వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండని.. భర్తను చంపించిన భార్య

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించిందో భార్య. గత శనివారం జిల్లాలోని పొడిచేడు వద్ద డెడ్​బాడీ దొరకగా, పోలీసులు 48 గంటల్లో మర్డర్ మిస్టరీని ఛేదించారు. డీసీపీ రాజేశ్​చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎం) మండలం లింగరాజుపల్లికి చెందిన నల్ల సైదులుకు, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన ధనలక్ష్మికి 11 ఏండ్ల కింద పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ధనలక్ష్మి మూడేండ్లుగా గురజాలకు చెందిన ఎడ్ల నవీన్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల ఆ విషయం తెలుసుకున్న సైదులు భార్యతో గొడవ పడ్డాడు. ఇరుకుటుంబాల పెద్దలు పంచాయితీ పెట్టి సర్ది చెప్పగా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ నెల 10న బోనాల పండుగ ఉందని చెప్పి ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. 

ఆ టైంలో ప్రియుడు నవీన్​ను కలిసి తన భర్త వేధిస్తున్నాడని, ఎలాగైనా చంపేద్దామని స్కెచ్ వేసింది. నవీన్​తన మేనల్లుడు స్వామితో కలిసి సైదులను హతమార్చడానికి రెడీ అయ్యాడు. 11న సైదులు గురజాలకు రాగా, ప్లాన్ ప్రకారం నవీన్, స్వామితో కలిసి ధావత్ చేసుకోమని ధనలక్ష్మి భర్తను పంపింది. ముగ్గురూ నార్కట్ పల్లి మండలం అమ్మనబొలు వద్ద ఫుల్లుగా మద్యం తాగారు. అనంతరం నవీన్, స్వామి తాడుతో సైదులు గొంతు బిగించి చంపేశారు. డెడ్​బాడీని నవీన్​ఆటోలో తీసుకెళ్లి మోత్కుర్ మండలం పొడిచేడు సమీపంలోని మూసి బ్రిడ్జి వద్ద పడేశారు. చనిపోయాడో లేదో అనే అనుమానంతో అక్కడ మరోసారి గొంతుకు తాడు బిగించి గట్టిగా లాగారు. శనివారం ఉదయం డెడ్​బాడీని గుర్తించిన పోలీసులు భార్య ధనలక్ష్మికి సమచారం ఇచ్చారు. ఎవరో చంపేశారనే అనుమానంతో జాగిలాలను రంగంలోకి దింపారు. ధనలక్ష్మి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. ఆటోలో పారిపోతున్న నవీన్, స్వామిని అనాజీపురం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురిని రిమాండుకు తరలించినట్టు డీసీపీ తెలిపారు.