భార్య మరణాన్ని తట్టుకోలేక..పెండ్లి రోజే ఆత్మహత్య

  • ఆమె ఉరేసుకున్న చెట్టు కిందే పురుగుల మందు తాగిన భర్త

హుస్నాబాద్​, వెలుగు: ఇష్టపడి పెండ్లి చేసుకున్న భార్య సూసైడ్​ చేసుకోగా, ఆమె లేని బతుకు తనకెందుకని ఓ భర్త పెండ్లిరోజునే ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరుకు చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్​కు హుస్నాబాద్​లోని గోదాంగడ్డకు చెందిన శారదతో ఏడాది కింద పెండ్లి అయ్యింది. శారద తండ్రి కొన్నేండ్ల కింద చనిపోగా, తల్లి ముంబైలో కూలీ పనులు చేస్తోంది. శారదను ఆమె పెద్దమ్మ శాంతమ్మ పెంచి పెద్దచేసింది. చుట్టాల ద్వారా శ్యాంసుందర్ కు శారదను ఇచ్చి పెండ్లి చేసింది. కొద్దిరోజులు బాగానే ఉన్న వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి.

శారద తనతో చనువుగా ఉండకపోవడంతో శాంతమ్మకు శ్యాంసుందర్ సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె శారదకు నచ్చజెప్పి భర్తతో మంచిగా ఉండాలని చెప్పినా శారద అత్తింటికి వెళ్లకుండా పుట్టింటివద్దే ఉండేది. తనకు ఇష్టంలేని పెండ్లి చేశారని ఏడ్చేది. అదే బాధతో ఆమె 8 నెలల కింద ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుంది.  అప్పటి నుంచి శ్యాంసుందర్(35)​ తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. సోమవారం తమ పెండ్లిరోజు కావడంతో ఆదివారం రాత్రి హుస్నాబాద్ వచ్చాడు. తన భార్య శారద ఉరేసుకున్న చెట్టుకిందనే వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి హుస్నాబాద్​లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.  అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.