'ఆర్‌సీబీ - ఐపీఎల్ టైటిల్..' ఈ రెండింటి మధ్య భూమికి.. ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్‌సీబీకి టైటిల్ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు.
'ఈ సాలా కప్ నమదే' అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ హడావుడి చేయటం తప్ప.. వారి కల నెరవేరే రోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఇలా ఎందుకు జరుగుతోంది? స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్‌సీబీ.. ఐపీఎల్ టైటిల్ ఎందుకు గెలువలేకపోతోంది? లోపం ఎక్కడ..? ఇలాంటి ప్రశ్నలకు ఆ జట్టు మాజీ ఆటగాడు, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చక్కని సమాధానమిచ్చారు.
2014 నుండి 2021 వరకు దాదాపు ఎనిమిది సీజన్ల పాటు ఆర్‌సీబీకి ఆడిన చాహల్.. గతేడాదే జట్టు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో మాజీ జట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అతను.. టైటిల్ గెలిచే అవకాశాలు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తూ అవి చేజారాయని వెల్లడించారు.
"ఆర్‌సీబీ.. ఐపీఎల్ టైటిల్ గెలిచే అవకాశాలు గురుంచి చెప్పాలంటే.. 2016 సీజన్. క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, కోహ్లీ, డివిలియర్స్, స్టార్క్.. ఇలా మా జట్టు చాలా బలంగానే ఉండేది. మొదట్లో కొన్ని మ్యాచుల్లో ఓడినా.. చివరిగా 7 గేమ్‌లలో 6 గెలిచాం. వరుస విజయాలతో మాలో ఆత్మ విశ్వాసం కూడా బాగా పెరిగింది. ఆపై గుజరాత్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాం. మరో ఎండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో కనుక విజయం మాదే అనుకున్నాం. కానీ ఆ మ్యాచ్‌లో 8 తేడాతో ఓడిపోయాం".
"ఓడటం రెండు రకాలు.. ఒకటి ప్రయత్నించి ఓడిపోవడం, మరొకటి మొదటి నుండి ఓడిపోవడం. మంచిగా ఆడి కూడా ఓడిపోతే, దాని గురుంచి పెద్దగా బాధపడం. ఒకసారి మేము వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిపోయాము. 7వ మ్యాచ్ గెలిచాం. ఆ వెంటనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నాం. మాకు అదే సంతృప్తినిచ్చేది. అదే టైటిల్. ఈసారి రాజస్థాన్ జట్టు బాగా ఆడినా కూడా అర్హత సాధించలేకపోయింది. కనుక వాటి గురించి పెద్దగా ఆలోచించము.." అని చాహల్ చెప్పుకొచ్చారు.
అయితే, చాహల్ మాటలను కొందరు అభిమానులు వక్రీకరిస్తున్నారు. ఆర్‌సీబీ టైటిల్ గెలవకపోయినా.. బాగా ఆడామన్న ఆత్మసంతృప్తితో తదుపరి సీజన్‌కు సిద్ధమవుతారే కానీ ఖచ్చితంగా టైటిల్ గెలవాలన్న కసి, పట్టుదల లేని జట్టని విమర్శిస్తున్నారు.