- పోలీసులకు భర్త ఫిర్యాదు
- ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఘటన
ఆగ్రా: తన భర్తను చంపితే రూ.50 వేల రివార్డ్ ఇస్తానంటూ ఏకంగా వాట్సాప్ స్టేటస్ పెట్టిందో మహిళ. దీన్ని చూసిన భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా జిల్లా బాహ్ బ్లాక్‌కు చెందిన వ్యక్తి మధ్యప్రదేశ్ లోని భింద్ గ్రామానికి చెందిన యువతిని 2022 జులై 9న పెండ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు వారు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2022 డిసెంబర్లో ఆమె భర్త ఇంటి నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటున్నది. ఆ తర్వాత భార్య తనపై కేసు పెట్టిందని.. భరణం కోసం దావా కూడా వేసిందని భర్త తెలిపారు.
అయితే.. తాజాగా ‘‘నా భర్తను చంపితే రూ.50 వేలు రివార్డ్ ఇవ్వబడును” అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వారికి అందజేశాడు. అలాగే 2023 డిసెంబర్ 21న తాను భింద్ వెళ్లి తిరిగి వస్తుండగా అత్తమామలు తనను చంపుతామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఈ గొడవలన్నింటికి అదే కారణమని ఆరోపించాడు. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు తెలిపారు. బాహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్యామ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ భర్త ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.