
- పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు
- ఎంక్వైరీ చేసి నిందితురాలి అరెస్ట్
- నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన
నల్గొండ, వెలుగు: భర్త జాబ్ ను దక్కించుకునేందుకు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టి నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. మంగళవారం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. నల్గొండ టౌన్ కు చెందిన అహ్మదిబేగం ఐదో కొడుకు మహ్మద్ ఖలీల్ హుస్సేన్(44) శాలిగౌరారం జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో అటెండర్. కాగా.. అక్సర్ జహతో అతనికి 2007లో పెండ్లి అవగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కొంతకాలంగా భర్తను భార్య చిత్రహింసలు పెడుతుండగా మతిస్థిమితం కోల్పోయి ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. దీంతో భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. భర్త జాబ్ దక్కించుకునేందుకు చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. గత నెల 22న ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఖురాన్ పుస్తకం పెట్టే స్టాండ్ తో భర్త తలపై భార్య గట్టిగా కొట్టడంతో సృహ కోల్పోయాడు. మరుసటి ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుండానే ఇంటికి తీసుకెళ్లింది.
అదే రోజు రాత్రి ఖలీల్ కు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందని మరోసారి ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లింది. దీంతో తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని, కోడలే హత్య చేసిందని మృతుడి తల్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఖలీల్ ను కొట్టి ఊపిరాడకుండా చేయడంతోనే చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. మంగళవారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కేసును ఛేదించిన నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డిని డీఎస్పీ అభినందించారు.