పొడవైన నిలువు రాళ్లు, వాటి పైన పెద్ద పెద్ద బండలు. చూడ్డానికి భారీ నిర్మాణంలా కనిపిస్తుంటుంది. దీన్ని ఎందుకు? ఎవరు నిర్మించారు? అనే ప్రశ్నకు ఎన్నో ఏండ్ల నుంచి సమాధానం దొరకలేదు. అందుకే స్టోన్‌హెంజ్ ప్రపంచంలోని టాప్ మిస్టీరియస్ నిర్మాణాల జాబితాలో చేరిపోయింది. కానీ.. ఇప్పుడు ఆర్కియాలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ఒక సమాధానం దొరికింది.
ఇంగ్లాండ్ ఒక రాజ్యంగా ఏర్పడటానికి చాలా కాలం ముందు అక్కడికి ఐరోపాలోని ఇతర ప్రాంతాల వాళ్లు కూడా వచ్చారు. అప్పుడు పురాతన బ్రిటన్‌ను అంటే అప్పటికే అక్కడ ఉంటున్నవాళ్లను ఏకం చేయడానికి స్టోన్‌హెంజ్ నిర్మించారని ఆర్కియాలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కొత్త స్టడీ చెప్తోంది. స్టోన్‌హెంజ్ దక్షిణ ఇంగ్లాండ్‌లోని సాలిస్‌బరీ ప్లెయిన్లో ఉన్న విల్ట్‌షైర్‌లో ఉంది. దీన్ని క్రీస్తు పూర్వం 3100 నుంచి 1600 సంవత్సరాల మధ్య దశలవారీగా నిర్మించారని చరిత్ర చెప్తోంది. దీని నిర్మాణం కోసం వాడిన రాతి పలకలు నైరుతి వేల్స్, ఈశాన్య స్కాట్‌లాండ్ నుండి తీసుకొచ్చారు.
స్కాటిష్, వేల్ష్ ప్రజలే వాళ్ల ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను విల్ట్‌షైర్‌కు తీసుకువచ్చి నిర్మాణానికి సాయం చేశారని, రాజకీయ ఏకీకరణకు సహకారం అందించారని ఈ స్టడీ చెప్తోంది. ఈ నిర్మాణం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉండే వాళ్లంతా ఏకతాటిపైకి వచ్చారని ఇందులో హైలైట్ చేశారు. ఈ నిర్మాణంలో వాడిన రాళ్లను విల్ట్‌షైర్‌కు తరలించడానికి సుమారు ఎనిమిది నెలల టైం పట్టిందట! అందుకోసం వేలాది మంది కలిసి పనిచేశారు. వందల ఏండ్లు గడిచినా వాటిలో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.