పవిత్రమైన వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ హిందువులకు ఎంతో విశిష్టమైనది. ఈ రోజున ప్రతి భక్తుడు తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి, భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు. అయితే వినాయక విగ్రహం అనగానే ప్రస్తుతం మనకు మార్కెట్ లో లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను చాలా మంది వాడుతుంటారు. కానీ అలాంటి విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. అంతే కాకుండా ధర్మ గ్రంధాలలో కూడా మట్టి గణపతులనే వాడాలని పేర్కొని ఉంది. అసలు మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి.. ఆ విగ్రహం పరిమాణం ఎలా ఉండాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి.. మొదలగు విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం. .
మట్టి గణేశుడికే ప్రాధాన్యత
మట్టి గణపతి ప్రాముఖ్యత ఏమిటంటే, పురాణాల ప్రకారం, గణేశుడు మట్టితో చేసిన విగ్రహం రూపంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తాడు. మట్టి గణపతిని పూజించడం ద్వారా అనేక యాగాల ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. మట్టి గణపతిని పూజించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మట్టితో చేసిన గణపతి విగ్రహం ప్రయోజనాలు హిందూ మత గ్రంధాలు, పురాణాలలో కూడా ప్రస్తావించారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇలా పూజించడం ద్వారా వినాయకుడి పూజా ఫలం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. పురాణాల్లో కూడా మట్టి గణేశుడికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మట్టి గణపతిని శుభప్రదంగా భావిస్తారు. ఆచార్య వరాహమిహిరుడు తన గ్రంథం బృహత్సంహితలో భూసంబంధమైన లేదా మట్టి విగ్రహాలను పూజించడం శుభప్రదమని వర్ణించాడు.
విగ్రహం పరిమాణం ఎంత ఉండాలి?
వాస్తు నిపుణుల ప్రకారం ఇంటి లోపల గణపతి విగ్రహం సుమారు 7 నుండి 9 అంగుళాల పొడవు ఉండాలి. ఇంతకంటే పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అయితే దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహం ఎత్తుకు సంబంధించి ఎలాంటి నియమం లేదు.
మట్టి వినాయకుడిని ఎలా పూజించాలి
వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు ధరించండి. నదీ తీరంలో శుభ్రమైన ఒండ్రు మట్టిని తీసుకురండి. ఈ మట్టితో మీరు వినాయకుని విగ్రహాన్ని మీరే తయారు చేసుకోవచ్చు. విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత, దానిపై స్వచ్ఛమైన నెయ్యి , సింధూరం రాయండి. దీని తరువాత, విగ్రహానికి పవిత్రమైన దారం కూడా ధరించేలా చేయండి. ఇప్పుడు విగ్రహాన్ని ఆసనంపై ప్రతిష్టించండి. విగ్రహాన్ని ధూపదీపాలతో పూజించాలి.
అలాగే విగ్రహానికి ఐదు ఎర్రని పువ్వులు సమర్పించాలి. వినాయక వ్రతంలో నైవేద్యం చాలా ముఖ్యమైనది. పూజ అనంతరం సాయంత్రం వినాయక విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం ఉత్తమమైన పని అని పండితులు చెబుతున్నారు. నిష్టా నియమాలు పాటించేవారు 10 రోజుల పాటు వినాయకుడికి ఇంట్లో పూజలు చేయవచ్చని, రోజూవారీ కార్యాల్లో బిజీగా ఉండేవారు. వినాయక చవితి రోజు సాయంకాలం విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
యోగశాస్త్ర రహస్యాలు
మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీ తత్త్వం కలిగి ఉంటుంది. పృథ్వి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.
మట్టి పంచభూతాలకు ప్రతీక
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ, దాని తత్త్వం 1/2 వంతు, మిగిలిన నాలుగు భూతాల తత్త్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమిని తీసుకుంటే అందులో భూతత్త్వం 1/2 భాగం అయితే, 1/8 భాగం జలం, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం వాయువు, 1/8 భాగం ఆకాశం ఉంటాయి. దీన్నే పంచీకరణం అంటారు. ఒక్కో తత్త్వానికి ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు. భూతత్త్వానికి అధిష్ఠాన దేవత గణపతి, ఆకాశ తత్త్వానికి ఈశ్వరుడు (శివుడు), జల తత్త్వానికి నారాయణుడు, అగ్ని తత్త్వానికి అంబిక, వాయు తత్త్వానికి ప్రజాపతి (బ్రహ్మ) అధిదేవతలు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్త్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన దేవతల తత్త్వాలు అన్నీ కలిపి 1/2 భాగం ఉంటాయి.
మట్టి గణపతి.. పంచ మహాభూతాల సమాహారం
ఆకాశత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి
ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట. ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్లలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్త్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి.