కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై సుంకాలు పెంచుతా..

 కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై సుంకాలు పెంచుతా..
  • అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన 
  • చొరబాట్లు, డ్రగ్స్​కు చెక్ పెట్టేందుకేనని వెల్లడి

వాషింగ్టన్: తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్  అన్నారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం టారిఫ్  వేస్తానని ట్రంప్  ప్రకటించారు. అమెరికాలో అక్రమ వలసదారులు రాకుండా, డ్రగ్స్  స్మగ్లింగ్ కు చెక్  పెట్టడానికి ఆ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. 

తన సోషల్  మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్’ లో సోమవారం ట్రంప్  ఈ పోస్టులు చేశారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పనిచేస్తానని, ఆ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేస్తానని స్పష్టం చేశారు. ‘‘అక్రమ వలసలు, డ్రగ్స్  స్మగ్లింగ్  జరగకుండా కెనడా, మెక్సికో దేశాలు చర్యలు తీసుకోవడం లేదు. అందుకు మూల్యం చెల్లించక తప్పదు” అని ట్రంప్  పేర్కొన్నారు. చైనా కూడా తమ దేశం నుంచి డ్రగ్స్  స్మగ్లింగ్ ను అరికట్టడం లేదని, అందుకే ఆ దేశంపైనా అదనపు సుంకం విధిస్తానన్నారు. కాగా, పారిశ్రామికవేత్త  గౌతమ్  అదానీపై అమెరికాలో నమోదైన లంచాల కేసులో ఆరోపణలు రుజువు కాకపోతే ఆయన కేసులను కొట్టివేసే అవకాశం ఉందని ప్రముఖ ఇండియన్  అమెరికన్  అటార్నీ రవి బాత్రా తెలిపారు.