నల్లా నీళ్ల కోసం గొడవ..కొడుకుతో కలిసి భర్తపై కత్తితో భార్య దాడి

మహబూబాబాద్‌ అర్బన్‌, వెలుగు : నల్లా నీటి విషయంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తిపై అతడి భార్య, కొడుకు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... శ్రీనగర్‌కు చెందిన లింగాల మనోహర్‌, శారదకు 23 ఏళ్ల కింద పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.  ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకుల కోసం అప్లై చేసి, ఎనిమిదేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. శనివారం నల్లా నీళ్ల విషయంలో మనోహర్‌కు, అతడి కొడుకు పవన్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో శారద, పవన్‌ కలిసి కత్తితో మనోహర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు మహబూబాబాద్‌ హాస్పిటల్‌కు తరలించారు. శారద, పవన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.