WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడిన బౌలర్

WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడిన బౌలర్

తాను చెప్పినట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేదన్న కోపంతో ఓ బౌలర్.. కెప్టెన్‌తో గొడవ పడి మైదానాన్ని వీడాడు. బహుశా.. ఇలాంటి ఘటన అంతర్జాతీయ క్రికెట్‌లో చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఈ విచిత్రకర ఘటనకు వెస్టిండీస్ vs ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డే వేదికైంది.

గురువారం(నవంబర్ 07) బార్బడోస్ వేదికగా వెస్టిండీస్ vs ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డ్ సెటప్‌పై ఆ జట్టు పేసర్ అల్జారీ జోసెఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను చెప్పినట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేదన్న కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు.

ఓవర్ ప్రారంభానికి ముందు అల్జారీ జోసెఫ్.. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్ ని మొహరించాల్సిందిగా కెప్టెన్‌కు సూచించాడు. కానీ, షైహోప్ అతని సూచనను పట్టించుకోలేదు. అక్కడ ఫీల్డర్ అవసరం లేదన్నట్లుగా నడుచుకున్నాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అల్జారీ జోసెఫ్.. ఆ కోపాన్ని బంతిపై చూపించాడు. పదునైన బౌన్సర్‌తో ఇంగ్లండ్ వన్ డౌన్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్(1)‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం చకచకా మరో రెండు బంతులేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సామీ క్రమశిక్షణా పాఠాలు

ఈ ఘటన జరిగిన వెంటనే వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ.. అల్జారీ జోసెఫ్‌తో మాట్లాడి అతనికి సర్థి చెప్పాడు. మైదానంలో కెప్టెన్‌కు మర్యాద ఇవ్వాలని, అతను చెప్పినట్లు నడుచుకోవాలని సూచనలు చేశాడు. దాంతో, జోసెఫ్‌ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.

ALSO READ : ఆస్ట్రేలియా- ఎ vs ఇండియా -ఎ.. కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఫుల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సిరీస్ విండీస్‍దే

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై  విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(74), డాన్ మౌస్లీ(57), జోఫ్రా ఆర్చర్(38 నాటౌట్) రాణించారు. ఆ లక్ష్యాన్ని విండీస్ బ్యాటర్లు 43 ఓవర్లలోనే ముగించారు. బ్రాండన్ కింగ్(102 నాటౌట్), కీసీ కార్టి(128 నాటౌట్) సెంచరీలతో అలరించారు. ఈ విజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.