రోడ్లను వెడల్పు చేసి సిటీని ముంచిన్రు

హైదరాబాద్​ సిటీ నీట మునగడానికి పాలకుల తప్పిదాలే కారణం. 1908లో నగరానికి వచ్చిన వరదలతో 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో అతలాకుతలమైన హైదరాబాద్​ను వరద ముంపు నుంచి రక్షించే ప్రయత్నాలు నిజాం పాలనలోనే పక్కాగా అమలయ్యాయి. కాలం గడుస్తున్న కొద్దీ పాలకులు పట్టించుకోకపోవడం, లోపభూయిష్టంగా ఉన్న టౌన్ ప్లానింగ్ నగరాన్ని నీట మునిగేలా చేశాయి.

ఏండ్ల కింద హుడా, జీహెచ్ఎంసీ గుర్తించిన 3,150 చెరువులు, కుంటలు హైదరాబాద్​లో ఉండేవి. రానురాను చెరువులు, కుంటలు తగ్గిపోయాయి. ఒకప్పుడు బాలానగర్–జీడిమెట్ల–కూకట్ పల్లి–బీహెచ్ఈఎల్ గొలుసుకట్టు చెరువులకు మారుపేరు. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చినా.. ఆ స్థాయిలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. ముఖ్యంగా నిజాం కాలం నాటి డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్, గొలుసుకట్టు చెరువులన్నీ తెలంగాణ వచ్చిన తర్వాతే నిర్వీర్యమయ్యాయి. ప్లాన్​ ప్రకారం నిర్మించిన స్ట్రామ్, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాల్సి ఉండగా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో వరద నీరు నిలవకుండా ఉండేలా రోడ్లకు ఇరువైపులా నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్లన్నీ కూలిపోయాయి. అభివృద్ధి పేరిట చేపట్టిన రోడ్ల విస్తరణ, ఆక్రమణలతో సిటీ వ్యాప్తంగా ఉన్న 1,200 కిలోమీటర్ల డ్రైన్లు మట్టిలో కూరుకుపోయాయి. ఒకప్పుడు నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలతో వర్షం నీరు వాటిలోకి వెళ్లిపోయేది. కానీ ఈ మార్గాల్లో కాలనీలు, బస్తీల నిర్మాణం చేయడంతో ఈ సమస్య వచ్చింది. వందేండ్ల కిందట నగరంలో నమోదైన వర్షపాతం ఇప్పుడు సమానమే. కానీ నష్ట నివారణ చర్యలను పక్కాగా అమలు చేయలేకపోయారు. మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణం చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత తీవ్ర నష్టం జరిగేది. శతాబ్ధాల కాలం నాటి డ్రైనేజీ సిస్టంపై పూతలు వేస్తున్నారే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపించేలా అభివృద్ధి చేయలేకపోయారు.

డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ సిస్టం సక్కగలేదు

ఇక రాష్ట్రాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ వ్యవస్థ పెరాలసిస్ రోగిలా మారింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు నిధుల కేటాయింపు జరిగినట్టుగా రాష్ట్రాల్లో నిధులు అందడం లేదు. వరదలు, విపత్తులతో నష్టాలు కలిగితే అధికారులు, పాలకులు నీట మునిగిన ప్రాంతాల్లో పాల ప్యాకెట్లు, అన్నం పొట్లాలు పంచడం తప్ప.. వచ్చే ఏడాది ఇవే వరదలు రావనే భరోసా కల్గించేలా యాక్షన్ ప్లాన్ కు రూపకల్పన చేయలేకపోతున్నారు. డ్రైన్, స్ట్రామ్ వాటర్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ఉండాలి. కరోనా, వరదలతో హైదరాబాద్ చిన్నాభిన్నమైంది. ఇది ప్రభుత్వ ఆదాయ మార్గాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో సంక్షేమ పథకాల అమలు తీరు కుంటుపడుతుంది. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే ముందస్తు ప్రణాళికలు అవసరం. ముఖ్యంగా నగరం నీట మునిగితే, హెల్త్, రెవెన్యూ, ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. సమస్యకు రిపేర్ చేసే సూచనలు, నివేదికలు బీరువాల్లో మూలుగుతున్నాయి. వీటిని పక్కాగా అమలు చేయాల్సిన  పాలకులు.. షో కేస్​ నిర్మాణాలైన ఫ్లైఓవర్లు, స్కైవేలపై దృష్టి పెట్టారు. వీటితో ఖజానా ఖాళీ అవుతుందే తప్ప.. సామాన్యుడికి ఒరిగేదేమీలేదు.

– పురుషోత్తంరెడ్డి, పర్యావరణ వేత్త

For More News..

బీ కేర్‌ఫుల్.. వరద నీటితో రోగాల ముప్పు

మూసీని ఆక్రమించింది రాష్ట్ర సర్కారే

తెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!

ఖమ్మం అత్యాచార బాధితురాలు మృతి