు. జిన్నా పూర్వీకులు షాహీవాల్ రాజపుత్రులు. బేనజీర్ భుట్టో, ఫరూక్​ అబ్దుల్లా పూర్వీకులు హిందువులే అని వాళ్ల ఆత్మకథలు చదివితే తెలుస్తుంది. క్రీ.శ.12వ శతాబ్దంకు ముందు 4 లక్షలున్న భారత ముస్లిం జనాభా నుంచి14వ శతాబ్దం పూర్తయ్యేసరికి 32 లక్షలకు పెరిగింది. బెంగాల్, కాశ్మీర్, గుజరాత్ ప్రాంతంలోని రాజపుత్రులు భయంతో విదేశీ ఇస్లామీయులకు లొంగిపోయి ఇస్లాం స్వీకరించారు. ఆ విషయాన్నే గులాం నబీ చెప్పారు. కానీ మన కథనాలు విచిత్రంగా ఉంటాయి.

వార్తల్లో నిలిచేందుకే విమర్శలు..

భారతదేశంలో పేరుకు మెజారిటీగా ఉన్నది హిందువులు. కానీ ఎవరైనా ఈ మెజారిటీలను తిట్టవచ్చు. చాలామంది నాయకులు హిందువులను తిట్టే, నేతలుగా ఎదిగారు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు నోరులేని మూగజీవాలు. లౌకికవాదం అనే రక్తాన్ని నరనరాన ఎక్కించుకున్నారు. ఓట్ల కోసం హిందువులను తిట్టని మేధావులు, నాయకులు లేరు! మరీ ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, చాలావరకు ప్రాంతీయ పార్టీల నేతలు.. మేధావులు, సూడో సెక్యులర్ పాత్రికేయులు, కళాకారులు, రచయితలు, కవులు, హర్యాలీ గుంపు!

ఇలా చెప్తూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ తమిళనాడులో ముస్లిం సంఖ్యా ప్రాబల్యం గల ‘అరవ కురిచి’ అనే చోట నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు- ‘స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఒక హిందువే. అది ఎవరో కాదు, మహాత్మాగాంధీని చంపిన గాడ్సే. అప్పటి నుంచే భారత్​లో తీవ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతం ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నాను’ అని అన్నాడు. అంటే అది ముస్లిం జనాభా ఎక్కువున్న ప్రాంతం అని ఈ మహానటుడికి ముందే తెలుసన్నది సుస్పష్టం.

గతంలో ఇలాంటి వ్యాఖ్యలే మణిశంకర్ అయ్యర్, సీతారాం ఏచూరి, కొడియేరి బాలకృష్ణన్, కరుణానిధి వంటివాళ్లు సంతుష్టీకరణకు అనుగుణంగా హిందువులే లక్ష్యంగా చేస్తూ వచ్చారు. హిందువులను అదేపనిగా తిడుతూ నాయకులుగా ఎదగవచ్చన్నదే వాళ్ల రహస్య ఎజెండా. ఈ ‘మెజారిటీ ద్వేషులు’ అప్పట్లో తమిళనాడుకు అతి సమీపంలోని శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి సుమారు 300 మంది మరణించిన ఘటనకు సంబంధించి ‘ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల’(ఐసిస్) గురించి పన్నెత్తి మాట్లాడారా?

విదేశాల్లో మన సంస్కృతి

ప్రస్తుతం భారత్​లో మెజార్టీ ప్రజల మతం హిందూ మతం. కానీ ఘోరమైన కష్టనష్టాలను హిందూత్వం ఎదుర్కొంటున్నది. కానీ వేల ఏండ్ల చరిత్రలో హిందూ ధర్మాన్ని ఎవరూ ధ్వంసం చేయలేకపోయారు. ఇది ప్రపంచమంతటా అధ్యయనంలో తేలిన పరిశోధనాంశం. ఉదాహరణకు ఇరాన్​ను ముస్లింలు కేవలం15 ఏండ్లు పాలిస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా మారింది. అలాగే ఇరాక్​ను17 ఏండ్లు, ఈజిప్ట్​ను 21 ఏండ్లు ముస్లింలు పరిపాలిస్తే అవి కూడా పూర్తి ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి.

అలాగే ఐరోపా ఖండాన్ని క్రైస్తవులు 50 ఏండ్లు పాలిస్తే అవన్నీ క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. మరి భారత్​ను 800 ఏండ్లు ముస్లింలు, 200 ఏండ్లు బ్రిటీషువారు(క్రైస్తవులు) పాలించినా హిందూ ధర్మం కాస్త దెబ్బతిన్నది కానీ ధ్వంసం కాలేదు. అదీ హిందూత్వానికున్న జీవనాడి. హిందూ సంస్కృతి వ్యాపించిన ఇస్లామిక్  దేశాల్లో కూడా హిందూత్వం పట్టు తగ్గలేదు. ఇండోనేషియా మతపరంగా అతిపెద్ద ముస్లిం దేశం.

87శాతం  ముస్లిం జనాభా ఉన్న ఆ దేశంలోని ప్రజలు ఇప్పటికీ సంస్కృతిపరంగా హిందూత్వను అనుసరిస్తారు. జర్మనీ వాళ్లు వాళ్ల వైద్యానికి మన దేశానికి చెందిన చరకుడి పేరుతో ‘చర్కాలజీ’ అని పేరు పెట్టుకొంటారు. కానీ మన దేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్ చేసే ప్రపంచ సాంస్కృతికోత్సవానికి అనుమతి దొరకదు. అమెరికాలో ‘ఆయవా’ రాష్ట్రంలో రామముద్ర ఉన్న కరెన్సీ ఉంది. ‘రాముని బాండ్లు’ 35 అమెరికా రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతున్నాయి. మనం కూడా నందలాల్ బోస్ గీసిన రాముని చిత్రపటాలను రాజ్యాంగంలో పెట్టుకున్నాం కానీ రాముని పేర ఓ నాణెం విడుదల చేయగలమా?

తిడితే పెద్దవాళ్లు కాలేరు

హిందూ మత సాహిత్యం, సంస్కృతి చాలా ప్రాచీనమైంది, విశాలమైంది, లోతైనది. ప్రశ్నించడానికి ఎక్కువ అవకాశమున్నది. పూనకం దగ్గర నుంచి వేదం వరకు అన్ని అంశాలు హిందూ ధర్మంలోనివే. అందువల్ల ఇంత విస్తృతమైన విషయాల్లో ఏదైనా ప్రశ్నించేవారికి సులభమే, కానీ జవాబు చెప్పే వాళ్లకు లోతైన అధ్యయనం ఉండాలి. హిందూ మతంలోని కొన్ని బలహీనతలు, తప్పులను మాత్రమే ఫోకస్ చేస్తూ అది ప్రపంచానికి అందించిన తాత్విక దృష్టిని మరుగుపరచాలనుకుంటే అది సూర్యుణ్ని గంపకింద దాచిపెట్టడమే అని గ్రహించాలి. ఇప్పటికైనా పొరుగు దేశాల్లో మన సంస్కృతిపై ఎందుకు గౌరవం ఉందో ఆలోచించాలి.

అంతెందుకు హిందూదేశం మానవాళి సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా ప్రవచించిన ‘యోగా’, ‘ఆయుర్వేదం’ లను ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలవారూ ఆచరించడం లేదా! అలాగే ‘హిందూత్వ’ బతికితేనే ఈ ‘బహుళత్వం’ బతుకుతుంది.  కొందరు చేసే వ్యాఖ్యలకు 18వ శతాబ్దంలో బ్రిటీషర్ వారెన్ హేస్టింగ్స్​ మాటలే సమాధానం. ‘‘Extreem frankness of Common Hindus it comes when there is nothing to hide to manpulate, to fear utmost reverense for truth and truth alone”.  దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలను తిట్టడం వల్ల తాము పెద్దవాళ్లం అవుతామనే సంస్కృతి నానాటికీ పెరుగుతున్నది. కానీ అదే తమ పాలిట శాపం అవుతున్నదన్న విషయం కూడా వారు గ్రహించే రోజు అతి దగ్గరలోనే ఉన్నది..

పైపొరను చూసి  స్పందిస్తే పొరపాటు

ఈ దేశ మెజార్టీ ప్రజల మతభావాలను ఎంతమంది నటులు, దర్శకులు నిందించారో కనీసం లెక్కపెట్టగలమా? యముడు కఠోపనిషత్తును నచికేతుడికి ప్రబోధించిన ధర్మవేత్త. అలాంటి యముడి పాత్రతో ‘యముడికి మొగుడు' అనే పేరు పెట్టి ఓ మహానటుడు సినిమా తీసి ఆడించాడు. నారదుడు మహర్షుల్లో చాలా గొప్ప వ్యక్తి. అతని పాత్రను ‘చిచ్చులు పెట్టే కొండెగాడి’గా మార్చినవాళ్లను ఏం చేయాలి? సీతను, ద్రౌపదిని అవమానిస్తూ, నమక చమకాలను పాటల్లో అవమానిస్తూ ఎందరో చలన చిత్రాలు తీస్తే మెజార్టీ ప్రజలు ఎన్నికేసులు పెట్టాలి? ఇలా హిందువులను అవమానించి సొమ్ము చేసుకోవడం కొంతమంది ఓ అలవాటుగా మార్చుకున్నారు.

ఇటీవలి కాలంలో హిందూ ధర్మాన్ని విమర్శించడం వల్లనే గొప్పవాళ్లం అవుతామని, గొప్ప పేరు వస్తుందని భావిస్తున్నవాళ్లు ఎక్కువయ్యారు. వాళ్లు హిందూ ధర్మం పైపొరలను మాత్రమే పరిశీలించి తమ అహంకారం ప్రదర్శించి ఆనందం పొందుతున్నారు. నిజానికి హిందూధర్మం ప్రస్తుతం భారత్ కు మాత్రమే పరిమితమైంది కాదు. ఇటీవల కాలం వరకు నేపాల్లో హిందూ రాజ్యం ఉండేది. మావోయిస్టుల తిరుగుబాట్లు, రాజకీయ వ్యూహం పుణ్యమాని ధ్వంసమైంది.

- డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్