రాష్ట్రంలో ఎందుకీ బియ్యం రగడ?

తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు కూడా రైతులు ఆగమాగం అవుతున్నారు. వడ్లను కొనే విషయమై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రకటించిన వ్యవసాయ విధానమే కారణం. ఒక విధానాన్ని తెచ్చే ముందు దాని పర్యవసానాలను ముందే అంచనా వేయాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన ఆలోచన లేకుండా చేసిన పని వల్లే రైతులు ఇప్పుడు గోస పడుతున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది తప్ప రైతులను నిజంగా ఆదుకునే దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2020లో ప్రకటించిన వ్యవసాయ విధానం ఇప్పుడు రైతులపాలిట గుదిబండగా మారింది. ఈ వ్యవసాయ విధానంతో భూములు నిస్సారమవుతున్నాయి. పండించిన ఆహారపంటలు కాలుష్యకారకం అవుతూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరోవైపు సబ్సిడీపై ఇచ్చే రసాయనిక ఎరువులు దొడ్డిదారిన బ్లాక్​ మార్కెట్​లోకి పోతున్నాయి. నకిలీ, కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతోంది. కానీ, ఏడాదంతా కష్టపడినా కనీస పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది. ఏదైనా పాలసీని ముందుకు తెచ్చినప్పుడు దాని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను కూడా ముందుగానే అంచనా వేయాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ విధానంపై సరైన ఆలోచన చేసినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు బియ్యం కొనుగోలుపై జరుగుతున్న రాద్ధాంతమే దీనికి ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బియ్యంపైనే ఇంత గొడవ ఎందుకు చేస్తున్నదో అర్థం కావడం లేదు. అదే మిగతా పంటలపై, ముఖ్యంగా మెట్ట వ్యవసాయంలో పండించిన పంటలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? వారు రైతులు కాదా? రైతులు లబోదిబో మంటుంటే వారిని పట్టించుకునే నాథుడు లేడు కానీ, చట్ట సభల్లో గలాటా చేస్తే ప్రధానమంత్రి అవుతారా? ప్రస్తుతం కేసీఆర్​ చేస్తున్నది స్వార్థ రాజకీయాలే!!. దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వీరంతా వ్యవహరిస్తున్నారు. తమ తీరుతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజల గోడు, రైతుల ఆత్మహత్యలను కూడా పట్టించుకునే తీరిక లేకపోవడం దారుణమైన విషయం.

పత్తిసాగుపై ఎందుకంత ప్రేమ?

పత్తి పంట విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం దేశవాళీ వంగడాలను ఎందుకు ప్రోత్సహించడం లేదు? అనే ప్రశ్న ఎదురవుతోంది. అలాగే రసాయనిక ఎరువుల స్థానంలో సహజసిద్ధ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇవి పర్యావరణ హితం కాబట్టే వీటిని పట్టించుకోవడం లేదా? వాటికి ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వడం లేదు? వీటి ద్వారా రైతుల ఆత్మహత్యలను కొంతైనా ఆపవచ్చు కదా! కానీ జన్యుమార్పిడి పత్తిని మాత్రమే పండించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రపంచ దేశాలు–యునైటెడ్​ నేషన్స్ బహిష్కరించిన బీజీ 2, బీజీ 3 పత్తి విత్తనాల ఉత్పత్తి, సాగును అరికట్టడం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లేవు. జన్యుమార్పిడి విత్తనాల వల్ల వచ్చే దిగుబడి, దేశవాళీ పత్తి విత్తనాల సాగు వల్ల వచ్చే దిగుబడి ముందు దిగదుడుపే. ఖర్చులు కూడా తగ్గుతాయి. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడుతుంది. కానీ జన్యుమార్పిడి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది. మల్టీ నేషనల్​ కంపెనీల ఆదాయం పెంచడానికేనా? జన్యుమార్పిడి విత్తనాల వాడకం వల్ల వస్తున్న కొత్త కొత్త తెగుళ్లను అరికట్టే దిశలో వాడే రసాయనిక మందు పిచికారి వల్ల ప్రజలకు.. పక్క పొలాలకు ముప్పు ఎదురువుతున్నా దానిపై అధ్యయనం చేసి, చట్టపరంగా ఎందుకు శిక్షించడం లేదు?

పత్తి నూనెపై లేబుల్స్ పెడుతున్నరా?

జిన్నింగ్​ మిల్లుల నుంచి పత్తి గింజలు ఎక్కడికి పోతున్నాయి? పత్తి నూనె తయారీదారులు, ఆ నూనె పై జీఎం అనే లేబుల్​ పెడుతున్నారా? దీని వల్ల కలిగే అనర్థాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా? దీని గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఈ దందాల్లో(జీఎం విత్తనాలు, జీఎం పత్తినూనె) రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులకు భాగస్వామ్యం ఉందా? లేకపోతే ఇంత విచ్చలవిడిగా ఈ వ్యాపారం ఎలా సాగుతోంది. రాజకీయ నాయకులు బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పంట కొనవచ్చు కదా? ఇది ఎందుకు చేయడం లేదు. అలా చేయకుండా పార్లమెంటులో రభస ఎందుకు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్​కుమార్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలిసి బియ్యం ఎగుమతికి అనుమతి తీసుకున్న విషయం గుర్తులేదా?

బియ్యం అంటే ఎందుకంత ప్రేమ?

మొన్న ప్రెస్​మీట్లో సీఎం కేసీఆర్ ఒక మాట చెప్పారు. పోషకాహారం సమకూర్చే దిశలో మన దేశం.. పక్క దేశాలకంటే దిగువన ఉన్నది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ ఆయన ఈ మాట చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో ముఖ్య భాగస్వాములనే సత్యాన్ని ఆయన మరిచిపోయారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేరకు సహాయ సహకారాలు అందించింది? 2013లో కేంద్రం పోషకాహారం, ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది. దీనిలో భాగంగా నిపుణులు ఇచ్చిన సలహాలు మేరకు తృణ ధాన్యాల(జొన్నలు, సజ్జలు, రాగులు)ను చేర్చింది. ఇవి కిలో రూ.1 కాగా, బియ్యం కిలో రూ.3, గోధుమలు కిలో రూ.2 గా ఉన్నాయి. తెలంగాణలో తృణ ధాన్యాలు పుష్కలంగా పండుతున్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు. అయినప్పటికీ వీటిని సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎందుకు చేర్చలేదు. బియ్యం అంటే ఎందుకంత ప్రేమ? ప్రజా పంపిణీలో వచ్చే నాసిరకం బియ్యాన్ని బ్లాక్​ మార్కెట్​కు తరలించి, మిల్లర్లు వాటిని పాలిష్​ చేసి రైతుల నుంచి కొన్న బియ్యంతో కలిపి ఎఫ్​సీఐకి అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నారు. దీనిని ప్రభుత్వం ఎందుకు అరికట్ట లేకపోతోంది. దీని వల్లే రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. ఎన్నో వంకలు పెట్టి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనాలని చూస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్తీ ఆహార పదార్థాలను అరికట్టగలిగిందా? ఇదే ఆహార భద్రతకు ప్రధానమైన అడ్డంకి కదా!. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజకీయాలు పక్కనపెట్టి.. పైన చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. ఆ దిశగా అడుగులు వేస్తేనే రైతులను కొంతైనా ఆదుకోగలం.–డాక్టర్​ సజ్జల జీవానందరెడ్డి, ఎనలిస్ట్