పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో తైవాన్ ఒక రాష్ట్రమని చైనా చెబుతోంది. తమది రిపబ్లిక్ ఆఫ్ చైనా(ఆర్ఓసీ) పేరు గల స్వతంత్ర దేశమని తైవాన్ వాదిస్తోంది. తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించడం కానీ, గుర్తించినట్లుగా అభిప్రాయం ఏర్పరచగల చర్యలకు గానీ దిగవద్దని ఇతర దేశాలపై చైనా దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోంది. తైవాన్ ప్రజాస్వామిక దేశంగా ముందుకు సాగడం దానికి కంటగింపుగా ఉంది. తైవాన్ పై దాడికి చైనా సమాయత్తమవుతోందని వస్తున్న వార్తల వెనుక మతలబు, తైవాన్ ప్రాధాన్యం సంతరించుకోవడానికి గల కారణాలను చూద్దాం.
చైనాకు తూర్పు దిశన180 కిలోమీటర్ల దూరంలోనున్న చిన్న దేశం తైవాన్. దానికి ఉత్తరాన, ఈశాన్యాన తూర్పు చైనా సముద్రం ఉంది. అలాగే, జపాన్ దక్షిణ కొస కిందకు వచ్చే ర్యూక్యూ దీవులు ఈశాన్యాన ఉన్నాయి. తైవాన్ కు తూర్పున పసిఫిక్ మహా సముద్రం ఉంది. దక్షిణాన తైవాన్ ను ఫిలిప్పీన్స్ నుంచి వేరుచేస్తున్న బాషీ జలమార్గం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కీలక పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సాధనాల్లో వాడే అధునాతన సెమికండక్టర్ చిప్ లలో 90 శాతం తైవాన్ లోనే తయారవుతున్నాయి. అమెరికన్ సంస్థలకు వెళుతున్న చిప్ లలో 92 శాతం తైవాన్ సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ) అందిస్తోంది. చైనాదీ అదే పరిస్థితి. చైనా వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థ తైవాన్ సంస్థలపై ఎంతగా ఆధారపడిందంటే, తమ సెమికండక్టర్ పరిశ్రమే తమకు రక్షణ కవచంగా పనిచేస్తోందని తైవాన్ ధీమాగా ఉంది. దాన్ని అది ‘సిలికాన్ షీల్డ్’ గా పిలుచుకుంటోంది. ఒకవేళ చైనా దాడిలో చిప్ ల పరిశ్రమలు ధ్వంసమైనా లేదా తైవాన్ స్వయంగా వాటిని నేలమట్టం చేసినా లభించే విజయం ‘వృథా విజయమే’ అవుతుంది.
అమెరికా భయం ఏమిటి?
తమ దేశంలోని ఏఎస్ఎంఎల్ అనే కంపెనీ నుంచి విడి భాగాల సరఫరా లేకపోతే చైనా కూడా చిప్ లను తయారు చేయలేదని తైవాన్ కు ఓ ధైర్యం. ఫిలిప్స్, ఏఎస్ఎం ఇంటర్నేషనల్ అనే కంపెనీలు కలిసి సంయుక్త రంగంలో అడ్వాన్డ్స్ సెమికండక్టర్ మెటీరియల్స్ లితోగ్రఫీ(ఏఎస్ఎంఎల్) అనే కంపెనీని నెలకొల్పాయి. తైవాన్ లో సెమికండక్టర్ చిప్ ల తయారీ సదుపాయాలను నిర్వీర్యం చేస్తే వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే చైనా పథకాలకు గండికొట్టినట్లు అవుతుందని అమెరికా భావన. ఒకవేళ తైవాన్ చైనా హస్తగతమైతే వచ్చే కొన్నేండ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఏటా ఒక ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. అమెరికా తయారు చేసే పేట్రియాట్ క్షిపణుల్లో జపాన్ లో తయారైన కంప్యూటర్ మైక్రోచిప్ లు ఉంటాయి. తోషిబా, మిత్ సుబుషి, సుమిటోమొ వంటి సంస్థలు, ఇతర దేశాల్లోని సంస్థలు చిప్ ల సరఫరాను నిలిపివేస్తే, అమెరికా క్షిపణుల వ్యవస్థ గందరగోళంలో పడుతుంది. ఇపుడు తైవాన్ ఒకవేళ చైనా అధీనంలోకి వెళ్లి చిప్ ల సరఫరా ఆగిపోతే తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికా ఆందోళన చెందుతోంది. అప్పుడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చైనా పెత్తనం చెలాయిస్తుంది. చైనా చిప్ ల కోసం తైవాన్ పై ఆధారపడడం తగ్గించి, స్వదేశంలో వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే పనిలో పడితే తైవాన్ భావిస్తున్న ‘సిలికాన్ షీల్డ్’ ఎంతవరకు అక్కరకొస్తుంది? అని అమెరికాతో సహా ఇతర ప్రజాస్వామిక దేశాల భావన. చైనాలోని యాంగ్ సీ మెమొరి టెక్నాలజీస్ కంపెనీకి చైనా ప్రభుత్వం 700 కోట్ల డాలర్లు అందేటట్లు చూస్తోంది. ప్రభుత్వ అండదండలున్న మైక్రోచిప్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కి చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ 3 వేల కోట్ల డాలర్ల సహాయానికి పూచీ పడుతోంది. అయితే, చైనా, మైక్రోచిప్ ల ఉత్పత్తిలో పైచేయి సాధించడానికి మరికొన్నేండ్లు పడుతుంది. ప్రపంచంలోని 500 సర్వోత్తమ, అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్లలో 186 చైనా వద్ద, 123 అమెరికా వద్ద ఉన్నాయి. సాఫ్ట్ వేర్, యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనువర్తిత సూత్రాలతో నడిచే సూపర్ కంప్యూటర్లకు శక్తినిచ్చే సెమికండక్టర్ చిప్ ల ఎగుమతులు, సరఫరాలపై అమెరికా విధించిన ఆంక్షలతో కమ్యూనిస్టు చైనా గింజుకుంటోంది.
సమ్మిళిత వ్యాపారాలతో భరోసా
టెక్నాలజీల్లో కనిపిస్తున్న పురోగతి రెండు రకాల ప్రభావాన్ని కనబరుస్తోంది. అంతర్జాతీయంగా పలుకుబడిని ప్రదర్శించడానికి, అధికారం కోసం వివిధ దేశాల మధ్య పోటీ పెరిగింది. ఉక్రెయిన్ వంటి యుద్ధాలు, యుద్ధ భయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామగ్రి పరిశ్రమల వృద్ధి కొనసాగుతోంది. వాగ్నర్ లాంటి ప్రైవేటు సైన్యాలకు ఫైనాన్షియర్లు నిధులు ఇస్తున్నారు. టెక్నాలజీని అభివృద్ధిపరిచే సంస్థలు అటు అమెరికా ఇటు చైనాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో నాలుగోవంతు వాటా బహుళ జాతి కంపెనీల చేతుల్లోనే ఉంది. జనరల్ ఎలక్ట్రిక్, ఐబీఎం వంటి కంపెనీలకు అమెరికాలోకన్నా ఇతర చోట్లనే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలోని వంద అతి పెద్ద ఆర్థిక సంస్థల్లో సగం పైగా బిజినెస్ కార్పొరేషన్లుగా అవతరించాయి. వివిధ దేశాలు యుద్ధాలకు దిగితే రకరకాల భౌగోళిక ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సమీకృత వ్యాపార సంస్థలు నష్టపోయే అవకాశం ఉంది. అందుకనే, ఘర్షణల తాలూకు ఆర్థిక పర్యవసానాల గురించి అవి ఆయా దేశాల్లోని ప్రభుత్వాల అవగాహనను పెంచుతున్నాయి. తైవాన్‌తో దుస్సాహసానికి దిగకుండా చైనాను నిరోధిస్తున్నది బహుశా అలాంటి ఆర్థిక పర్యవసానాలే కావచ్చు.
భారత్ ముంగిట అవకాశం
భారతదేశాన్ని సెమికండక్టర్ చిప్ ల తయారీలో ప్రవర్థమాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన వాతావరణాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ్ నిర్భర్ భారత్ పేరిట చేపట్టిన కార్యక్రమాలకు ఊతమిస్తోంది. అంతర్జాతీయ సెమికండక్టర్ల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అవతరింపజేసేందుకు ఏకంగా రూ. 76,000 కోట్ల విలువైన ద్రవ్య ప్రోత్సాహమివ్వడానికి నిర్ణయించింది. ఫలితంగా, వచ్చే పదేండ్లలో భారత స్థూల జాతీయోత్పత్తికి అవి అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల విలువను జోడించనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యాగావకాశాలు వస్తాయి. అయితే, భారత్ చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ మాదిరిగానే బహుళ పార్టీ సభ్యులతో కూడిన బృందాలను తైవాన్ కు పంపాలి. అక్కడి సంస్థలు భారత్ లో చిప్ ల తయారీకి ముందుకొచ్చేటట్లు చేయాలి. చైనా మనకు పొరుగునే ఉండటం తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చు కానీ, అది తైవాన్ తో మనం వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవడంలో వెనకడుగు వేయడానికి కారణం కాకూడదు. ముంబయిలో తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ను నెలకొల్పుకుంటామని తైవాన్ కోరుతోంది. దానికి అనుమతించాలి. గతంలో చెన్నైలో అలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించడం వల్ల తమిళనాడు, కర్నాటక, తెలంగాణాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఉత్సాహం చూపాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా 700 కోట్ల డాలర్ల మేరకు ఉంది. తైవాన్ జలసంధిలో యధాతథ స్థితి మారే విధమైన చర్యలకు, ఉద్రిక్తతలకు తావివ్వవద్దని, సంయమనం పాటించాల్సిందని భారత విదేశాంగ శాఖ అనుసరిస్తున్న వైఖరి కూడా తైవాన్ మెప్పును పొందుతోంది. తైవాన్ తో పొత్తు ఏ విధంగా చూసినా భారతదేశానికి మేలు చేకూరుస్తుంది.
చైనా నుంచి కంపెనీలు అవుట్?
అమెజాన్, గూగుల్, శామ్ సంగ్, వోల్వో సహా, సరఫరాల గొలుసుకట్టు వ్యవస్థలో ఆధిపత్యం వహిస్తున్న మూడో వంతు సంస్థలు తమ కలాపాలను చైనా నుంచి ఇతర దేశాలకు మార్చే యోచనలో ఉన్నాయి. చైనా భారతదేశంపైకి కాలు దువ్వినప్పుడల్లా చైనా వస్తువులను బహి ష్కరించడం ద్వారా దానికి మార్కెట్ ను దూరం చేయాలనే నినాదం భారతదేశంలో పుంజుకుంటూ ఉంటుంది. తైవాన్ లో సెమికండక్టర్ల పరిశ్రమ దెబ్బతింటే గూగుల్, ఫేస్ బుక్, టెస్లా, ఆటో మొబైల్ కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల కలాపాలు కూడా తీవ్రంగా దెబ్బతిం టాయి. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదనంతర పరిణామాలతో సరఫరాల తాలూకు గొలుసుకట్టు వ్యవస్థలు దెబ్బతిని, ధరలు, మార్కెట్ల విషయం లో ఆకస్మిక ఉత్థానపతనాలను చవిచూ స్తున్న కంపెనీలు మరో ఆర్థిక ఉపద్రవాన్ని తట్టుకోగల స్థితిలో లేవు. అందుకే, నిబంధనల ఆధారిత ఆర్థిక పాలన ఏర్పడేం దుకు, అవి తోడ్పాటును అందిస్తున్నాయి. నవీకరణలకు ప్రోత్సాహం కల్పిస్తూ, వృద్ధి విస్తరణకు నడుం బిగిస్తున్నాయి. ఉదాహరణకు యాపిల్ ఉత్పత్తి విస్తరణ వల్ల ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి 2025 నాటికి భారతదేశంలో తయారైనది కాబోతోంది. సెమికండక్టర్ చిప్ ల ఉత్పత్తిని ఇండియా, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలకు విస్తరిస్తే తైవాన్ పై దాడి జరిగినా, దాని తాలూకు ఆర్థిక నష్టాన్ని కొంత కట్టడి చేయవచ్చు.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్