రాష్ట్ర ప్రభుత్వానికి దేశంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పథకాల్లో అతి ముఖ్యమైనది రైతుబంధు. ఆరుగాలం ఎండలో ఎండి, వానకు తడిసి రాత్రనక పగలనక నిత్యం కష్టపడి, పంటలు నష్టపోయినా మళ్లీ వ్యవసాయాన్నే నమ్ముకునే రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం మంచిదే. కానీ, పథకానికి నిర్ధిష్టమైన భూ పరిమితి లేనందు వల్ల ప్రజాధనం భూస్వాములు, ధనవంతులు, వ్యాపారవేత్తలకు ముడుతోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు? అలా ఆలోచన చేస్తలేదంటే కావాలనే రైతు పేరుజెప్పి వాళ్లకు దోచిపెడుతున్నారన్నమాట. కనీసం ఈ భూస్వాములు వ్యవసాయం చేస్తారా అంటే అదీ లేదు. ఇతర రైతులకు భూములను కౌలుకు ఇచ్చి.. రైతుబంధు పథకం పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కౌలు రైతులకన్నా ఈ పథకం ఇస్తే కొంత ఉపయోగం ఉండేది. కానీ పట్టాదారులకే వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్తోంది.
ఎందుకు పరిమితులు పెట్టరు?
ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పథకానికైనా నియమాలు, నియంత్రణ, పరిమితి లాంటి ఆంక్షలు ఉంటాయి. అదే రైతుబంధు పథకంలో ఎందుకు అలాంటి ఆంక్షలు పెట్టడం లేదు? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. కాని కేంద్రం అర్హులకు భూ పరిమితి పెట్టి చిన్న, సన్నకారు రైతులకు ఏటా ఎకరాకు రూ. 6,000 ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూ పరిమితి పెట్టకుండానే ఒక సాలుకు ఎకరాకు రూ. 5,000 చొప్పున ఏటా ఒక ఎకరాకు రూ. 10,000 ఇస్తోంది. కేవలం సొంత పట్టా పాసుబుక్, బ్యాంకు అకౌంట్ నెంబర్ ఉంటే చాలు రైతుబంధు కింద డబ్బులు ఇస్తోంది. ఒక గుంట భూమి నుంచి వందల ఎకరాల భూమి ఉన్నా కూడా అర్హులే అనేది రాష్ట్ర ప్రభుత్వం విధానం. గత యాసంగి పంటకు ఈ పథకం కింద 1.52 కోట్ల వ్యవసాయ భూమికని 61.49 లక్షల రైతులకు రూ. 7,515 కోట్లు ఇచ్చింది. ఈ వానకాలం పంటకు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. 61.49 లక్షల రైతుల్లో ఎంతమంది చిన్న, సన్నకారు రైతులున్నారు.. భూస్వాములు ఎంతమంది ఉన్నారు.. అనేది ఇక్కడ ప్రశ్న? ఈ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేకపోలేదు. కానీ.. రైతు పేరు చెప్పి రాష్ట్ర నిధులను భూస్వాములకు, బడా బడా లీడర్లకు, ధనవంతులకు రాజమార్గంలో దోచిపెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతులను మోసం చేయడమే.
పరిమితి పెట్టాలి
రైతుబంధు పథకంలోని లోపాలను సరిచేసి ఆపకుంటే ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా బద్నాం అయ్యే చాన్స్ ఉంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులకే రైతుబంధు వర్తింపజేయాలన్నది ప్రతిపక్ష, ప్రజా, సామాజిక నాయకులు, వివిధ శ్రేణుల మేధావులు, విద్యా వంతుల డిమాండ్. పరిమితి పెట్టకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. మంచి పథకం ఉద్దేశం దెబ్బతింటోంది. కొంత మంది భూస్వాములు మానవత్వ కోణంలో ఆలోచన చేసి రైతుబంధు ద్వారా తమకు వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం దానం చేస్తున్నారు. కానీ 90% మంది వాళ్ల అవసరాల కోసం వాడుకుంటున్నారు. ‘‘మేమేమన్నా ప్రభుత్వాన్ని దానంగా అడుగుతున్నామా? అది ప్రభుత్వ పథకం. నాకు భూమి ఉంది.. ప్రభుత్వం ఇస్తోంది.. నేను తీసుకుంటున్నా అంతే. ఇస్తే వద్దనలేం కదా” అని అంటున్నారు. ఇలా అవసరంలేని వాళ్లకు, వందల ఎకరాల భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం చాలా దారుణం. పరిమితి పెట్టకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు వేలకోట్ల రూపాయలు నష్టం కలుగుతోంది. భూస్వాములకు, బడా లీడర్లకు ఇచ్చే రైతు బంధు బడ్జెట్ను ఇతర సంక్షేమ పథకాలకు, పేదల కోసం వాడితే బాగుంటుంది. రైతు బంధును 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తింపజేయాలి. అప్పుడే నిజమైన చిన్న, సన్నకారు రైతులు ఎదుగుతారు. పథకం ఉద్దేశం నెరవేరుతుంది.
అధికారికంగా మోసం
రైతుబంధు ఉద్దేశం ఏంటి? ఎలాంటి నియమాలు, నియంత్రణ, పరిమితి లేకుండా... ఎలా రూపకల్పన చేశారు? ఎక్కువ భూమి కలిగినవాళ్లు తక్కువ మందే. ఇలాంటి భూస్వాముల దగ్గర్నే వందల ఎకరాల భూమి ఉంది. తక్కువ భూమి కలిగినవాళ్లే సాగు చేస్తున్నారు. వీళ్లు ఎక్కువ మంది ఉన్నారు. రైతుపేరు చెప్పి పథకం రూపకల్పన చేయడం వల్ల దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. కానీ ఇందులో ప్రత్యక్షంగా, అధికారికంగా జరిగే మోసం గమనించాలి. పథకం అమలులో భూ పరిమితిని పెట్టకపోవడంతో రాజమార్గంలో దోపిడీ జరుగుతోంది. పథకం పెట్టిన నాటినుంచి నేటి వరకు దర్జాగా ప్రజాప్రతినిధులకు, వ్యాపార వేత్తలకు, ఆసాములకు, భూస్వాములకు నేరుగా బ్యాంకుల్లో లక్షలకు లక్షలు ప్రభుత్వమే డబ్బులు వేస్తోంది. పేద పిల్లలు చదువు కోవడానికి స్కాలర్షిప్ కోసం ఆర్థిక సాయం కోరితే.. పిల్లల తండ్రి ఆదాయం అడిగే ఈ ప్రభుత్వం రైతుబంధు విషయంలో ఎందుకు అలా అడగడం లేదు? వందల ఎకరాల భూమి ఉండి, కోటానుకోట్ల ఆస్తి ఉండి, లక్షలు టర్నోవర్ చేసే వ్యాపారం ఉన్నవాళ్లకు దీన్ని ఇవ్వొద్దనే ఆలోచన ఎందుకు చేయడం లేదు?
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్