సర్కార్​ జీవోలను ఎందుకు దాస్తున్నరు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరులను ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి.
సదరు నిధులకు తానొక ట్రస్టీనే తప్ప యజమానిని కాదనే సత్యాన్ని ప్రభుత్వం మర్చిపోరాదు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు కోసం
నిధులను కేటాయిస్తూ జీవోలను జారీ చేసే క్రమంలో పూర్తి పారదర్శకతను పాటించాలి. అప్పుడే అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరే అవకాశం
ఉంటుంది. ప్రభుత్వ బడ్జెటరీ విధానాలకు అనుగుణంగా సమగ్ర రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే క్రమంలో అన్ని ప్రాంతాలను,
అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వనరుల కేటాయింపులకు సంబంధించి సమధర్మాన్ని పాటిస్తున్నామని
నిరూపించుకోవాలనుకుంటే వివిధ పథకాల ద్వారా ఏ ప్రాంతానికి, ఏ సామాజికవర్గానికి, ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులను కేటాయించిందో, దానికి ప్రాతిపదిక
ఏమిటో స్పష్టంగా తెలియపరిచే జీవోలను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పోస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేసినప్పుడే ప్రజలకు,
ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏర్పడి రాష్ట్రాభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. పారదర్శకతకు పెద్దపీట వేసి, తన పాలనలో కొత్త ఒరవడి
సృష్టిస్తున్నామని చాలా సందర్భాల్లో చెప్పిన కేసీఆర్.. ఎన్నో సార్లు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకే కాక నేరుగా ప్రజలకూ ఫోన్​ చేసి మాట్లాడారు. ఇక
రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ప్రజలకు చేరువై వారి వ్యక్తిగత
సమస్యలను కూడా పరిష్కరించారు. అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధీనంలో ఉన్న ముఖ్య శాఖలకు సంబంధించిన అధిక శాతం జీవోల
విషయంలో ఎందుకు పారదర్శకతను పాటించడం లేదనేది మిలియన్  డాలర్ల ప్రశ్న.

మిస్సింగ్ జీవోల మతలబేంటి?
ఈ ఇంటర్నెట్ యుగంలో చట్టసభల్లోనే కాదు సుప్రీంకోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను కూడా ప్రజలు లైవ్​లో వీక్షించే పారదర్శక విధానాలు
అమలవుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వం 1,50,334 జీవోలను జారీ చేయగా అందులో 77,000 జీవోలు పబ్లిక్ డొమైన్
లో కనపడకపోవడాన్ని ఏమనుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇతర టెండర్ల జీవోలు, ప్రభుత్వం ఇటీవల
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు జీవో, కమ్మ, వెలమ కులాల భవనాల నిర్మాణానికి భూకేటాయింపుల జీవోలు, ఉద్యోగ నియామక ప్రక్రియకు
సంబంధించిన క్యాడర్ స్ట్రెంగ్త్​ జీవో, కొత్తగా 159 బార్లకు అనుమతిచ్చే జీవోలు కూడా పబ్లిక్​డొమైన్​కు దూరంగా ఉంచడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని
శంకించవలసి వస్తోంది. ప్రభుత్వ జీవోల్లోని ప్రతి అక్షరం ప్రజల హితం కోసమే రాసినప్పుడు.. అది జారీ చేసిన తేదీ నుంచి సంవత్సరాలు గడిచినా పబ్లిక్
డొమైన్ లోకి ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు ప్రజల ప్రశ్న. జీవోలను రహస్యంగా ఉంచడంపై ఓ సంస్థ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది. వాదనలు
విన్న కోర్టు ప్రజల సంక్షేమం కోసం జారీ చేస్తున్న జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తోందని ప్రశ్నించింది. జారీ చేసిన 24 గంటల్లో సదరు
జీవోలను పబ్లిక్ డొమైన్ లో ప్రజల పరిశీలన కోసం ఉంచాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రభుత్వాలు చెబుతుంటాయి. పాలకులు సేవకులుగా మారి ప్రజల అభ్యున్నతి కోసం రూపొందించే ప్రతి విధానాన్ని
ప్రజలకు తెలియజేయాలి. ప్రజలందరికీ సమ న్యాయాన్ని అందించే ప్రతి చర్యను జనం ముందుంచే క్రమంలో ఎలాంటి గోప్యతకూ తావు లేని
కార్యాచరణను రూపొందించుకోవాలి. అప్పుడే పాలకులకు, పాలితులకు మధ్య పరిపూర్ణమైన సమన్వయం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యానికి
మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు విశాలమైన ప్రజల హితం కోసం పనిచేస్తూ.. వారు కోరుకుంటున్న ఆదర్శ పాలనను
అందించగలిగినప్పుడే ప్రభుత్వాల ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. అలా కాకుండా పాలకులు తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తూ స్వార్థ
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టినప్పుడు ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రగిలి శాంతికి విఘాతం
కలుగుతుంది. అందుకే ప్రభుత్వాలు పూర్తి పారదర్శకతతో పథకాలను రూపొందించి జీవోలు జారీ చేసిన వెంటనే పబ్లిక్ డొమైన్ లో వాటిని ఉంచడం ద్వారా
తన చిత్త శుద్ధిని రుజువు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఇదే. అలాగే జీవోలకు సంబంధించి న్యాయ వ్యవస్థ ఆదేశాలను రాష్ట్ర
ప్రభుత్వం ఎంత మేరకు నెరవేరుస్తుందో కాలమే చెప్పాలి.

మసకబారుతున్న బ్యూరోక్రసీ ప్రతిష్ట
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పరిచే క్రమంలో నిబంధనల ఉల్లంఘనలకు
సంబంధించి బ్యూరోక్రసీ కోర్టుల నుంచి చివాట్లు తింటూ జరిమానాలు, జైలు శిక్షల పాలవుతుండడం బాధాకరం. కోర్టుల తీర్పులను అమలు పరచని ఏ
స్థాయి ప్రభుత్వ అధికారులపై నైనా ధిక్కారణ కేసులు పడినప్పుడు న్యాయ సహాయాన్ని అందించే ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.56 కోట్ల
గ్రాంటును విడుదల చేయడం వివాదాస్పదమైంది. న్యాయ వ్యవస్థతో పోరాడటానికి నిధులను ఎలా విడుదల చేస్తారని హైకోర్టు ప్రశ్నించడంతో.. ఆ నిధులు
బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికే తప్ప న్యాయ వ్యవస్థతో పోరాడటానికి కాదని క్లారిటీ ఇచ్చే క్రమంలో జీవో డ్రాఫ్టింగ్ లో తప్పు జరిగిందని సాక్షాత్తు
సీఎస్​ అంగీకరించారు. సదరు జీవోను రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీవోను జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని బట్టి సెక్రటేరియట్​ పనితీరు
ఎలా ఉందో సామాన్యులకు కూడా అర్థమవుతోంది.

- నీలం సంపత్, సోషల్​ యాక్టివిస్ట్