కార్తీకమాసం : ఉపవాసం ఎందుకు ఉండాలి... దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఇదే..

కార్తీకమాసం : ఉపవాసం ఎందుకు ఉండాలి... దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఇదే..

కార్తీకమాసం కొనసాగుతుంది.  కార్తీమాసంలో హిందువులు .. చాలా మంది ఉపవాస దీక్షను పాటిస్తారు.   ఈ నెలలో అంటే కార్తీకంలో మిగతా రోజులు ఎలా ఉన్నా.. సోమవారాలు...రెండు  ఏకాదశులు మాత్రం చాలా నిష్టగా ఉండి పూజలు చేస్తారు.  ఉపవాస దీక్షను పాటిస్తే అత్యంత ఫలవంతమైనదని పురాణాలు చెబుతున్నాయి.  అసలు ఉపవాసం అంటే ఏమిటి..కార్తీకమాసంలో ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. . . 

కార్తీకమాసం నెల రోజులు చాలామంది ఒంటి పూట చేసి.. మరో పూట ఉపవాసం ఉంటారు.  ఇక సోమవారాలు.. ఏకాదశి తిథులలో (నవంబర్​ 12) పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు దీపారాధన .. పూజ అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాస దీక్ష భక్తుడిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుందని పండితులు చెబుతున్నారు.  అందుకే  ఈ ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది.  

మనం నిత్యం చేసే పనులు చేసుకుంటూనే ఉపవాసం ఉండి  మనసును భగవంతునిపై లగ్నం చేయాలి.  ఉప అంటే భగవంతునికి దగ్గర అని అర్దం కాగా... వాసం అంటే నివసించడం అని అర్దం.  ప్రస్తుతం హైటెక్​ యుగంలో అన్నం తినడం మానేసి ఉపాహారాలు తింటూ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు.  కేవలం అన్నం మానేయడమే ఉపవాస దీక్ష కాదు.  మనసును.. ఇంద్రియాలను నిగ్రహించుకుని భగవంతునిని ధ్యానిస్తూ ఉండటమే అసలైన ఉపవాసమని పురాణాలు చెబుతున్నాయి. 


కార్తీకమాసంలో తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాల అనంతరం చన్నీటితో స్నానం చేయాలి.  తరువాత ఆవు నెయ్యితో కాని.. నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి.  తరువాత రోజువారీ చేసే విధంగా పూజ చేసుకోవాలి.పూజలో భాగంగా.. శివుడిని ధ్యానించాలి,  శివ అష్టోత్తరం చదువుతూ.. మారేడు దళాలతో పూజించాలి. అనంతరం పరమేశ్వరుడికి టెంకాయ కొట్టి,, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.  అనంతరం దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామిని అర్చించి.. భజనలు చేస్తూ.. పురాణ కాలక్షేపం చేయాలి.   తరువాత  కార్తీక పురాణాన్ని పఠించాలి. 

ఉపవాసం ఉండేవారు పాలు.. పండ్లు.. పడ్ల రసాలు తీసుకోవచ్చు.  వేయించిన పదార్దాలు.. బియ్యంతోతయారు చేసినవి.. ఉడికించిన వాటిని తినరాదు. ఉప్పును దరిచేయనీయకూడదు.  వయసు మీరిన వృద్దులు  ఆరోగ్య కారణాల రీత్యా రోజంతా ఉపవాసం ఉండటం కష్టంతో కూడుకున్న పని. అందువలన వారు పగలంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని.. దీపారాధన .. దైవదర్శనం అనంతరం ఉపవాస దీక్షను విరమించాలి.  ఇలా కార్తీక మాసంలో ప్రతి సోమవారం .. ఏకాదశి తిథులలో ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది.

ఉపవాసం వెనుక శాస్త్రీయత కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం అనేది కేవలం భగవంతుని కోసమే కాదు.. అది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగ పడుతుంది.  అందుకే మన పెద్దలు.. పూజలు.. వ్రతాల పేరిట ఉపవాస దీక్షను ప్రవేశపెట్టారు.  ఉపవాసం శరీరానికే కాదు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. తిన్న ఆహారం బాడీపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది,  అందుకే మునులు.. మహర్షులు .. సాత్వికమైన ఆహారం తీసుకుంటారు.  రుషులు తపస్సు చేసుకునే సమయంలో ఉప్పు కారాలు లేని.. కందమూలాలు తిని జీవించేవారు. ఉపవాసం ఉన్నప్పుడు భగవంతుని ధ్యానించడం తప్ప ఏ ఇతర ఆలోచన రాదు.  మానసిక ప్రశాంతతకు ఇంద్రియ నిగ్రహానికి మించిన ఉపవాసం కాని మందులు కాని లేవు. అందుకే ఫీవర్​ సమయంలో అన్నం తినవద్దని పాలు.. రొట్టె తినమని వైద్యులు సూచిస్తారు. 

ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోగ్య విషయంలో జీర్ణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.  మనము వీకాఫ్​ ఎలా తీసుకుంటామో... జీర్ణవ్యవస్థకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. అలా ఇచ్చినప్పుడే జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకుని శరీరంలోని దోషాలను ఎదుర్కొని అవి దీర్ఘకాలిక రోగాలుగా మారకుండా చూస్తుంది.  అసలు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణవ్యవస్థ బాగా శ్రమించాలి.  అందుకే ఆహారం తిన్న వెంటనే కొంచెం మగతగా ఉంటుంది.

కార్తీకమాసంలో చలి.. వేడి దాదాపు సమానంగా ఉంటుంది.  దీంతో ప్రకృతి.. వాతావరణంలో వచ్చే మార్పులతో  వ్యాధులు.. రోగాలు వృద్ది చెందే అవకాశం ఉంటుంది.  ఇలాంటి సమయంలో శరీరం సమతుల్యత పాటించాలంటే ఉపవాసం దివ్య ఔషధమని చెబుతారు.  అందుకే కార్తీక మాసంలో ప్రతి సోమవారం.. ఏకాదశి తిథులలో ఉపవాసం ఉండాలని చెబుతారు.  మరి మనం కూడా కార్తీకమాసం ఉపవాసాలు పాటిస్తూ.. అటు భగవంతుడిని ధ్యానిస్తూ... ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. . . .