రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఇదే....

రథ సప్తమిరోజు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలి....జిల్లేడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏమిటి..  దీని వెనుక ఆధ్యాత్మికమేనా.. సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా.. అనే విషయాలను తెలుసుకుందాం. . . 

రధసప్తమి రోజు (ఫిబ్రవరి 16)  జిల్లేడు ఆకులు శరీరం పైన ధరించి తలస్నానం చేసి సూర్యారాధన చేస్తారు. ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది. ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అంటారు. ఈ అర్కపత్రాలను గణపతి పూజలో విశేషంగా వాడతారు. మన పూర్వీకులు మనకు అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారాలతో కలగలిపి అందించారు. ఈ ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి. దీనిని ఆంగ్లలో బెలడోనా అంటారు. 

పూర్వం వ్రణాలను( పుండ్లు, గాయాలు) నయం చేయడానికి అర్కచెట్టు నుంచి వచ్చే పాలతో నల్లటి జిగురు పదార్ధాన్ని తయారుచేసి అది ఒక గుడ్డమీద పూసి వ్రణాలకు అంటించే వారు. ఈ ప్రక్రియలను చిల్లుల పలాస్త్రి అనేవారు. కాస్త వేడిచేసి వ్రణాలపైన అంటిస్తే నెప్పి,వాపు, తగ్గించడంతో పాటు దానిలోని బాక్టీరియాను చంపుతుంది. ఇంత విజ్ఞానాన్ని  మనకు ఆచారాల రూపంలో అందిస్తే మనం దానిని తృణీకరించి, ఆధునికులమన్న పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్నాము. మన ఆచారాలు సంప్రదాయాలు వైజ్ఞానిక దృష్టితో ఏర్పరచబడ్డాయి. వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ మన ముందు తరాలకు అందించవలసిన గురుతర బాధ్యత మనపైన ఎంతైనా ఉందని మరచిపోవద్దు.

 ఆరోగ్య పరంగా సూర్యరశ్మి మానవునికి ఎంతో అవసరం. సూర్యునినుండి వెలువడే లేలేత కిరణాలలో విటమిన్‌ డి నిండి ఉంటుంది. ఇది మానవాళికి ఎంతో అవసరం. అందుకే వైద్యులు సైతం విటమిన్ డి కోసం కొంత సేపు సూర్యునికి ఎదురుగా నిలబడమని చెబుతారు. . పుట్టిన పిల్లలో డి విటమిన్ లోపం రాకుండా సూర్యుడికి ఎదురుగా ఉంచమని చెబుతున్నారు. అందుకే హిందువులు సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. యోగాలో ఒక భాగమైన సూర్య నమస్కారాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో సూర్యారాధనకు సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. రామాయణంలో రాముడు, రావణుని వధించడానికి సూర్యోపాసన చేశాడు. అగస్త్యమునిచేత చెప్పబడిన ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని రాముడు ఉపాసించాడు. ధర్మరాజు వెంట అడవికి వచ్చిన అనేకమంది పౌరులకు ఆహారాన్ని సమకూర్చడానికి ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను పొందినట్లు మహాభారతం చెబుతుంది.

భూమిపై జీవరాశుల మనుగడకు సూర్యుడే కారణం. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అంటారు. హిందూ సంప్రదాయం(Hindu Mythology) ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. అన్నదాత, ఆరోగ్య ప్రధాత అయిన సూర్యభగవానుని ఆరాధించే రోజును రథసప్తమి(Radha Sapthami)గా జరుపుకుంటారు హిందువులు. ప్రకృతి ప్రేమికులైన భారతీయులు ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. సూర్య భగవానుని రధానికి 7 అశ్వాలు ఉంటాయి. ఈ ఏడు అశ్వాలు ఏడు రంగులకు, ఏడు వారాలకు ప్రతీకలుగా చెబుతారు.