భారత క్రికెటర్లపై ఎందుకింత ద్వేషం..? కోతుల్లా కనిపిస్తున్నారా..?

భారత క్రికెటర్లపై ఎందుకింత ద్వేషం..? కోతుల్లా కనిపిస్తున్నారా..?

భారత క్రికెటర్లపై పొరుగు దేశపు పాకిస్తాన్ అభిమానులు నోరు పారేసుకోవడం సదా మాములే. ఇతర దేశాల చేతిలో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైనా.. భారత ఆటగాళ్లు విఫలమైనా దాయాది అభిమానులు నోరు పారేసుకుంటుంటారు. భారత క్రికెటర్లకు ఆడటమే రాదన్నట్లు కామెంట్లు, పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఓ మహిళా కామెంటేటర్ నోరు జారిన మాటలు చూస్తుంటే.. ఇతర దేశాల విశ్లేషకుల్లోనూ, అభిమానుల్లోనూ అటువంటి చిన్నచూపు ఉన్న భావన కలుగుతోంది. 

గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. జట్టులోని మిగతా బౌలర్ల నుంచి పెద్దగా సహకారం లభించనప్పటికీ, తానొక్కడే ఆసీస్ ఇన్నింగ్స్ ను త్వరగా ముగిసేలా చేశాడు. దాంతో, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించే క్రమంలో ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ ఒకరు నోరు జారారు. 

చింపాంజీతో పోల్చటం..!

మూడో టెస్టులో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇషా గుహ.. బుమ్రాను "మోస్ట్‌ వాల్యుబుల్ ప్రిమేట్(MVP)"అని ప్రశంసించింది. ఇంత పెద్ద పదం పొగడ్త అనుకునేరు.. కాదు. ప్రిమేట్ అనేది జాక్ అనే ఒక చింపాంజీ ప్రధాన ఆకర్షణగా తెరకెక్కించిన ఆంగ్ల హాస్య చిత్రం (మోస్ట్‌ వాల్యుబుల్ ప్రిమేట్). ఇదే విమర్శలకు దారితీసింది. భారత పేసర్‌ను చింపాంజీ క్యారెక్టర్‌తో పోల్చడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె బహిరంగ క్షమాణపణలు చెప్పాలని భారత అభిమానులు డిమాండ్ చేశారు. 

ALSO READ | IND vs AUS 3rd Test: సచిన్‌ వీడియోలు చూసి నేర్చుకో.. కోహ్లీకి సునీల్ గవాస్కర్ సలహా

భారత పౌరులారా క్షమించండి.. ఇషా గుహ 

భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇషా గుహా క్షమాపణలు చెప్పింది. భారత ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం తాను చేయలేదని.. జరిగిన తప్పిదం పొరపాటున జరిగినదని వివరణ ఇచ్చుకుంది. బుమ్రా సాధించిన అద్భుతాలను ప్రశంసించే క్రమంలో పొరపాటున ఆ పదం వాడినట్లు తెలిపింది. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించింది.