భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డ్యూటీకి వెళ్లిన భర్త ఫోన్​ఎత్తలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని రైల్వే కాలనీకి చెందిన భూక్యా నాగేశ్వరరావు, ప్రమీలారాణి(29) భార్యాభర్తలు. వీరికి ఐదేండ్ల పాప ఉంది. కాగా భార్యాభర్తలు ఇటీవల తరచూ గొడవపడుతున్నారు. రైల్వేశాఖలో ఎలక్ట్రీషన్​గా పనిచేస్తున్న నాగేశ్వరరావు శనివారం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లగా, భార్య అతనికి పలుమార్లు ఫోన్​చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్​లేకపోవడంతో కలవలేదు. కలిసిన టైంలో సరిగా వినపడటం లేదని నాగేశ్వరరావు ఫోన్​లిఫ్ట్​చేయలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమీలారాణి రాత్రి ఇంటికి వచ్చిన భర్తతో గొడవపడింది. కొన్నాళ్లుగా తనని, కూతురిని పట్టించుకోవడం లేదంటూ భర్తతో వాపోయింది. సిగ్నల్ లేకపోవడంతో ఫోన్​మాట్లాడలేకపోయానని చెప్పినా భార్య వినలేదు. భర్తతో గొడపడుతూనే రెండు సార్లు ఉరివేసుకునేందుకు యత్నించగా నాగేశ్వరరావు ఆపాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమీలారాణి ఇంట్లోని గదిలో ఉరివేసుకుంది. గమనించిన కూతురు హాల్లో నిద్రపోతున్న తండ్రి వద్దకు వెళ్లి విషయం చెప్పగా, భర్త వచ్చి చూసేసరికి భార్య చనిపోయి ఉంది. ఆదివారం ఉదయం నాగేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇదిలా ఉండగా, భార్యాభర్తలు తరుచూ గొడవలు పడుతున్నారని, దీంతోనే ప్రమీల ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.