- ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
మెట్ పల్లి, వెలుగు : తన భార్యతో చనువుగా ఉంటూ, కాపురానికి రాకుండా అడ్డుకుంటున్నాడన్న అనుమానంతోనే ఓ వ్యక్తి యువకుడిని హత్య చేశాడు. ఈ నెల 19న నిజామాబాద్ లో జరిగిన మహ్మద్ రజాక్ (27) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ లక్ష్మీనారాయణ సోమవారం వెల్లడించారు. నిజామాబాద్ లోని గాజులపేటకు చెందిన మహ్మద్ సులేమాన్, అతడి భార్య మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ నెల 6న మరో మారు పంచాయితీ జరుగగా అక్కడికి వచ్చిన రజాక్ సులేమాన్ ను అవమానించాడు. దీంతో రజాక్ తన భార్యతో చనువుగా ఉంటున్నాడని అనుమానం పెంచుకున్న సులేమాన్ రజాక్ ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని తన తమ్ముడు లతీఫ్, అతడి ఫ్రెండ్స్ జక్కని భూమేశ్, సాయికి చెప్పడంతో వారంతా కలిసి రజాక్ ను మర్డర్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 16న రజాక్ ను బైక్ పై ఎక్కించుకొని రేగుంట రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వైపు తీసుకెళ్లారు. అక్కడ చెట్ల పొదల్లో సులేమాన్, భూమేశ్, లతీఫ్ కలిసి రజాక్ ను తీవ్రంగా కొట్టారు. తర్వాత అటు వైపు కొందరు వ్యక్తులు రావడం గమనించిన సాయి వారికి సమాచారం ఇవ్వడంతో అందరూ కలిసి బైక్ లపై పారిపోయారు. తీవ్రగాయాలతో పడినున్న రజాక్ ను స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. నిజామాబాద్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఈ నెల 19 రజాక్ చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కొత్త బస్టాండ్ సమీపంలో తిరుగుతున్న సులేమాన్, లతీఫ్ ను అరెస్ట్ చేశారు. భూమేశ్, సాయి పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు.