తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి.. నవంబర్ 17, 18 తేదీలలో జరుగుతున్న ఈ పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్న నిబంధనను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్న క్రమంలో చాలా చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లలేక ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భార్య గ్రూప్ 3 పరీక్ష రాస్తుండగా.. 10 నెలల కొడుకును నిద్రపుచ్చుతూ సెంటర్ బయట ఉన్న దృశ్యం ఆకట్టుకుంది.
కరీంనగర్లోని సిద్దార్థ కాలేజీ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటన. అకౌంటెంట్ గా పనిచేస్తున్న శంకర్ అనే యువకుడు తన భార్య స్వప్న స్థానిక సిద్ధార్థ పాఠశాలలో గ్రూప్ 3 పరీక్ష రాస్తుండగా.. శంకర్ సెంటర్ బయట దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని ఇలా జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించిన దృశ్యం.. ఆధునిక తండ్రి పాత్రకు ప్రతిరూపంగా నిలిచింది.
ఆధునిక కాలంలో మహిళల కెరీర్ ఎదుగుదలలో వారి లైఫ్ పార్టనర్ల పాత్ర ఎంతో ముఖ్యంగా మారిందని అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ సంఘటన.