ఇంటి పనిలో..
వంట పనిలో..
భర్త, పిల్లల బాధ్యతల్లో..
అత్తమామల బాగోగుల్లో...
ఇలా కుటుంబం మొత్తాన్ని నడిపించే ఆమె...
తన ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోదు. ఇది ఏ కొందరు ఆడవాళ్లకో సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఇలానే ఉన్నారు. ఇంట్లో ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా హడావిడి చేసి... దగ్గరుండి మరీ చూసుకునే ఆమె ఆరోగ్యానికి మాత్రం ఆఖరి ప్రియారిటీ. ఆరోగ్యం విషయంలో ఈ బయాస్ వద్దు. ఎలాగూ ఈ ఏడాది విమెన్స్ డే థీమ్ #బ్రేక్దిబయాస్. అందుకని మీ హెల్త్ విషయంలో కూడా ఆ బయాస్‌ను బ్రేక్ చేయండి. అందుకే పుట్టింది మొదలు పెద్దవాళ్లు అయ్యేవరకు ప్రతీ దశలో ఆడవాళ్లకు వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలి. వాటి గురించి అవేర్నెస్ వస్తే కొందరైనా ఆ హెల్త్ ఇష్యూస్ బారిన పడకుండా ఉండొచ్చు అంటున్నారు డాక్టర్లు.ఆమె ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్య బాధ్యత ఆమెతో పాటు ఇంటిల్లిపాదిది. ముఖ్యంగా ఆడవాళ్లు వాళ్ల శరీరం గురించి అవగాహన పెంచుకోవాలి. వాళ్లపై వాళ్లు శ్రద్ధ పెట్టాలి. సమస్య ఏదైనా వస్తే.. ప్రాణం మీదకి వచ్చేవరకు ఆగకుండా.. వెంటనే డాక్టర్ని కలవాలి. అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడం తేలిక అవుతుంది. అన్నింటికన్నా ముందు వ్యాధి వచ్చాక తగ్గించుకోవడం కంటే.. రాకుండా చూసుకోవాలి. అందుకోసం అసలు ఏ ఏజ్‌లో ఎలాంటి సమస్యలొస్తాయి? వాటిని అడ్డుకోవడానికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో విషయాలు వివరించారు డాక్టర్ రజిని.
ఆడవాళ్ల లైఫ్.. దశల వారీగా
0 –12ని చైల్డ్ హుడ్(బాల్యం)
12-–22 ఎడోలసెన్స్ (కౌమార, యవ్వన)
22– 30 రిప్రొడక్టివ్
30 – 45 మిడిల్ ఏజ్
45 – 60 మెనోపాజ్
0-12 చైల్డ్ హుడ్
అయితే 0– 7 ఏండ్ల వరకు ఆడపిల్లలకి జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ తప్పించి పెద్ద సమస్యలేం రావు. కానీ, ఆ ఏజ్‌లో వాళ్లు తిన్న తిండి మీదే ఫ్యూచర్లో వాళ్ల ఆరోగ్యం ఆధారపడుతుంది. అందుకే ఆ ఏజ్‌లో వాళ్లకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 ఎక్కువగా ఉండే ఆకుకూరలు , కాయగూరలు తినిపించాలి. అయితే ఆ తర్వాత అంటే 9 నుంచి 12 లేదా 15 ఏండ్ల మధ్యన అమ్మాయిల లైఫ్ సైకిల్ కీలకమనే చెప్పాలి. ఈ దశలో అమ్మాయిలు ప్రికాషియస్ ప్యుబర్టీ, కాన్స్టిట్యూషనల్ డిలేడ్ ప్యుబర్టీ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇందుకు తొంభైశాతం కారణం లైఫ్ స్టయిల్.
ఎడోలసెన్స్( 12-22 )
ప్యుబర్టీ అంటే.. అమ్మాయిలు చైల్డ్ హుడ్ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టేటప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అంటే మెనుస్ట్రుయేషన్కి రెండేండ్ల ముందు నుంచే అమ్మాయిల ఎత్తు, బ్రెస్ట్ సైజ్‌లో మార్పులొస్తాయి. ఈ దశనే ప్యూబర్టీ అంటారు. సాధారణంగా ఇది చాలామంది అమ్మాయిల్లో తొమ్మిది నుంచి పదకొండేండ్ల మధ్య వస్తుంది. దానివల్ల ఎత్తు పెరగడం, అండర్ ఆర్మ్స్‌లో (బాహుమూలల్లో) హెయిర్ , బ్రెస్ట్ సైజ్ పెరగడం లాంటివి జరుగుతుంటాయి. ఆ తర్వాత 12 నుంచి 15 ఏండ్ల లోపు అమ్మాయిలు మెనుస్ట్రువల్ సైకిల్లో అడుగుపెడతారు. కానీ, ప్రికాషియస్, కాన్స్టిట్యూషనల్ డిలేడ్ ప్యుబర్టీ వల్ల ఈ మధ్య కాలంలో ఈ సైకిల్లో మార్పులొస్తున్నాయి.
ప్రికాషియస్ ప్యుబర్టీ : కొందరు అమ్మాయిలకి పదేండ్లకే నెలసరి మొదలవుతోంది. ఈ పరిస్థితినే ‘ప్రికాషియస్ ప్యుబర్టీ’ అంటారు. ఇలా జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మెదడు లేదా వెన్నెముకలో కణితి, మెదడు, వెన్నెముకపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండటం లేదా వాటికి గాయాలవడం వల్ల, అలాగే ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా నెలసరి ముందే వచ్చేయొచ్చు. ఒక్కోసారి జన్యుపరమైన సమస్యలూ కారణమవుతుంటాయి. జంక్‌ఫుడ్ తినడం కూడా ముఖ్య కారణం. అయితే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది ఇళ్లలో దీన్నో సాధారణ పరిస్థితిగానే చూస్తున్నారు. దానివల్ల చిన్నవయసులోనే అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎనీమియా బారిన పడుతున్నారు. వీటన్నింటి నుంచి అమ్మాయిల్ని కాపాడాలంటే తొమ్మిది, పదేండ్లకే నెలసరి మొదలైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ సలహాతో కొన్ని సందర్భాల్లో ఆ రుతుస్రావాన్ని మందులు, ఇంజెక్షన్స్ ద్వారా రెండుమూడేండ్లు పోస్ట్‌పోన్ కూడా చేయొచ్చు.
డిలేడ్ ప్యుబర్టీ: సాధారణంగా అమ్మాయిలకి12 నుంచి 15 ఏండ్లలోపు నెలసరి మొదలవుతుంది. కానీ, హార్మోన్స్, జన్యు పరమైన కారణాల వల్ల, ఈటింగ్ డిజార్డర్, శరీరానికి సరిపడా ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల పదిహేనేండ్లు దాటాక కూడా మెనుస్ట్రువల్ సైకిల్ మొదలవడం లేదు. ఈ స్టేజ్‌నే డిలేడ్ ప్యుబర్టీ అంటారు. దీనివల్ల ఆడపిల్లలు సరిపడా ఎత్తు పెరగరు. యుటిరస్ డెవలప్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. గుండె, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే 15 ఏండ్లు నిండాక నెలసరి మొదలవ్వకపోతే తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి.
పీసీఒఎస్: ఆడపిల్లలు పీరియడ్స్‌లో అడుగుపెట్టాక వచ్చే సమస్య పీసీఒఎస్(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్). అంటే రెండు లేదా మూడు నెలలకోసారి నెలసరి రావడం. ప్రస్తుతం ప్రతి పదిమంది ఆడవాళ్లలో ఐదుగురికి ఈ సమస్య ఉంది. అయితే ఆడపిల్లలకి మెనుస్ట్రుయేషన్ మొదలయ్యాక మొదటి రెండు సంవత్సరాలు పీరియడ్స్ కాస్త అటుఇటుగానే వస్తుంటాయి. కానీ, ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయితే మొటిమలు, జుట్టురాలిపోవడం, మీసాలు, గడ్డాలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువరోజులు పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్లలో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో కొలెస్ట్రాల్పెరగడం, రక్తపోటు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్ సలహా మేరకు హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాలి. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్: కొంతమందికి పీరియడ్స్‌కి ముందు చిన్నచిన్న విషయాలకే విపరీతమైన కోపం వస్తుంది. టెన్షన్, చిరాకు పడుతుంటారు. అలాగే మరికొందరిలో పొట్ట కండరాలు బిగుసుకుపోవడం, గ్యాస్ లాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ సింప్టమ్స్. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌ను కలిసి మందులు వాడాలి. ఈ లక్షణాలు కాస్త తక్కువగా ఉంటే మాత్రం ఉప్పు తగ్గించి లేదా కొద్దిగా తీసుకుని, తేలిక పాటి ఎక్సర్సైజ్లు చేయాలి. అలాగే క్యాల్షియం, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
రిప్రొడక్టివ్ (22– 30 )
22 నుంచి 30 మధ్య ఆడపిల్లలకి పెండ్లిండ్లు చేస్తారు. దాంతో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, క్లామిడియా, గనేరియా, హెపటైటిస్, హెర్పిస్.. లాంటి డిసీజ్‌లు వస్తుంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్కి వచ్చేవాళ్లు చాలా తక్కువ. నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ సమస్య గురించి బయటికి చెప్పడానికి ఇష్టపడరు. కానీ, వీటివల్ల రానురాను మరిన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అండాశయంలో కణితులు, సిస్ట్‌ల వల్ల ఇన్ఫెర్టిలిటీకి దారితీసే ప్రమాదం ఉంది.ఫెలోపియన్ ట్యూబ్ మూసుకుపోయి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అందుకే సమస్యని వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి.
మిడిల్ ఏజ్( 30-45)
30 నుంచి 40 ఏండ్ల మధ్య ఆడవాళ్లని ఎక్కువగా వేధించే సమస్య మెనుస్ట్రువల్ బ్లీడింగ్. మామూలుగా పీరియడ్స్‌లో 80 ఎం. ఎల్ వరకు రక్తస్రావం సాధారణం. కానీ అంతకు మించితే ఇబ్బందే. కొందరిలో 5 –15 రోజులు, మరికొందరిలో అంతకు మించి కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌తో పాటు హైపోథైరాయిడిజమ్, ఎడినోమయోసిస్, జన్యు పరమైన కారణాలు, యుటిరస్ లేదా సర్విక్స్‌లో ఇన్ఫెక్షన్లు వంటివి కారణం కావొచ్చు. ఫైబ్రాయిడ్స్ అంటూ గర్భ సంచిలో గడ్డలు కూడా పీరియడ్స్‌లో అధిక రక్తస్రావానికి కారణమే. హార్మోన్ ఇంబ్యాలెన్స్, జెనెటికల్ కారణాల వల్ల ఇవి ఏర్పడొచ్చు. వీటి పరిమాణం, ఇవి గర్భసంచిలో ఉండే పొజిషన్‌ను బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రమాదకరం కాదు. కానీ, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హార్మోన్ ఇంజెక్షన్స్, మందులతో వీటి సైజ్ కొంత తగ్గి, లక్షణాల తీవ్రత తగ్గుతుంది. అలాగే కొందరిలో అల్ట్రాసౌండ్ ద్వారా ఫైబ్రాయిడ్స్‌చాలా వరకు కరుగుతాయి. మయొమెక్టమీ అనే సర్జరీ ద్వారా కూడా వీటిని తొలగించొచ్చు.
మెనోపాజ్( 45 – 60)
పన్నెండు నెలల పాటు పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్‌అంటారు. సాధారణంగా మన దేశంలో 46 నుంచి 52 ఏళ్ల వరకు మెనోపాజ్ దశ ఉంది. కానీ ఈమధ్య 40 ఏండ్ల కన్నా ముందే పీరియడ్స్ ఆగి పోతున్నాయి చాలా మందికి. దీన్నే ప్రి–మెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ఈ స్టేజ్‌లో ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతారు. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చెమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్‌కెళ్లడం, యూరినరీ ఇన్ఫెక్షన్, ఎముకలు పట్టేయడం లేదా బలహీనం కావడం వంటివి అవుతుంటాయి. అయితే ‘ఇది అందరిలో జరిగేదేగా’ అని బయటికి చెప్పరు చాలామంది. దానివల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందుకే 40 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న వాళ్లకి పీరియడ్స్ ఆగిపోతే డాక్టర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. లైఫ్ స్టయిల్‌తో పాటు థైరాయిడ్, జెనెటికల్, క్రోమోజోమ్‌లలో ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రి– మెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. అందుకే తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.
కొందరు ఆడవాళ్లకి మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కి కారణం కావొచ్చు. అందుకే డాక్టర్ని కలిసి అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేయించుకోవాలి. మెనోపాజ్‌దశ దాటిన ఆడవాళ్లలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. కాబట్టి అందుకు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవాలి.
ఈ టెస్టులు తప్పనిసరి
రొమ్ము క్యాన్సర్ విషయంలో వయసుకూ వ్యాధికి దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయసు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, పిల్లలు లేని వాళ్లు, ముప్పై ఏండ్లు దాటాక మొదటి బిడ్డను కన్న ఆడవాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆడవాళ్లు ఎప్పటికప్పుడు వాళ్లంతట వాళ్లే రొమ్ము పరీక్ష చేసుకోవాలి. పీరియడ్స్ పూర్తయిన వారం రోజుల తర్వాత రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఆడవాళ్లకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్స్ అన్నిటికంటే ఎక్కువ. దీన్నుంచి కాపాడుకోవడానికి 9 నుంచి 45 ఏండ్ల మధ్య అమ్మాయిలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలు పెండ్లయ్యాక పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రి–క్యాన్సర్ లక్షణాలేవీ లేకుంటే ప్రతిమూడేండ్లకు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి. ముప్ఫై అయిదేండ్లు దాటాక తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవాలి. 40 ఏండ్లు దాటాక ఏడాదికోసారి బాడీ చెకప్ చేయించుకోవడం తప్పనిసరి. ఇంటి, వంట పనులు, ఉద్యోగాలు.. వీటన్నింటి మధ్య ఆడవాళ్లు సైకలాజికల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. గృహిణుల్లో కూడా డిప్రెషన్ రోజురోజుకి పెరుగుతోంది. దీన్నుంచి బయటపడటానికి ఆడవాళ్లకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఆడవాళ్లు వాళ్లకోసం వాళ్లు కాస్త టైం కేటాయించాలి.