డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..? డీలిమిటేషన్పై వివాదాలు ఇవే..

డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..? డీలిమిటేషన్పై వివాదాలు ఇవే..

భారతదేశంలో ప్రతిపాదిత డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌పై దేశవ్యాప్తంగా  తీవ్ర వివాదం మొదలైంది. పలు రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్​పై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాల జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. కానీ, పలు కారణాలతో కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఇంత పెద్ద దేశంలో  జనాభా లెక్కలను పూర్తి చేయలేకపోయింది.

చివరి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. చట్టం ప్రకారం తదుపరి డీలిమిటేషన్ 2021లో జరగాలి.  జనాభా లెక్కల తర్వాత ఇది  జరగాల్సి ఉంది. కానీ,  కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను కేంద్రం నిర్వహించలేదు. దీంతో డీలిమిటేషన్​ కూడా జరగలేదు.  ఇక ఇప్పుడు జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉంది. 

బహుశా 2025 లేదా 2026లో జనగణన జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన మనం  ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి జనాభా లెక్కలు. రెండోది నియోజకవర్గాల డీలిమిటేషన్.   మూడోది  మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ మూడు  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికల్లోగా  జనాభా లెక్కలు జరిగితే, 2029 పార్లమెంటు ఎన్నికల నాటికి చాలా పెద్ద మార్పులను ఆశించవచ్చు.

అసెంబ్లీలు, పార్లమెంట్లో  మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది. మొత్తం దేశాన్ని ఒక యూనిట్‌‌‌‌‌‌‌‌గా తీసుకుని, ప్రతి రాష్ట్ర జనాభా ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. ఒక రాష్ట్రానికి, పార్లమెంటు సీట్ల సంఖ్య చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక రాష్ట్ర పార్లమెంట్​ స్థానాలు జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్రం పాత్రను నిర్ణయిస్తాయి. 

1976 వరకు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగానే జరిగింది.  1975లో తమిళనాడు, కేరళ వంటి వేగంగా అభివృద్ధి చెందిన,  అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోతున్నాయని, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వాటి జనాభా పెరుగుతున్నందున ఎక్కువ సీట్లు పొందుతున్నాయని అనేక రాష్ట్రాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడం మొదలైంది.  

వాజ్​పేయి కూడా స్థానాల సంఖ్య పెంచలేదు
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ జనాభా నియంత్రణపై చాలా ఆసక్తి చూపారు.  తమిళనాడు అభిప్రాయాలు సరైనవని,  వారు తమ జనాభాను నియంత్రిస్తున్నందున వారిని కుటుంబ నియంత్రణ పేరిట శిక్షించకూడదని సంజయ్ గాంధీ ప్రభుత్వానికి సూచించారు. కాబట్టి చారిత్రాత్మక 42వ సవరణను రాజ్యాంగంలోకి తీసుకువచ్చారు, ఇది వివిధ రాష్ట్రాల ఎంపీల సంఖ్యను స్తంభింపజేస్తుందని పేర్కొంది. 

దీని అర్థం ఒక రాష్ట్రంలో డీలిమిటేషన్ జరుగుతుంది. కానీ, ప్రతి రాష్ట్రానికి ఎంపీల సంఖ్య 1971లో ఉన్నట్లే ఉంటుంది. తర్వాత 2001లో  జనాభా లెక్కల తర్వాత మళ్లీ  అదే సమస్య తలెత్తింది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్​పేయి కూడా 1976లో ఇందిరా గాంధీ చేసినట్లుగానే చేశారు. వాజ్​పేయి 84వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు, ఇది కూడా ఎంపీల సీట్లను స్తంభింపజేసింది.  అప్పుడు డీఎంకే అటల్ బిహారీ వాజ్​పేయితో కలిసి కేంద్ర ప్రభుత్వంలో ఉంది. 

డీలిమిటేషన్ వివాదాలు
ఇప్పుడు దేశవ్యాప్తంగా  కొత్తగా జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేయడం తప్పనిసరి, ఎందుకంటే 84వ రాజ్యాంగ సవరణ 2026 నాటికి డీలిమిటేషన్ నిర్వహించాలని పేర్కొంది. ఇప్పుడు  ప్రధానంగా నెలకొన్న వివాదం.. ఎంపీ సీట్ల సంఖ్యను స్తంభింపజేస్తారా లేదా పెంచుతారా లేదా జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తారా? ఈ ప్రశ్నల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తారు. 

లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యుల సంఖ్య 543 వద్ద ఉండి, జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ స్థానాలను కోల్పోతాయి. మరోవైపు  తూర్పు, ఉత్తరాది  రాష్ట్రాల పార్లమెంట్​ నియోజకవర్గాలు పెరగడంతో ఎంపీల సీట్లు పెరిగి  ఎక్కువ లబ్ధి పొందుతాయి. ఒకవేళ లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యుల సంఖ్యను  ప్రస్తుతం ఉన్న 543 నుంచి పెంచితే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు లభిస్తారు. 

అమిత్​ షా దిద్దుబాటు మాట సరిపోదు
ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 80 మంది ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు 42 మంది ఎంపీలు ఉన్నారు. సీట్ల సంఖ్యను 20% పెంచితే, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 96 మంది ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు 50 మంది ఎంపీలు మాత్రమే ఉంటారు. అందువల్ల ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాల మధ్య అంతరం ప్రస్తుత 38 ఎంపీల నుంచి 46 ఎంపీలకు పెరుగుతుంది. ఏవిధంగానైనా డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి చాలా ఆందోళన వ్యక్తం అవుతున్నందున  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  దిద్దుబాటు చర్యలకు  సిద్ధమయ్యారు.

ఏ దక్షిణాది రాష్ట్రానికీ మునుపటి కంటే తక్కువగా  ఎంపీ సీట్లు ఉండవని. వారికి ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ పార్లమెంట్​  సీట్లు ఉంటాయి అని అన్నారు. కానీ, అదే  పెద్ద సమస్య.  దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు. కానీ, ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎంపీల సంఖ్య పెరుగుతుంది. 

అంటే,  దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలకు చాలా ఎక్కువ మంది  ఎంపీలు ఉంటారు, ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల  జనాభా చాలా పెరిగింది. అమిత్ షా చాలా తెలివిగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య తగ్గదు అని అన్నారు. కానీ,  అదే సమయంలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల ఎంపీల సంఖ్య దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా పెరుగుతుందని అమిత్ షా వెల్లడించలేదు.

ఎంపీల సంఖ్యను ఎందుకు స్తంభింపజేయాలి?
భారతదేశం అంతటా ఎంపీల సంఖ్యను స్తంభింపజేయడం ఉత్తమ పరిష్కారం.  మునుపటిలా.. లోక్​సభలో మొత్తం ఎంపీల సంఖ్యలో పెరుగుదల ఉండాలంటే, అది చాలా చిన్న పెరుగుదలగా ఉండాలి. అంటే 560 స్థాయిలో ఉండాలి. అలాకాకుండా ఇంకా ఎక్కువగా ఎంపీల సంఖ్య ఉంటే  రాష్ట్రాల మధ్య భయాలు,  అసమతుల్యతలు ఏర్పడతాయి.  కాగా,  మొదట భారతదేశం చాలా వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. మన దేశానికి ఇంకా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.  మన దేశానికి స్వాతంత్ర్యం లభించి ఇంకా 80 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 

కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీలను ఇవ్వడం వల్ల తలెత్తే సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం దేశ జనాభాలో విస్తారమైన మార్పులు ఉన్నాయి. ఒడిశా, బెంగాల్, బిహార్, అస్సాం,  ఉత్తరప్రదేశ్ నుంచి లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి కోసం,  పని కోసం దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్‌‌‌‌‌‌‌‌లకు వెళుతున్నారు. వారు బహుశా అక్కడే స్థిరపడి ఓటర్లుగా మారతారు. భారతదేశంలో జనాభా స్థిరపడటానికి మరో 20 సంవత్సరాలు వేచి ఉండటం మంచిది.  

ఇందిర, వాజ్​పేయి గొప్ప నేతలు
దక్షిణాది నుంచి లక్షలాది మంది ప్రజలు విదేశాలలో పనిచేస్తున్నారు. అదేవిధంగా దక్షిణాది నుంచిలక్షలాది మంది ప్రజలు ఇతర రాష్ట్రాల్లో  పనిచేస్తున్నారు. వారిపై ఇతర  రాష్ట్రాల్లో వైషమ్యాలు, వివక్ష తలెత్తకూడదు. ప్రస్తుత తరుణంలో భారతదేశానికి మరో వివాదం అవసరమా అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. 

కొన్ని రాష్ట్రాల్లోని పార్టీలు ప్రజాస్వామ్యంలో అధికారాన్ని కోల్పోతున్నామని భావిస్తే, ఇతర రాష్ట్రాల్లోని తమవారి మనోవేదనలను రాజకీయం చేసి సమస్యాత్మకంగా మార్చతాయి.  అందుకే ఇద్దరు గొప్ప నాయకులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయి పార్లమెంటు సీట్లను స్తంభింపజేసారు. మనం వేచి ఉన్నప్పుడు చాలా సమస్యలు తొలగిపోతాయి. ‘జనాభా ప్రకారం అధికారం’ అనే నినాదం ఇక్కడ వర్తించకూడదు.

పెంటపాటి పుల్లారావు, సోషల్​ ఎనలిస్ట్