భర్తకు పురుగుల మందు తాగించి చంపిన భార్య

  • ఆసిఫాబాద్ జిల్లా తక్కలపల్లిలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు:  భర్తకు పురుగుల మందు తాగించి భార్య చంపేసిన ఘటన ఆసిఫాబాద్​జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సతీశ్(30), రజిత దంపతులు. కాగా.. భర్త రోజూ మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. గురువారం రాత్రి సతీశ్​ మద్యం తాగి అదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అక్కడికి వెళ్లిన రజిత.. పురుగుల మందు గ్లాసులో పోసి భర్తకు తాగించింది. అదే గ్రామానికి చెందిన గాజుల సందీప్ చూసి సతీశ్​కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే వెళ్లి చూడగా సతీశ్ నురగలు కక్కుతూ మంచంపై పడుకుని కనిపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోయాడు. సతీశ్ తల్లి అమృత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.