కంటోన్మెంట్, వెలుగు: అనుమానం పెనుభూతంగా మారి భార్య, 11 నెలల పసిబిడ్డను వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆపై తాను రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర కు చెందిన గణేశ్(35) , స్వప్న(30) దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు త్రివేణి, తనుశ్రీ, నక్షత్ర (11నెలలు ) ఉన్నారు. బతుకుదెరువు కోసం వీరంతా రెండున్నరేండ్ల కిందట నగరానికి వచ్చి బోయినపల్లిలోని ఆర్య సమాజ్ వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. చిన్న కుమార్తె నక్షత్ర తనకు పుట్టలేదని భార్యపై గణేశ్ అనుమానం పెంచుకున్నాడు.
ఇదే విషయమై దంపతుల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా వీరిమధ్య గొడవ జరగగా, భార్య స్వప్న, నక్షత్ర గొంతుకు వైరు బిగించి గణేశ్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య, కూతురును హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పి ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన బోయిన్పల్లి పోలీసులు అతని ఇంటికి వెళ్లి చూడగా, స్వప్న, 11 నెలల చిన్నారి విగతజీవులుగా పడి ఉన్నారు. గణేశ్ఆచూకీ కోసం గాలించగా, బోయినపల్లి నుంచి సుచిత్ర వైపునకు వెళ్లే రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు.
తల్లిదండ్రులను కోల్పోవడంతో మిగిలిన ఇద్దరు చిన్నారులు త్రివేణి(6), తనుశ్రీ (4) అనాథలుగా మారారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురి డెడ్‌బాడీలను గాంధీ మార్చిరీకి తరలించి, వారి బంధువులకు సమాచారం అందించారు.