పరారీలో ఉన్న నేరస్తుల ఆస్తులు ఎక్కువగా విదేశాలలో ఉంటున్నాయి. ఆ ఆస్తులన్నీ తిరిగి రాబట్టుకోవడం అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అందుకని వాటిని అటాచ్ చేయడం, వాటిని తిరిగి రాబట్టడమనేది అవసరమై రెండు ప్రధాన చట్టాలలో వాటి రికవరీ కోసం కొన్ని నిబంధనలను ఏర్పాటు చేశారు. ఆ చట్టాలు మనీ లాండరింగ్ చట్టం 2002, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం 2018. ఇప్పుడు మరో కొత్తచట్టం వచ్చింది.
అదే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023. ఈ చట్టం జులై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది జనరల్‌గా అన్ని నేరాలకు వర్తిస్తుంది. పీఎంఎల్ఎ, ఎఫ్ఈఓఎ చట్టాలు ప్రధానమైన చట్టాలు. భారతీయ న్యాయసంహిత (పాత ఐపీసీ)లోని అన్ని నేరాలకి ఇది వర్తిస్తుంది. బీఎన్ఎస్ఎస్లో ఓ కొత్త నిబంధనని ఏర్పాటు చేశారు.
అదే సె.107. ఈ నిబంధన ప్రకారం ఒక నేరాన్ని విచారిస్తున్న పోలీస్ అధికారికి ఏదైనా ఆస్తిని నేరకారణంగా పొందారని విశ్వసనీయంగా అనిపిస్తే, ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకుని సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో అటాచ్మెంట్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
నేరం ద్వారా వచ్చిన ఆస్తి అని ఆ మేజిస్ట్రేట్‌కి విశ్వస నీయంగా అనిపిస్తే అతను ఆ నేరస్తునికి నోటీసు ఇచ్చి ఆ ఆస్తిని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పమని కోరవచ్చు. ఈ జవాబుని 14 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుం ది. ఈ నోటీసుని సాక్ష్యం తీసుకున్న తరువాతగానీ, సాక్ష్యం తీసుకోవడానికి ముందుగానీ ఇవ్వొచ్చు.
ఒకవేళ నేరస్తుల ఆస్తి వేరే వ్యక్తి అధీనంలో ఉంటే ఆ వ్యక్తికి కూడా నోటీసును మేజిస్ట్రేట్కోర్టు ద్వారా చేయవచ్చు. వారికి నోటీసు ఇచ్చి వారి వివరణను తీసుకుని, వాళ్లకు సహేతుకమైన అవకాశం ఇచ్చి, ఆ ఆస్తులు నేరం ద్వారా వచ్చిన ఆస్తులని కోర్టు భావించినప్పుడు అటాచ్మెంట్ ఉత్తర్వులను జారీ చేస్తాయి.
ఒకవేళ ఆ వ్యక్తులు కోర్టు నోటీసు ఇచ్చిన 14 రోజులలో జవాబు ఇవ్వకపోయినా, కోర్టు ముందు హాజరుకాకపోయినా కోర్టుగానీ, మేజిస్ట్రేట్గానీ ఏకపక్షంగా ఉత్తర్వులను జారీచేయవచ్చు. నోటీసు ఇవ్వడం అటాచ్మెంట్ ఉద్దేశ్యమే దెబ్బతింటుందని కోర్టుగానీ, మేజిస్ట్రేట్గానీ భావించినప్పుడు నోటీసు లేకుండానే మధ్యంతర అటాచ్మెంట్ ఉత్తర్వులుగానీ, జప్తు ఉత్తర్వులుగానీ కోర్టు జారీ చేయవచ్చు.
అదేవిధంగా అటాచ్ చేసిన లేదా స్వాధీనం చేసుకున్న ఆస్తులు నేరం ద్వారా వచ్చిన ఆస్తి అని కోర్టు గుర్తిస్తే ఆ ఆస్తులను బాధితులకు వారి భాగాల ప్రకారం పంచమని జిల్లా మేజిస్ట్రేట్‌ని కోర్టులు ఆదేశించవచ్చు. కోర్టు నుంచి ఈ ఉత్తర్వులు అందుకున్న 60 రోజుల్లోగా అతను స్వయంగా గానీ లేక తన సబార్డినేట్‌ని గాని పంపిణీ చేయమని ఆదేశింవచ్చు.
ఒకవేళ ఆ ఆస్తి తీసుకోవడానికి క్లైయిమెంట్స్లేనప్పుడు లేదా వాళ్లని గుర్తించలేనప్పుడు లేదా క్లైయిమ్లకు మించి నేర ఆదాయం ఉన్నప్పుడు ఆ ఆస్తిని ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది.
షరతుల ప్రకారం మాత్రమే ఆస్తి జప్తు
‘నేర ఆస్తి’ అనే విషయాన్ని ఆ రెండు ప్రత్యేక చట్టాలలో ఒకేరకంగా నిర్వచించారు. దేశం వెలుపల ఉన్న ఆస్తిగానీ, దాచి ఉంచిన ఆస్తిగానీ నేర ఆస్తి నిర్వచనంలోకి వస్తుంది. ఆ విధంగా బీఎన్ఎస్ఎస్లో చెప్పలేదు. అటాచ్మెంట్ చేయ డానికి ఆ రెండుప్రత్యేక చట్టాలలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. అది బీఎన్ఎస్ఎస్లో లేదు. కొన్ని షరతుల ప్రకారం మాత్రమే ఆస్తిని జప్తు చేయడానికి అవకాశం ఉంది.
అవి సంబంధిత ఎస్పీ, కమిషనర్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తరువాత మేజిస్ట్రేట్ దగ్గర దరఖాస్తు చేయాలి. మేజిస్ట్రేట్ ఆ నేరస్తుల దగ్గర నుంచి, ఆ ఆస్తి ఉన్న వ్యక్తులకు నోటీసు ఇచ్చి 14 రోజుల్లో జవాబు కోరాలి. ఆ తరువాత వాళ్లకి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన తరువాత అవసరమని భావిస్తే ఆస్తిని అటాచ్ చేయమని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.
ఆ రెండు ప్రత్యేక చట్టాలలో అటాచ్ చేయడానికి అది ‘నేర ఆస్తి’ అని నమ్మడానికి కారణం ఉండాలి. అది రాతపూర్వకంగా వాళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అది కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్ ఆధారంగా కారణాలు రాయాల్సి ఉంటుంది. కానీ, బీఎన్ఎస్ఎస్సె.107లో ఆ విధంగా లేదు. పోలీస్ అధికారి ‘నేర ఆస్తి’ అని నమ్మడానికి అతను ఎలాంటి కారణాలను చూపించాల్సిన అవసరం లేదు.
ముద్దాయికి పరిమిత హక్కు
ఈ రెండు ప్రత్యేక చట్టాల ప్రకారం అటాచ్చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఉన్నప్పుడే అటాచ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అలాంటి షరతులు ఏవీ సె.107 బీఎన్ఎస్ఎస్లో చెప్పలేదు. నోటీసు ఇచ్చిన తరువాత ప్రత్యేక చట్టాలలో వివరణ ఇచ్చుకోవడానికి ఇచ్చిన వ్యవధి 30 రోజులు. సె.107 ప్రకారం ఈ వ్యవధి 15 రోజులు మాత్రమే.
ఆ వ్యవధిలోఅతను హాజరు కాకపోయినా సరైన వివరణ ఇవ్వకపోయినా కోర్టు ఏకపక్షంగా అటాచ్మెంట్ ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అంతేకాదు కోర్టు ఏకపక్షంగా కూడా ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అంటే బీఎన్ఎస్ఎస్లో ముద్దాయి తన వాదనను వినిపించుకోవడానికి ఉన్న హక్కు పరిమితమైనది. అంతేకాదు 60 రోజుల తరువాత అటాచ్ చేసిన ఆస్తిని బాధితులకు పంపిణీ చేయవచ్చు.
ఇది కూడా ప్రత్యేక చట్టానికి మించినది. చార్జెస్‌ను నిర్ధారించేటప్పడు ముద్దాయి ఎలాంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందు ఉంచే అవకాశం లేదు. అందుకని తప్పుడు కేసులో ఇరుక్కున్న ముద్దాయి చట్టం చట్రం నుంచి బయటపడటం కష్టం. చివరగా ఈ అధికారాలని వినియోగించేది ఎక్కువగా మేజిస్టేట్ కోర్టు. వాళ్లు ఎక్కువగా కొత్తవాళ్లు. అనుభవం తక్కువ ఉన్నవాళ్లు. ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రత్యేక చట్టాలని మించిపోయింది సె.107. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
‘జప్తు’ అంటే ఏమిటనేది.. మూడు చట్టాల్లోనూ నిర్వచించలేదు
మనీలాండరింగ్, పరారీలో ఉన్న వ్యక్తుల చట్టాలకి బీఎన్ఎస్ఎస్కి మధ్య ఉన్న భేదంను పరిగణనలోకి తీసుకుంటే..మనీలాండరింగ్ని నిరోధించడానికి, అదేవిధంగా మనీలాండరింగ్ వల్ల వచ్చిన ఆస్తిని జప్తు చేయడానికి ఆ చట్టంలో ఈ అటాచ్మెంట్ నిబంధనని ఏర్పరిచారు. అదేవిధంగా 100 కోట్లకు మించి ఆర్థిక నేరాలకు పాల్పడి భారతదేశం వెలుపల ఆస్తులని సంపాదించిన పరారీ నేరస్తుల ఆస్తులని జప్తు చేయడానికి ఆ చట్టంలో అటాచ్మెంట్ నిబంధనలను ఏర్పరిచారు. అయితే, బీఎన్ఎస్ఎస్ అనేది ప్రాథమికమైన మౌలిక చట్టం.
‘జప్తు’ అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈ మూడు చట్టాల్లో ఎక్కడా నిర్వచించలేదు. అటాచ్మెంట్ అంటే ఏమిటో పీఎంఎల్ఎ (మనీలాండరింగ్) చట్టంలో మాత్రమే నిర్వచించారు. దీని గురించి ఓ ప్రత్యేకమైన అధ్యాయం ఉంది.
ఆస్తి అటాచ్మెంట్ అనేది ఆ రెండు చట్టాలులోని సె.4, సె.5లలో తెలిపారు. కొత్త బీఎన్ఎస్ఎస్ చట్టంలో ఓ కొత్త నిబంధనని ఏర్పాటు చేశారు. అదే సె.107. భారతదేశంలో ఉన్న ఆస్తిని జప్తు చేసే విధానం గురించి ఈ నిబంధన చెబుతున్నది. భారతదేశం వెలుపల ఉన్న నేర ఆస్తి జప్తు గురించి సె.115లో పేర్కొన్నారు.
- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)