దిలావర్​పూర్​లో హైటెన్షన్

దిలావర్​పూర్​లో హైటెన్షన్
  • ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రెండో రోజు రైతుల నిరసన
  • పోలీసులపైకిరాళ్లు విసిరే ప్రయత్నం
  • రోడ్డుపైనే వంటా వార్పు..సామూహికభోజనాలతో ఆందోళన
  • ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నామన్న కలెక్టర్
  • తాత్కాలికంగా నిరసన విరమిస్తున్నం: రైతులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయమే పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదికొచ్చి రాస్తారోకో చేపట్టారు. దిలావర్​పూర్, గుండపల్లితో పాటు చుట్టుపక్క ఉన్న 10 గ్రామాల ప్రజలు, రైతులు రాస్తారోకోలో పాల్గొన్నారు. మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీ గంగారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రైతులు.. పోలీసులపై రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోడ్డుపైనే వంటలు చేసుకుని సామూహిక భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఎస్పీ జానకి షర్మిల ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కాగా, మంగళవారం రాస్తారోకోలో పాల్గొన్న వారిలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలియడంతో రైతులు, మహిళలు దిలావర్​పూర్ పీఎస్​కు చేరుకుని నిరసన తెలిపారు. పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. తమవాళ్లను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఎలాంటి పుకార్లు నమ్మొద్దు: కలెక్టర్

రైతుల ఆందోళన నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దన్నారు. ఆందోళన విరమించాలని కోరారు.

కలెక్టర్ హామీతో నిరసన విరమిస్తున్నం: రైతులు

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారని రైతు సంఘం నేతలు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట తప్పితే మళ్లీ నిరసన చేపడ్తామని హెచ్చరించారు.

ఆర్డీవోను కారులో నిర్బంధించడం సరికాదు

హైదరాబాద్, వెలుగు: దిలావర్​పూర్​లో నిర్మల్ ఆర్డీవో పట్ల రైతులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎస్ శాంతి కుమారిని ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి కోరారు. ఆర్డీవో రత్నకల్యాణిని మంగళవారం ఆరు గంటల పాటు కారులోనే నిర్బంధించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని సీఎస్​కు వినతిపత్రం అందజేశారు.

ALSO READ : వారంలో మూడు సార్లు ఫుడ్​ పాయిజనా.. అధికారులు నిద్రపోతున్నరా?: హైకోర్టు సీరియస్​

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు మంగళవారం ధర్నా చేపట్టారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వారితో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోను కారు నుంచి దిగనివ్వలేదని చెప్పారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క‌‌‌‌లెక్టర్ల సంఘం కార్యదర్శి రామకృష్ణ, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యద‌‌‌‌ర్శులు ఎస్‌‌‌‌.రాములు, ర‌‌‌‌మేశ్ పాక‌‌‌‌, సెక్రట‌‌‌‌రీ జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ ఫూల్‌‌‌‌సింగ్ చవాన్ త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.