
భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగ్లు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే ఆరుసార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్‌లో శుక్రవారం ( మార్చి 28 ) మధ్యాహ్నం భూమి కంపించడంతో 1000 మందికి పైగా చనిపోయారు. 2 వేల మంది వరకు గాయపడ్డారు.
శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై అత్యధికంగా 7.7 నమోదుకాగా, అత్యల్పంగా 4.3గా రికార్డయింది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి.
మయన్మార్పైనే ఎందుకంత ప్రభావం?
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో మయన్మార్ ఒకటి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య మయన్మార్ ఉంటుంది. ఈ ప్రాంతాన్నే ‘సాగింగ్ ఫాల్ట్’గా వ్యవహరిస్తారు. అక్కడ సాగింగ్ పేరుతో పట్టణం ఉండటంతో ఆ ప్రాంతాన్ని అలా పిలుస్తుంటారు. భూమి పొరల అమరికలో లోపాలు ఉండటాన్నే ఫాల్ట్ అంటారు.
మయన్మార్‌లో ఇది దాదాపు 1,200 కి.మీల మేర విస్తరించింది. భూగర్భంలో పొరల అమరికల వల్ల రెండు భూభాగాలు ఒకదానికొకటి కదులుతుంటాయి. ఈ కదలికలు ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేశారు. 18 మి.మీ చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగుతుండటంతో భూగర్భంలో ఒత్తిడి పెరిగి భూకంపాలకు దారితీస్తుంటాయి.
మయన్మార్ భూకంపాల చరిత్ర
1930 నుంచి 1956 మధ్య మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు నమోదయ్యాయి. అందులో 7కు పైన ఆరు సార్లు భూమి కంపించింది. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్‌లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు, 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా ముగ్గురు చనిపోయారు. తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.