
- దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు
- ఈస్గాంలో ఏడు వేల నాటు కోళ్లు మృతి
- ఆసిఫాబాద్ జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి
నెట్‌వర్క్, వెలుగు : ఉత్తర తెలంగాణలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన అల్లకల్లోలం చేసింది. చేతికొచ్చిన పంట నేలకొరగగా.. మార్కెట్లలోకి వచ్చిన వరి, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటి గోడ కూలి మీద పడడంతో ఒకరు చనిపోయారు. పలుచోట్ల రోడ్లు జలమయం కాగా.. కరెంట్ వైర్లు తెగి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఈదురుగాలుల బీభత్సం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలులకు కాగజ్‌నగర్ పట్టణంలో భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. నౌవేగాం బస్తీలో పక్కింటి గోడ కూలి అక్కడ కూర్చున్న చందన్ కాడే దౌలత్ (79) అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో గాలుల ధాటికి ఒక ఇల్లు కూలిపోయింది. కాగజ్‌నగర్ మండలం ఈస్గాంలో నాటుకోళ్ల ఫారం పైకప్పు ఎగిరిపోయి ఏడు వేల కోళ్లు చనిపోయాయి.
కౌటల, చింతలమానేపల్లి, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, రెబ్బెన, దహేగాం, వాంకిడి మండలాల్లో రాళ్ల వాన, ఈదురుగాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. మంచిర్యాల జిల్లాలో సాయంత్రం 4 గంటల నుంచి వడగండ్ల వాన కురిసింది. లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో రాళ్లు పడ్డాయి. పలుచోట్ల మక్క నేల వాలింది. దండేపల్లి మండలం చెల్కగూడెం రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట, భిక్కనూరు మండలాల్లో వర్షం, పిడుగులు పడ్డాయి.
లింగంపేట మండలంలోని పోతాయిపల్లి శివారులో పిడుగుపడి మూడు గొర్రెలు చనిపోగా, లింగంపల్లి శివారులో పిడుగు పడి రెండు బర్రెలు చనిపోయాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో వడ్యారం సిద్దయ్య ఇంటిపై పిడుగు పడి.. ఇంటి స్లాబ్, గోడ, రోడ్డు వెంట ఉన్న చెట్లు కూలిపోయాయి. పోతంశెట్టిపల్లి వైన్స్ సమీపంలో కరెంట్ పోల్స్ పడి ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగాయి. సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, పుల్కల్, నారాయణఖేడ్, రాయికోడ్ మండలాల్లో వర్షం పడింది.
దెబ్బతిన్న వరి, పసుపు, మక్క
నిజామాబాద్ జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులతో యాసంగి పంటలకు నష్టం జరిగింది. రెంజల్, ఎడపల్లి, నవీపేట మండలాల్లో వాన వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలకొరిగింది. సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో వరి ధాన్యం రాలిపోయింది. జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. సాలూరా మండలంలో 50 ఎకరాల్లో మక్కజొన్న పడిపోయింది.
నిజామాబాద్ మార్కెట్‌లోకి రైతులు తెచ్చిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. బస్తాలపై టార్పాలిన్లు కప్పినా కింది నుంచి నీళ్లు పారి సుమారు 200 బస్తాల ధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం, రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చొప్పదండి మార్కెట్‌లో ఆరబోసిన మక్కలు వర్షపు నీటితో కొట్టుకుపోగా, మక్కల బస్తాలు తడిచిపోయాయి. ఈ మండలంలో మొక్కజొన్న నేలవాలింది.