భర్త డ్రైవింగ్ వృత్తి మానడం లేదని భార్య ఆత్మహత్య

  • నల్గొండ జిల్లా పాలవరం తండాలో ఘటన 

కోదాడ, వెలుగు : తన భర్తకు ఎంత చెప్పినా డ్రైవింగ్ వృత్తిని వదులుకోవడం లేదని ఓ భార్య నల్గొండ జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అనంతగిరి పోలీసుల కథనం ప్రకారం..జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండాకు చెందిన గుగులోతు కౌసల్య బిడ్డ అంజలి అలియాస్ రమ్యను పాలవరంతండాకు చెందిన భూక్య   రవికి ఇచ్చి 2015 లో పెండ్లి జరిపించారు. 

వీరికి ఒక కొడుకు ఉన్నాడు. రవి కార్​డ్రైవర్​గా పని చేస్తున్నాడు. వేరే వాళ్ల కారుకు కిరాయి వచ్చినప్పుడల్లా వెళ్తాడు. రాత్రి డ్యూటీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి దగ్గర అందుబాటులో ఉండడం లేదని ఆ వృత్తి మానెయ్యమని కొంతకాలంగా చెబుతూ వస్తోంది. వేరే పనేదైనా చేసుకోవాలని కోరుతోంది. కానీ, రవి ఆమె మాట వినలేదు. 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం కూడా ఇదే విషయంపై గొడవ జరగడంతో క్షణికావేశంలో ఇంట్లో ఎవరు లేని టైంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అంజలి  తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.