
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సీఎం కేసీఆర్ తీరుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. శాంతికుమారి కన్నా సీనియర్ అయిన రాణి కుముదిని ఎందుకు సీఎస్గా నియమించలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్విట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘శాంతి కుమారిని సీఎస్గా నియమించినందుకు సంతోషం. కానీ ఈ అధికారి కన్నా సీనియర్ అయిన రాణి కుముదిని సీఎస్గా ఎందుకు నియమించలేదు. దీనికి కారణాలేంటో దళిత బంధువర్యులు కేసీఆర్ వివరించాలి. దళితురాలు అయినందుకే కుముదిని పట్ల వివక్ష చూపించారా’’ అని ట్వీట్టర్ లో ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ పై కొత్త సీఎస్ ప్రశంసలు
మరోవైపు.. సీఎం కేసీఆర్ పై కొత్త సీఎస్ శాంతికుమారి ప్రశంసలు కురిపించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తొలి ప్రసంగంలో ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ప్రభుత్వ ఆఫీసులకు వస్తే జనం కూర్చునేందుకు కూడా అవస్థలుపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగులు చూస్తే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సా లేక ఇంద్రభవనమా అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. ఇలాంటి భవనాలు అందుబాటులోకి తెచ్చిన కేసీఆర్ కు శాంతికుమారి కృతజ్ఞతలు చెప్పారు.