- పెద్దల మాటలో దాగున్న మంచికి శాస్త్రీయత
ఆచారం పేరుతోనో.. సంప్రదాయం పేరుతోనో పెద్దలు చెప్పే చాలా విషయాల్లో మంచి దాగి ఉంటుంది. అలాంటి విషయాలను కొట్టేపారేసేవాళ్లకు కొదవేం లేదు. కానీ ఏ అమెరికా వాళ్లో వచ్చి వాటి శాస్త్రీయత చెప్పాక ఔరా అని పాటించేవాళ్లూ ఉన్నారు. అలాంటిదే మరోసారి రుజువైంది.
ఆడపిల్లలు కాలిపై కాలేసుకుని కూర్చుంటే పెద్దలు కోపగించుకోవడం చాలా ఇళ్లలో చూస్తుంటాం. కారణం అడిగితే మాత్రం పెద్దలంటే గౌరవం ఉండొద్దా అంటారు. కానీ, దానిలో దాగున్న మంచి వేరే ఉందని అమెరికాకు చెందిన ఎముకల డాక్టర్ (ఆర్థోపెడిక్ సర్జన్) బర్బరా బెర్గిన్ శాస్త్రీయంగా వివరిస్తున్నారు.
అమ్మాయిలూ.. జాగ్రత్త!
కాళ్లు రెండూ బాగా దగ్గరగా పెట్టి.. లేదా కాలిపై కాలేసుకుని, పాదాలు రెండు క్రాస్ చేసి అటూ ఇటూ పెట్టి కూర్చోవడం మహిళల్లో ఎక్కువ మందికి ఉండే అలవాటు. కానీ, ఇది మంచిది కాదని డాక్టర్ బర్బరా చెబుతున్నారు. ఎముకల డాక్టర్ అయిన ఆమె సయాటికా, మోకాలి నొప్పులు, కండరాల సమస్యలకు కారణాలపై రీసెర్చ్ చేశారు. తన స్వీయ అనుభవం తర్వాత 2010 నుంచి చాలా ఆస్పత్రుల్లో అధ్యయనం చేశానని ఆమె తెలిపారు. మగవాళ్లలాగా కాళ్లు కాస్త ఫ్రీగా పెట్టుకుని కూర్చోవాలని మహిళలకు సూచిస్తున్నారామె. ‘సిట్ లైక్ ఎ మ్యాన్(S.L.A.M)’ అంటూ డాక్టర్ బర్బరా ఓ ఉద్యమం కూడా చేస్తున్నారు.
కారణమిదే
నడుము కింది భాగంలో ఉండే రెండు కాళ్లను, శరీరంలో పై భాగాన్ని కలిపే అతి పెద్ద ఎముకల జాయింట్ ‘పెల్విన్’. శరీర నిర్మాణ (అనాటమీ) పరంగా చూస్తే సాధారణంగా ఈ భాగం మగవాళ్ల కంటే ఆడవాళ్లకు పెద్దగా, వెడల్పుగా ఉంటుంది. కాలిపై కాలేసుకుని కూర్చున్నప్పుడు తొడ ఎముక ఒకవైపుకు లాగినట్టుగా తిరుగుతుంది. దీని వల్ల ఇటు మోకాలి భాగంలో జాయింట్ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే పిదురుల (పెల్విన్) భాగంలోనూ తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దీని వల్ల ఎముకలు, కండరాల నొప్పులు వస్తాయని, దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ బర్బరా తెలిపారు. సయాటికా, కండరాల నొప్పులు, కీళ్ల సమస్యలకు కారణమిదేనని హెచ్చరించారామె.
సలహాలివీ..
- ఎప్పుడూ కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు.
- మోకాళ్లు అతికించుకుని గానీ యాంకిల్ లాక్ చేసి గానీ కూర్చోకూడదు.
- కూర్చున్నప్పుడు కాళ్లు వెనక్కి మడవడం కూడా మంచిది కాదు.
- కాళ్లు రెండూ కాస్త ఫ్రీగా పెట్టుకుని కూర్చోవాలి.
- ఆడవాళ్లకే కాదు ఈ సూచనలు మగవాళ్లకు కూడా వర్తిస్తాయని డాక్టర్ చెప్పారు.
- నిల్చున్నప్పుడు కూడా మోకాళ్ల కింది భాగం బెండ్ చేయడం మంచిది కాదని హెచ్చరించారు.