ప్రజలు ఇంటికి పంపితే మా మీద ఏడుపెందుకు ? : మంత్రి కోమటిరెడ్డి

ప్రజలు ఇంటికి పంపితే మా మీద ఏడుపెందుకు ? : మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, వెలుగు: ‘పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన ఇక చాలు’ అని ప్రజలు ఇంటికి పంపితే.. ఆ పార్టీ లీడర్లు తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా, దోచుకున్న సొమ్ముతో పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి కారణంగానే తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్ష కోట్లు, సీతారామసాగర్‌కు రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు నోరుందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ హయాంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

పదేండ్లలో ఇరిగేషన్‌ పేరున రూ. 1.81 లక్షల కోట్లు  ఖర్చు చేస్తున్నామని చెప్పి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. వాళ్ల హయాంలో కట్టిన కాళేశ్వరం వాళ్ల పాలనలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రంతో కొట్లాడి గోదావరి జలాల్లో 67 టీఎంసీల నీళ్లను సీతారామ్‌సాగర్‌కు కేటాయింపజేశామన్నారు. 

ఎస్సారెస్పీ స్టేజ్‌ 2 ద్వారా నీళ్లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి కేసీఆర్‌... రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న, కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులను, రోడ్లను త్వరలోనే కంప్లీట్‌ చేస్తామన్నారు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏ ప్రపోజల్స్‌తో వచ్చినా తక్షణమే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

సోనియాగాంధీ కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయారా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
‘సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. సోనియాగాంధీ దేవత’ అని ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కిన సంగతి కేసీఆర్‌ మర్చిపోయినట్లున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు పోతాయని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.

కేసీఆర్‌కు నిజంగా మానవత్వం ఉంటే కాంగ్రెస్‌ను మోసకారి అనడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారం పోయినా, ఎంపీ ఎన్నికల్లో సున్నా వచ్చినా పగటి కలలు కనడం ఆపడం లేదని ఎద్దేవా చేశారు. రూ. 500 కోట్ల అవినీతి సొమ్ముతో బహిరంగ సభ పెట్టడం గొప్ప కాదని, అలాంటి సభను తాను పదిరోజుల్లో పెట్టి చూపించగలనన్నారు.